ఇస్రోకు ‘కస్తూరి’ తిలకం

0
99

పరిమళించిన విజ్ఞాన కణిక – డాక్టర్ కస్తూరి రంగన్

(వాడవల్లి శ్రీధర్)
మన దేశం విజ్ఞాన భూమి. మన దేశ శాస్త్రవేత్తల సేవలు దేశానికి గర్వకారణాలు. అలాంటి మేధావుల్లో ఒకరు డాక్టర్ కస్తూరి రంగన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) కు ఆయన చైర్మన్‌గా 1994 నుండి 2003 వరకు సేవలందించారు. ఈ పదవీకాలంలో ఆయన చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు ఇస్రోను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి.
ఆదర్శ నాయకత్వం
ఆయన గతంలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌గా ఉన్నారు, అక్కడ ఆయన కొత్త తరం అంతరిక్ష నౌక, ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT-2), ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (IRS-1A & 1B) అలాగే శాస్త్రీయ ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించారు. IRS (Indian Remote Sensing) ఉపగ్రహాల అభివృద్ధిని వేగవంతం చేశారు. ఇవి వ్యవసాయం, అటవీ వనరులు, నీటి వనరుల నిర్వహణకు కీలకంగా మారాయి. INSAT శ్రేణి ద్వారా కమ్యూనికేషన్, టెలివిజన్ ప్రసారాలు, వాతావరణ సూచనలు వంటి రంగాల్లో అభివృద్ధికి మార్గం ఏర్పాటైంది. PSLV C2 (1999) ద్వారా మొదటిసారిగా బహుళ దేశాల శాటిలైట్లను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి, భారత్‌ను అంతర్జాతీయంగా గుర్తింపుకు తీసుకువచ్చారు.చంద్రయాన్-1, భారత్ తొలి చంద్రయాన్ మిషన్‌కు ప్రాథమిక రూపకల్పన ఆయన నేతృత్వంలోనే ప్రారంభమైంది. విద్యార్థులు, యువతకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ఇస్రోకి సేవల అనంతరం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) రూపకల్పనలో ప్రధాన శిల్పిగా మారారు. మాతృభాషలో విద్యాభ్యాసం, 5+3+3+4 విద్యా నిర్మాణం, సృజనాత్మకతకు ప్రాధాన్యం, మార్కులకు బదులు వ్యక్తిత్వ వికాసానికి విద్య ఉండాలన్న దృక్కోణం – ఇవన్నీ ఆయన మార్గదర్శకతలో NEP ద్వారా ప్రతిఫలించాయి. “చదువు కోసం చదవడం కాకుండా, జీవితం కోసం చదవాలి” అనే తత్వాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
పురస్కారాలు, గౌరవాలు
డాక్టర్ కస్తూరి రంగన్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను అందించింది: పద్మశ్రీ (1975), పద్మభూషణ్ (2000), పద్మవిభూషణ్ (2020)అలాగే అనేక శాస్త్రీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
పరిమళించే ప్రజ్ఞాన తేజోమయుడు
డాక్టర్ కస్తూరి రంగన్ విజ్ఞాని మాత్రమే కాదు. ఆయన విజ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమైన దానికంటే గొప్పది – అది జీవితాన్ని పరిమళింపజేసే గుణగంధం. విజ్ఞానం కోసం తపస్సు చేసిన తత్వవేత్త. యువతతో మాట్లాడే ఆయన సరళి ఎంతో ప్రేరణాత్మకం.“అంతరిక్షాన్ని చూస్తే మనలో మరింత వినయం కలుగుతుంది” అనే ఆయన మాటలు జీవిత పాఠంగా నిలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here