ఉదయంలో పొత్తూరి రాజీనామాకు కారణం?

Date:

మంచితనం, విలువలు = పొత్తు + పొత్తూరి
నేటి పాత్రికేయులు తెలుసుకోవలసిన అంశం
(మాడభూషి శ్రీధర్)

సంపాదకుడిగా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ప్రచురణకర్తగా పత్రిక ప్రచురణను ఆపుచేస్తానంటూ యాజమాన్యం ప్రతినిధి పట్టుపట్టారు. తన కారణంగా పత్రిక ప్రచురణ నిలిచిపోవడం ఎందుకని పొత్తూరి రాజీనామా చేశారు.

ఒకసారి నేను మరొక మిత్రుడితో రాసిన పరిశోధనాత్మక కథనాన్ని ఆయన చర్చించి ఆమోదించి ప్రచురించారు. ఆ వ్యాస పరంపరలో మూడో భాగంతో తొలి ఎడిషన్ తయారవుతోంది. యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. సంపాదకుడిగా తన మాట నెగ్గాలని ఆయన పట్టుపట్టారు. సంపాదకుడిగా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ప్రచురణకర్తగా పత్రిక ప్రచురణను ఆపుచేస్తానంటూ యాజమాన్యం ప్రతినిధి పట్టుపట్టారు. తన కారణంగా పత్రిక ప్రచురణ నిలిచిపోవడం ఎందుకని పొత్తూరి రాజీనామా చేశారు. ఎవ్వరితో రాజీ పడకుండా మౌనంగా రాజీనామా చేశారు. సహచరులంతా రాజీనామా చేస్తామన్నాం. ‘మీరు నాకు ముందే అన్ని పత్రాలు చూపిన తరువాతే ఆమోదించాను. కనుక మీరు రాజీనామా చేయవలసిన అవసరం లేదు’ అని ఆయన మమ్ములను సమాధాన పరిచి ఉద్యోగంనుంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన రాజీనామాకు మేమే పరోక్షంగా కారణమని మేము బాధపడుతూనే ఉంటాం. పొత్తూరి ఆదర్శ వ్యక్తిత్వానికి ఇదొక నిదర్శనం.
విధి నా సారథి అన్న పొత్తూరి
‘విధి నాసారథి’ అన్నవాడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో బ్రహ్మాండంగా రచయితగా కొనసాగిన గొప్పవాడు పొత్తూరి వేంకటేశ్వరరావు. పొత్తూరి, మైత్రీపురి రెండూ ఒకటే అన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించారు. వారి తండ్రి పేరు వెంకట సుబ్బయ్య తల్లి పేరు పన్నగేంద్రమ్మ గారు. ‘విధి నా సారథి’ అనేపేరుతో తన ఆత్మకథ వివరించారు. చాలా జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా చెప్పినా, చెప్పవలసిన విషయాలను ఆయన రచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే నష్టమేమిటి అని సవాలు చేసిన వారాయన.
జర్నలిస్టు సంఘాలు రెండు రాష్ట్రాలలోనూ పొత్తూరి వారి జీవితం గురించి కొన్ని ఘట్టాలు పాఠంలో ఉండడం న్యాయం.
ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహనీయులు, పత్రికా విలువలు, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయం మొదలైన వివిధ అంశాలపై అహరహం విరివిగా రచించారు. ఎన్నో విశిష్ఠ రచనలు ఉన్నా, పారమార్థిక పదకోశం చాలా గొప్పది.
పత్రికా రచన, సంపాదకత్వ బాధ్యతలతో చాలా పనుల్లో ఉన్నా పొత్తూరు ఆధ్యాత్మికజీవనం, తత్వం, భక్తి, వేదాంతం నేర్పారు. నేర్చుకున్నారు. అన్యాయంగా కాన్సర్ రక్కసితో ఓపికగా పోరాడి పోరాడి, దేహబంధాలతో విడుదలై నిజనివాసంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ. ఉర్వారుక మివ బంధనాత్ రీతిలో దోసపండువలె రాలిపోయారు. చివరికి జీర్ణములైన శరీర వస్త్రాన్ని ఏకాదశి ఉదయ సంధ్యలో విడిచి వెళ్లారు.
1983-84లో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వరంగల్ విలేకరిగా నేను ఉన్నప్పుడు పొత్తూరితో సన్నిహిత పరిచయం. ఆయనతో మాట్లాడాలంటే కాస్త భయం, చాలా పొదుపుగా మాట్లాడేవారు. అనవసరంగా తనను కలవాలని కోరుకునే వారు కాదు. వరంగల్లులో సమాచార భారతి విలేకరిగా రచించిన వార్తలు పరిశోధనా వ్యాసాలు ఆంధ్రప్రభలో తీసుకోవడానికి సాహసించడానికి వెనుకాడలేదు. సంచలనం కలిగించే వార్తలు అనేకం వచ్చాయి. అవి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టాయి. వాటిని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. పొత్తూరి ఉదయం పత్రిక సంపాదకులుగా రావడంతో ఉదయం వెలుగు వెలుగుతున్న రోజుల్లో చాలా మంచి అందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
అజాతశత్రువు…
పత్రికా సంపాదకుడుగా, విమర్శకుడుగా, రచయితగా పొత్తూరి ఎప్పుడూ సంచలనాలను నమ్ముకోలేదు. జాగ్రత్త గా ఎవరినీ నొప్పించకుండా రాయడం, నిర్మాణాత్మకమైన విమర్శలను చేయడం, సున్నితంగా మందలించడమే గాని పరుషపదజాలం వాడడం అవసరం లేదనే సౌమ్యుడైన పత్రికా రచయిత.
పొత్తూరి వినియోగదారుల ఫోరంలో సామాజిక ప్రతినిధి గా న్యాయమూర్తిగా హైకోర్టులో న్యాయపీఠం పైన కూర్చున్నారు. నన్నొకరోజు సహజ న్యాయసూత్రాల గురించి అడిగారు. నేను చదివింది, నేను తరగతి గదిలో చెప్పేది నాకు తెలిసింది చెప్పాను. ఆయన నాకు చిన్న పరీక్ష పెట్టారనీ నేను అందులో ఉత్తీర్ణుడినైనాననీ నాకు ఆ తరువాత తెలిసింది. ఆయన అంతలోతుగా అధ్యయనం చేసేవారు.
పొత్తూరి ప్రెస్ అకాడమీ చైర్మన్ అయింతరువాత నన్ను పిలిచి, పత్రికారచన కోర్టు ధిక్కారం పరువు నష్టం పైన పుస్తకం రాయమన్నారు. తను స్వయంగా చదివి న్యాయధిక్కారం అనే మాట పై విశ్లేషణ చేశారు. అది న్యాయస్థాన ఆదేశ ధిక్కారం కదా, అన్నారు. నిజమే. కోర్టు ధిక్కారం అని మార్చాను. అంత నిశితంగా ఉండేది పరిశీలన.
పొత్తూరి కోరిక తీరిన వేళ
రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక న్యాయవేత్తను నియమించే అవకాశం ఉందని నేను సుప్రీంకోర్టున్యాయమూర్తి అయితే తనకు చూడాలని ఉందని అన్నారు. సిఐసి దాంతో సమానమైనది కనుక మీ దీవెన ఫలించినట్టే’’ అంటే అంగీకరించలేదు.
2017లో పొత్తూరి మానాన్నగారు ఎం ఎస్ ఆచార్య స్మారక ప్రసంగం ఇచ్చారు. ఈనాటి పాత్రికేయత పైన ఆయన నిశిత వ్యాఖ్యానాలుచేశారు.
‘ఆయన వచ్చారు’ అంటే ‘ఎవరూ? మన శ్రీధరా?
పొత్తూరి చివరి పుట్టిన రోజున పొత్తూరిని ఆస్పత్రిలో కలిశాను. రకరకాల కట్లు, కట్టుబాట్లు వైర్ల మధ్య పొత్తూరి అంపశయ్యమీద భీష్మాచార్యుడి వలె కనిపిస్తున్నారు.
ప్రేమ్ గోపాల్ ‘‘నేను వచ్చానంటే. ఎవరు మన శ్రీధరా..?’’ అన్నారు. అంత బాధలో కూడా ముఖాన నవ్వు వెలసింది.
ఆయన కలం తన ఆయుధం. కుస్తీ పట్టడం వచ్చు. కాని పట్టరు. ధైర్యం ఆయన సొత్తు. మంచితనం, ప్రేమ, ఆప్యాయత, సమాజాన్ని అర్థం చేసుకునే పరిణతి, పరిపక్వత. సమాజం కోసం పోరాడుతున్న నక్సలైట్లను ప్రధాన జీవనస్రవంతివైపు మళ్లించాలన్న తపన.
అందుకోసం ఇటు ప్రభుత్వాన్ని అటు తీవ్రవాదులను ఒప్పించే అపూర్వ ప్రయత్నం, ధైర్యం, పట్టుదల. ఇద్దరి మధ్య సయోధ్య సాధించడానికి అకుంఠిత దీక్ష. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. అన్నిటికీ మించి అక్షయ అక్షర తూణీరం ఆయన సంపద.
మంచితనం, విలువలు = పొత్తు + పొత్తూరి
పొత్తూరి వేంకటేశ్వరరావు. ఏ విశేషణాలు అవసరం లేని పేరు. పేరు వినిపిస్తే చాలు. వ్యక్తిత్వపు రూపు కనిపిస్తుంది.పత్రికలు ఆయనకు పొత్తిళ్లు. అక్షరాలే అమ్మా నాన్నా అయి పెంచిన జర్నలిస్టు. జనం ఇష్టమయితే చాలు జర్నలిస్టు అవుతాడు. నిజమైన జర్నలిస్టు పొత్తూరి.
సామాన్యత ఆయన మాన్యత. ఆ పేరుతో తన జీవన యానంలో ముఖ్య సంఘటనలు రచించిన మాన్య పాత్రికేయుడు. అక్షర యజ్ఞకర్త. పెద్దగా ఆశలు లేని అల్ప సంతోషి. తన ఈమెయిల్ పేరు పెట్టుకున్నారు. జీవితమంతా పొత్తుల కోసం శ్రమించిన వారు పొత్తూరి వెంకటేశ్వరరావు. 86 సంవత్సరాల జీవన సంఘర్షణ తరువాత ప్రశాంతంగా ముగించారు.

పాత్రికేయ వృత్తిని కూడా లక్షలాది మంది ఎంచుకుంటారు. వృత్తి నిబద్ధత ఉన్నవాళ్లూ ఉన్నారు. మంచి, మానవత్వం, సహృదయం, వినయం విజ్ఞానం కలిసి ఉండేది ఎందరికి? ఆ లక్షణాల పొత్తు పొత్తూరి. పొత్తూరి లేని లోటుతీరదు.తెలంగాణా శ్రేయోభిలాషిని, తెలుగు రాష్ట్రాలు ఉత్తమ పాత్రికేయుడిని, ఒక చింతనాపరుడిని కోల్పోయింది.
ప్రేమ్ గోపాల్ ఆయన సహోదరులు ఒక సమున్నతమైన పితృదేవుని కోల్పోయారు. పొత్తూరి గారు అమ్మఅని ఆదరించిన జిల్లెల్లమూడి అమ్మ వలె కనిపించే శ్రీమతి పొత్తూరిలోటు చెప్పలేనిది. అందరూ ఈ లోటును అధిగమించి వర్థిల్లాలని ఆశిస్తున్నాను. పొత్తూరి విలువలు కలకాలం నిలవాలని కలాలు అందుకు నిలబడాలని కోరుకుంటున్నాను.


(వ్యాస రచయిత మహీంద్రా యూనివర్సిటీ లా కాలేజి డీన్)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

తెలంగాణాలో మూడు ఫార్మా విలేజెస్

లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

I.N.D.I.A. Alliance unity going ahead  

(Dr Pentapati Pullarao) After losing the 2014 and 2019 parliament...

షావుకారు పోస్టరు వెనుక కధ

(డా. పురాణపండ వైజయంతి) మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు...

శిల్ప కాలనీలో కమ్యూనిటీ హాలుకు రూ. 25 లక్షలు

మార్చి మొదటివారంలో శంకుస్థాపనహై మ్యాస్ట్ దీపాల ప్రారంభ కార్యక్రమంలో పాండురంగారెడ్డిహైదరాబాద్, ఫిబ్రవరి...