బడి పంతులు ఎలా ఉండాలో చెప్పిన రామ్మూర్తి మాస్టారు

0
80

ఎపిసోడ్ కు తగ్గట్టుగా రాఘవేంద్రరావు దర్శకత్వం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

బడి పంతుళ్ళ జీవితాలు ఎలా ఉండేవో చూసిన కళ్ళకు అద్భుతంగా నచ్చేసే కథా సుధ ఎపిసోడ్ ఇది. 1990 ల నాటి కథ అని చెప్పడానికి అప్పట్లో ఫేమస్ స్కూటర్ అయిన బజాజ్ చేతక్ ను ఈ కథలో మాస్టారు వాడతారు. పేరు రామమూర్తి(తనికెళ్ళ భరణి). ఆయనకు తగ్గ భార్య పాత్రలో సుహాసిని మెప్పించారు. భార్యకు మంచి పట్టు చీర కొనిపెట్టని పాత్ర భరణిది. ప్రతి నెల 500 రూపాయలు తక్కువగా జీతాన్ని ఇంట్లో ఇస్తుంటారు. ఖర్చు కటాకటిగా సరిపోతుంటుంది. పాఠశాలలో పిల్లల్ని కన్నపిల్లల్లా చూసుకుంటారు. అందరు మాస్టార్ల లాగ ఇంట్లో ట్యూషన్లు చెప్పి నాలుగు రాళ్లు వెనకేసుకునే తత్త్వం కాదాయనది. భార్యకు ఈ తత్త్వం బోధ పడదు.

ఒక విద్యార్ధి పుట్టిన రోజుకు వెళ్లిన ఈ దంపతులిద్దరికీ ఒక విద్యార్ధి తల్లి హితబోధ చేయబోతుంది. నా పట్టు చీర ఖరీదు ఇంతాఅంటూ అందరికీ చెబుతుంది. నగలు ప్రదర్శిస్తుంది.

ఒక విద్యార్ధి భోజనం నేల పాలయితే రామ్మూర్తి మాస్టారు ఏమి చేశారో తెలుసుకుంటే ఆయన మంచితనం అర్ధమవుతుంది. పదవీవిరమణ రోజున జరిగిన సంఘటనలు మాస్టారి భార్యను కదిలిస్తాయి. ఆ రోజున ఆమె ఏమి మాట్లాడిందీ… ఏమి చేసిందీ ఈ ఎపిసోడ్ కి హైలైట్.

భరణి ప్రధానోపాధ్యాయుడు, భర్త పాత్రలలో ఒదిగిపోయారు. అవసరం ఉన్న వాళ్లకి చేతికి ఎముక లేనట్టు ఆయన సాయం చేస్తుంటారు.
ఎక్కడా గాడి తప్పని కథని కె. రాఘవేంద్రరావు దర్శకత్వ సహకారంలో చక్కగా తెరకు ఎక్కించారు. ఆయన రాసిన పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. గురువే సత్యం అంటూ సాగిన పాట బాగుంది. రాఘవేంద్ర రావు గారిలో కొత్త కోణం ఈ ఎపిసోడ్లో ఆవిష్కృతమైంది. అది రామ్మూర్తి మాస్టారి రిటైర్మెంట్ వేడుకున్నాడు చక్కగా వెల్లడైంది. కథకు తగ్గట్టుగా ఆయన దర్శకత్వ సహకారం దిశానిర్దేశం చేసింది. ఒక్క లోపం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక సందర్భంలో దిన పత్రిక చదివే ఘట్టం. అందులో ఈనాడుకు బదులు ఆంధ్రజ్యోతి దినపత్రికను పెట్టారు. ఆ పత్రిక పేరు కనిపించకుండా మాస్క్ వేశారు. ఈనాడు పేపర్ ఆయన చేతుల్లో పెట్టి ఉంటె బాగుండేది అనిపించింది. మంచి ఎపిసోడ్ అందించిన ఈటీవీ విన్ బృందానికి అభినందనలు.

ప్రభుత్వం మనకు జీతాలు ఇస్తున్నది పిల్లలకి పాఠాలు చెప్పడానికి, అంతేతప్ప
ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించుకోడానికి కాదు అన్న డైలాగును ఈ తరం టీచర్లు పాటించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here