కడప నుంచి చెన్నై… కందుకూరు మీదుగా…
ఈనాడు – నేను: 3
(సుబ్రహ్మణ్యం వి ఎస్ కూచిమంచి)
ఒకవారం రోజుల తరవాత.. మా చిన్నాన్న గారి దగ్గర నుంచి ఫోను. ఆయనో జాతీయ బ్యాంకులో మేనేజర్. మా పిన్నిగారు అదే బ్యాంకు చెందిన గ్రామీణ బ్యాంకు మేనేజర్. ఆ బ్యాంకులో క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి. కడప (వారుండేది అక్కడే) వస్తే ట్రై చెయ్యొచ్చనేది ఫోను సారాంశం. బ్యాంకు ఉద్యోగమంటే ఎవరికి చేదు చెప్పండి. మరుక్షణం కడపకు ప్రయాణం. ఓ మూడు నెలల తరవాత పరీక్ష రాశా. మొదటి పదిమందిలో నిలిచా. ఇంటర్వ్యూనే తరువాయి. ఆ రోజు రానే వచ్చింది. అందులో నన్నడిన ప్రశ్నలు ఇవి.. డిగ్రీలో నీ సబ్జెక్టులేమిటి… రాయలసీమలో మంచినీటికి దేనిపై ఆధారపడతారు.. బ్యాంకు ఉద్యోగం నీకెందుకు ఇష్టం? అన్నింటికీ టకాటకామని సమాధానం చెప్పేశా. నా ఇంటర్వ్యూ అవుతుండగా.. లోపలికి ఒక కాగితం వచ్చింది. అది చూసిన ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ అడిగారు.. మీదే ఊరు… రాజమండ్రి… ఓకే… యూ కెన్ గో…
వచ్చేశా!
మూడు రోజులకు ఫలితాలు ప్రకటించారు. మనకి ఉద్యోగం రాలేదు. కారణం..నాన్ లోకల్ క్యాండిడేట్. నిరాశ. ఉన్న ఉద్యోగం వదులుకుని వచ్చా. మళ్ళీ వెడితే ఏం బాగుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు నా మెదడుని తొలిచేశాయి. మరోపక్క.. మా చిన్నాన్న దంపతులు మరో ఉద్యోగానికి ప్రయత్నం ప్రారంభించారు.
తప్పులు వెతికి హైదరాబాద్‌కు
ఈలోగా.. ప్రతి ఉదయం నా అభిమాన పత్రిక ఈనాడును ఆమూలాగ్రం చదవడం. అందులో తప్పులు(అక్షర) వెతకడం. వాటిని ఒక చోట నెంబర్ రాయడం. అలా వారం రోజులు చేసిన తరవాత లెక్కపెడితే ఐదు వందల డెబై నాలుగు తేలాయి. వీటిలో ఎడిటోరియల్‌లో కూడా ఉన్నాయి. అవే ప్రతులను జత చేసి, రామోజీరావు గారికి లేఖ రాశా. అయ్యా! మీ పేపర్లో ఇన్ని తప్పులు వచ్చాయి. కొంచెం సరిదిద్దుకోండీ అని. వారంరోజులకల్లా ఈనాడు చైర్మన్ ఆఫీసు నుంచి జవాబు.
ప్రియమైన పాఠక దేవుడా! నీ ఆసక్తికి చాలా సంతోషం. మా తప్పుల్ని సరిదిద్దుకుంటాం. మీరెన్నిన తప్పుల్లో చాలావరకూ సాంకేతికమైనవి. వాటినీ పరిహరిస్తామని హామీ. కింద ఫర్ ఛైర్మన్ పిడిపి వర్మ(పి.దేవీ ప్రసాదవర్మ) గారి సంతకం.
నా ఆనందానికి హద్దుల్లేవు. కొన్నాళ్ల తరవాత సిరీస్ కంపెనీలో మెడికల్ రిప్రెజెంటేటివ్ పోస్టుందంటే హైదరాబాద్‌కి వెళ్లా. వెడుతూ.. ఈ లేఖను జేబులో పెట్టుకున్నా. పనయిన తరవాత.. నువ్వు పనికిరావనిపించుకుని… జేబులో ఉన్న లేఖతో ఈనాడు ఆఫీసుకెళ్ళా. ఎవర్ని కలవాలి. లేఖ తెరిచి చూశా. వర్మ గారి పేరుంది. సెక్యూరిటీ వారికి ఆయన పేరు చెప్పా కలవాలి. ఆయన అనుమతి తీసుకుని లోపలికి అడుగుపెట్టా. వేలాది మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్నం పెడుతున్న ఆ కార్యాలయంలోకి వెడుతుంటే అదో రకమైన అనుభూతి (అనుభవిస్తే గానీ తెలియదు). ఓ బాయ్ వచ్చాడు. వర్మ గారి దగ్గరకు తీసుకెళ్లాడు. లెటర్ చూపించా. ఆయనకు అర్థమైపోయింది. విషయం ఏమిటని అడిగారు. ఈనాడులో ఉద్యోగం చేయాలనేది నా ఆశ అని చెప్పా. ఖాళీలున్నప్పుడు ప్రకటన ఇస్తారు చూసి దరఖాస్తు చేసుకోమని చెప్పి, ఓ టీ ఇప్పించి పంపించారు. అప్పటినుంచి ఈనాడులో ఉద్యోగాలు ఎప్పుడు పడతాయా అని చూడడమే పనిగా పెట్టుకున్నా.
చెన్నైకి…..
కొంతకాలానికి నాకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన బ్యాంకు చైర్మన్(పేరు అనవసరం) తనకు తెలిసిన కస్టమర్ డాక్టర్ డి.వి.ఆర్. ప్రకాశరావుగారికి చెప్పి ఆయనకున్న యానిమల్ సప్లిమెంట్ ఫీడ్ కంపెనీ(చెన్నై)లో ఉద్యోగం ఇప్పించారు. జీతం ఐదొందలు. అంజికరైలోని నెల్సన్ మాణిక్కం రోడ్‌లోఉన్న జేవిఎల్ టవర్‌లో ఆఫీసు. ఆవడిలో విడిది. అక్కడి నుంచి ప్ర తి రోజు రెండు రైళ్ళు మారి నుంగంబాక్కం దాకా రావడం. అక్కడినుంచి నడక రెండు కిలోమీటర్లు. దారిలో ఒకరోజు సినిమా నటుడు నటభూషణ్ శోభన్ బాబు కనిపించారు ఓ సందులోకి వెడుతూ. ఆశ్చర్యం ఆయన వెడుతున్న ఇంటి గోడ మీద శోభన్ అని కనిపించింది. అదే ఆయన ఇల్లు. ఇక రోజూ ఆ ఇంటిలోకి తొంగి చూడడం. అభిమానులు వచ్చినప్పుడు బయట కనిపించేవారు.
ఓ రోజు రోడ్డు మీద ఎదురయ్యారు. అప్రయత్నంగానే… చేయి చాచాను. ఆయన కూడా చాలా స్నేహపూర్వకంగా కరచాలనం చేసి, నా వివరాలడిగారు. అది ఒకే నిముషం. ఎన్నో రోజులు గుర్తుండిపోయిన క్షణం. రెండేళ్ల తరవాత అంటే పందొమ్మిది వందల ఎనబైఎనిమిదిలో ఫ్యాక్టరీలో అవసరమై అక్కడికి పంపారు. ఆవడినుంచి తిరుపతి వెళ్లే దారిలో బండికావనూరు(ఇరవై ఐదు కిమీ). బండిచ్చారు. రెండు నెలలు తిరిగిందో లేదో… ఓ చిన్నపాటి యాక్సిడెంట్. కుడికాలి మడమ దగ్గర ఫ్రాక్చర్. రెండు నెలల విశ్రాంతి అవసరమన్నారు. ఇక అక్కడ నాకు సాయం ఎవరూ లేకపోవడంతో మా నాన్నగారు పనిచేస్తున్న ప్రకాశం జిల్లాలోని కందుకూరు వెళ్ళాను.
శక్తినిచ్చిన ప్రకటన
ఇన్నేళ్ళ పాటూ ఈనాడు చూస్తూనే ఉన్నాను. ఉద్యోగ ప్రకటన కోసం. ఆ రోజు రానే వచ్చింది ఓ నెల రోజులకు. న్యూస్‌టుడే శీర్షికతో సబ్‌ఎడిటర్లు కావలెను అని. లేని శక్తి తెచ్చుకుని సర్టిఫికెట్లు పెట్టి, వారు కోరిన విధంగా ఓ వ్యాసం రాసి పంపాను. కాస్త నడవడానికి వీలైన సమయంలోనే.. రాత పరీక్షకు రమ్మని పిలుపు అందింది. తెలుసున్న వారిని తోడు తీసుకుని విజయవాడ వెళ్ళాను. మాంటిసోరి కాలేజీలో పరీక్ష. ఒక ఇన్విజిలేటర్ డి. చంద్రశేఖర్ (ఈయన ఇటీవలే కన్నుమూశారు). విజయవాడ డెస్కుకు ఇన్చార్జి. పరీక్ష అయిన తరవాత ఆయన్ను పలకరించా. ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. రిజల్టు ఎప్పుడొస్తుందని అడిగా. ఓ పదిహేనురోజులు పట్టచ్చన్నారాయన. ఇంటికొచ్చి మళ్ళీ ఎదురు చూపులు. ఈలోగా మా నాన్నగారికి రాజమండ్రి బదిలీ అయ్యింది. ఈలోగా ఇంటర్వ్యూకూ పిలుపు అందింది. ఈ ఒక్క మెట్టు ఎక్కితే నా కల సఫలమవుతుంది. ఈనాడులో నేను ఉద్యోగిగా చేరవచ్చు. ఈ ఆలోచన నాకు నిద్ర లేని రాత్రుల్నే మిగిల్చింది.
ఇంటర్వ్యూ రోజు
ఇంటర్వ్యూ రోజూ వచ్చింది. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరున్న కార్యాయానికి వెళ్ళాను. అప్పటికే అక్కడ నలుగురు కూర్చుని ఉన్నారు. ఒకరు పత్రి వాసుదేవన్, సిహెచ్. వేణు, గోపరాజు మల్లపరాజు, సత్యారావు పట్నాయక్. అప్పుడు రిసెప్షన్‌లో రాజేష్ కూర్చుని ఉన్నారు. చాలా స్నేహశీలి. తెల్లటి దుస్తులతో మరింత తెల్లని పలువరుసతో నవ్వుతూ.. మాలో ఉన్న టెన్షన్ పోగొట్టేలా మాట్లాడారు. ఒక్కొక్కరూ వెళ్లొస్తున్నారు. అందర్నీ అడుగుతున్నా ఏం ప్రశ్నించారని.. ఒకరు చెబుతున్న దానికీ మరొకరు చెబుతున్న దానికీ పొంతన లేదు.. చాలా కష్టమే అనుకున్నా. మనసు ఉగ్గబట్టుకున్నా. ఈలోగా ఫోను మోగింది రాజేష్ నాకేసి చూసి పైకి వెళ్ళి రండి..ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. కాళ్ళు వణుకుతుండగా మూడంతస్తులు ఎక్కా. ..పెంట్ హౌస్‌లా ఉన్నదానిపై ఈనాడు అనే అక్షరాలు ఎర్ర రంగులో నన్ను ఊరిస్తూ కనిపించాయి. మా అమ్మగారిని మనసులో తలచుకున్నా. లోపలకు అడుగుపెట్టా. తెల్లటి దుస్తుల్లో ఉన్న వ్యక్తి(సగం బట్టతల).. నల్లటి ఫ్రేమున్న కళ్ళద్దాల్లోంచి చూస్తున్నారు. రా.. కూర్చో అన్నట్లుగా చూశారు. అలా అంటున్నప్పుడు ఆ కళ్లల్లోకి చూశా.. పులి కళ్ళు.. స్కానింగ్ మిషన్లకీ కూడా అంత పవర్ ఉండదేమో పైనుంచి కిందకి నన్ను ఆయన కళ్లతోనే చదివేశారు. పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమడుగుతారో. ఏమిటో… ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా… ఆయనే రా… మో…. జీ… రా..వు…గారు.
(ఆయన నన్నేమి అడిగారు..నేనేమి చెప్పాను.. ఎంత సేపు ఆయనతో మాట్లాడాను ఏం మాట్లాడాను… రేపు)