వి.ఆర్.ఏ.లు ఇక సూపర్ న్యూమరీ ఉద్యోగులు

Date:

కె.సి.ఆర్. చారిత్రాత్మక నిర్ణయం
భూస్వామ్య వ్యవస్థ చిహ్నాలపై వేటు
వి.ఆర్.ఏ. వ్యవస్థ శాశ్వతంగా రద్దు
రెవిన్యూ శాఖలో క్రమబద్దీకరణ
కారుణ్య నియమాకాలకూ గ్రీన్ సిగ్నల్
ఉత్తర్వుల విడుదలకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, జులై 23 :
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు గా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సిఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం ఆదేశించారు.

సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సిఎం వివరించారు.

రాష్ట్రంలో వీఆర్ఏ ల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి,మదన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నేతలు చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జెనరల్ దాడే మీయా, విజయ్ రవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తరతరాలుగా త్యాగపూరిత సేవ
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవిన్యూ తదితర అవసరాలకోసం ఏర్పాటయిన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏ లుగా రూపాంతరం చెందిందని సిఎం అన్నారు. అట్లా తర తరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏ ల త్యాగపూరిత సేవ గొప్పదని సిఎం కొనియాడారు. కాగా నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ ల వృత్తి కి ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో, వారికి రెవిన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.


మేము చేస్తున్నది సమాజ సేవ
తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న గ్రామ సహాయకులకు (వీఆర్ఏ లు) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సీఎం తెలిపారు.
అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎవరూ అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ‘సఫాయన్నా..నీకు సలామన్నా..’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సీఎం చెప్పారు.


వి.ఆర్.ఏ. నేతల ధన్యవాదాలు
కాగా…మస్కూరు తదితర పేర్లతో తమను తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మీకెంతో రుణపడి ఉంటామని వీఆర్ఏ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.


వీఆర్ఏ ల క్రమబద్దీకరణ సర్దుబాటు విధానం..
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏ లు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడవ తరగతి పాసైనవారు, పదవ తరగతి పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారి భర్తీ చేస్తాం’’ అని సీఎం తెలిపారు.
ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


కారుణ్య నియామకాలకూ ఓకే
61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా… 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం అన్నారు. కాగా… చనిపోయిన వీఆర్ఏ ల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను వీఆర్ ఏ జేఏసీ నేతలకు తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...