డ్ర‌గ్స్ స‌మూల నిర్మూల‌న‌కు మార్గ‌మిదే

Date:

సామాజిక బాధ్య‌త‌తో వినూత్నంగా ఆలోచించాలి
సామాజిక ఉద్య‌మంతోనే మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డి
సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాల‌తో డ్ర‌గ్స్ వ్య‌తిరేక చైత‌న్యం
పోలీసు, ఎక్సయిజ్ అధికారుల‌కు సీఎం కేసీఆర్ ఉద్బోధ‌
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 28:
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని ఇప్పుడిప్పుడే మొదలౌవుతున్న తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో వినూత్నరీతిలో ఆలోచన చేయాలని, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే రాష్ట్రంలో మాదకద్రవ్యాల ను తరిమికొట్టగలమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్నవన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రవేశిస్తున్న డ్రగ్స్ మహమ్మారి ని తరిమికొట్టే దిశగా ప్రజలను చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అన్నారు.


1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ని సీఎం కెసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఎస్ ఏ బీ, తదితర వ్యవస్థలు విజయవంతం గా పనిచేస్తున్నాయన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా అంతే శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సిలరీ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయం లో ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.
ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్ర కుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, సాయన్న, రేఖా నాయక్, అబ్రహం, హన్మంతు షిండే, సుంకె రవిశంకర్, కృష్ణ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సీఎంవో అధికారులు నర్సింగ రావు, భూపాల్ రెడ్డి, మాజీ డిజిపీ ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు పాల్గొన్నారు.
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు ,ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ద్విముఖ వ్యూహం :
డ్రగ్స్ ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. మొదటి వ్యూహం లో భాగంగా… ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని గుర్తించి, వారిని వారు కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత.. డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని, నిష్ణాతులైన చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి డ్రగ్స్ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు.
ఎంత ఖర్చయినా పర్వాలేదని, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలనీ సీఎం అన్నారు.
అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి కొకైన్ ఎల్ ఎస్డి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ‘‘ మనం పలు హోదాల్లో పనిచేస్తున్నం. ఉద్యోగులుగానే కాకుండా మానవులుగా మన మీద సామాజిక బాధ్యత ఉన్నది. మొత్తం సమాజాన్ని చెడగొట్టే, మన సంస్కృతి ని, మన పునాదులను పెకిలించే పరిస్థితులు తెలెత్తినపుడు కేవలం ఉద్యోగులుగా కాకుండా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. అట్లా పనిచేయగలిగిన చోటనే సామాజిక పురోగతి సాధ్యమైతది. తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా ఎదిగింది. ఈ ప్రగతి లో పాలుపంచుకుంటున్న అన్ని రంగాల ప్రభుత్వ ఉన్నతాధికారులను నేను అభినందిస్తున్నాను. ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితర అన్ని శాఖల అధికారులను అభినందిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్రం అనేక బాధలు పెట్టింది. వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పథాన పయనిస్తున్నాం. పోలీస్ యంత్రాగం అద్భతుంగా పనిచేస్తున్నది. క్రైమ్ డిటెక్షన్ లో సిసి కెమెరాలు గొప్పగా పనిచేస్తున్నాయి. నేరస్తులను వెంటనే పట్టుకోగలుగుతున్నాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రీమిస్ట్ ల విషయంలో కూడా తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు. ఎస్ఐబి, గ్రే హౌండ్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏర్పాటు చేసాము. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించుకున్నాం. దాన్ని మార్చిలో ప్రారంభించుకుంటాం. ప్రజల సంతోషం కోసం, శాంతిభద్రతలు పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదు. అన్ని రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. స్టార్టప్స్, ఇన్నోవేటివ్ రంగాల్లో, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా శాంతి భద్రతల పరిరక్షణ సమర్థవంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఒరిస్సా, బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, కాయస్థ బ్రాహ్మణులు ఇట్లా అన్ని వర్గాలకు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. పేకాట, గుడుంబా తదితర వ్యవస్థీకృత నేరాలు తగ్గాయి. ఇదంతా మీరు చేసిన కృషి. డిజిపి ఆధ్వర్యంలో రాష్ట్రంలో గొప్పగా శాంతిభద్రతలున్నాయి. పోలీస్ శాఖ అమలుపరుస్తున్న లా అండ్ ఆర్డర్ తో మంచి ఫలితాలొస్తున్నాయి. త్రాగునీరు, 24 గంటల విద్యుత్, పంటలు, ధాన్యం దిగుబడి లో మొదటి స్థానంలో ఉన్నాం. ఇటువంటి ప్రగతి కొనసాగుతున్న సందర్భంలో.. తెలంగాణను మరింత గొప్పగా నిలుపుకోవాల్సిన బాద్యత మనందరి మీదా వున్నది.’’ అని సిఎం తెలిపారు.


డ్రగ్స్ వినియోగం వైపు యువత ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు పేదలు అనే బేధం లేకుండా అన్ని తరగతుల కుటుంబ సభ్యులు తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లల అలవాట్ల పై దృష్టి సారించాలని సీఎం కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకరమని, దానిన కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం లేకుండాపోతుందని సీఎం స్పష్టం చేశారు.
” ఎంత ధనం ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం..మన పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్ కు బానిసలై వాళ్ళ భవిష్యత్ మన కండ్ల ముందే నాశనమై పోతుంటే ఎంత వేదన…” అంటూ సీఎం , యువత తల్లి దండ్రులను హెచ్చరించారు.
డ్రగ్స్ కంట్రోల్ లో సభ్యసమాజం సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. అందుకు.. గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, విద్యార్థులతో సమావేశాలు సజావుగాఅవగాహన సదస్సు లు నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా స్ధానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచలని సీఎం అన్నారు. గ్రామం లో ఏ రైతు గాంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం అందించక పోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని..ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని సీఎం కేసిఆర్ ఆదేశించారు. ఇది అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మనసు మీదికి తీసుకుని డ్రగ్స్ కంట్రోల్ విషయంలో కృషి చేయాలనీ సీఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్ కంట్రోల్ అంశంలో వినియోగించుకోవాలన్నారు. వ్యవస్థీకృత నేరాలను కంట్రోల్ చేస్తున్న విధంగా పి.డి.యాక్ట్ లు కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ” మీరు ఏమి చేస్తారో ఏమో..ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది..మీరు రాష్ట్రం లో డ్రగ్స్ వాడకం లో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టాల” నీ సీఎం డీజీపీ నీ ఆదేశించారు.


డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయి కి చేరుకోలేదనీ, రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుడిచేయాలనీ సీఎం అన్నా రు . నేరస్థులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ ను మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాల ముందు డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ కేసుల్లో బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితులున్నందున వ్యసనపరులు, వ్యాపారులు తిరిగి మళ్లీ మళ్లీ కొనసాగిస్తున్నారని, వీటిపై తగిన దృష్టిని సారించాలని ., అందుకు సంబంధంచిన న్యాయ సలహాలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం సూచించారు. కోర్టుల్లో పోలీస్ అధికారులు నేరాలను నిరూపించేందుకు చేపట్టవలసిన చర్యలు, సమకూర్చవలసిన వసతులను ఏర్పాటు చేయాలనీ, ఇందుకు తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సినిమా, సోషల్ మీడియా, తదితర సాంస్కృతిక వేదికలు ఆన్లైన్ వేదికల మూలాన కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎం కు వివరించారు.


ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ ..
” డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థలను మెరుగపరచాలి., మీడియా, సినిమా మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలి. డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టైజ్మెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాల’’ ని అధికారులను సీఎం ఆదేశించారు.
నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపి ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలన్నారు. అందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నార్కొటిక్ డ్రగ్స్ వినియోగం, వాటి మూలాలను గుర్తించి కఠినంగా నియంత్రించాలని సంబంధిత పోలీస్ కమిషనర్లకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను గుర్తించి కఠినంగా నిర్మూలించాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్ ను దాని సాంద్రతను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణ కార్యాచరణ అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల నడుమ సమన్వయం సాధించాలన్నారు. అన్ని రకాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. మూసివేసిన పరిశ్రమలు తదితర ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ పంపిణీ కేంద్రాలకు నెలవులుగా మారుతున్నాయని అధికారులు చేసిన సూచన పట్ల సీఎం ఘాటుగా స్పందించారు. తక్షణమే అటువంటి ‘క్లోజ్డ్ ఇండస్ట్రీ’లను గుర్తించి రూపుమాపాలని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదని సిఎం అన్నారు.


రాష్ట్ర పోలీసులు కానీ, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్ అధికారులు సిబ్బంది కానీ, డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లు సంబంధిత కేంద్రాల్లో డ్రగ్స్ వినియోగం పై దృష్టి సాధించాలని, అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ లు రద్దు చేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ను గుర్తించాలని, పబ్స్ యజమానులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖశ్చితమైన ఆదేశాలివ్వాలని డిజిపిని సీఎం ఆదేశించారు. తాను తరచుగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తానని, ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తతతో పనిచేయాలన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. బార్లల్లో, పబ్స్ ల్లో డ్రగ్స్ వాడకం జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత ఎక్సైజ్ అధికారులు సిబ్బంది మీద కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. . లంచాలు తీసుకొని పనిచేసే ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై కఠినచర్యలుంటాయని సీఎం హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నుంచి డ్రగ్స్ కేసుల వివరాలను తెప్పించుకోవాలని, ఫారెస్టుల్లో సాగవుతున్న గంజాయి వివరాలను గుర్తించాలన్నారు. నార్కోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలని సీఎం స్పష్టం చేశారు. ఎఫ్.ఎస్.ఎల్., ప్రాసిక్యూషన్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. పబ్బులు, బార్లల్లో పోలీసులు డీకామ్ ఆపరేషన్ చేపట్టాలని, డ్రగ్స్ ప్రోత్సహిస్తున్న పబ్బుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారుగుడుంబా తయారీలో ఇల్లీసిట్ లిక్కర్ నిర్మూలన చేపట్టాలని, గుడుంబా రహిత ప్రాంతాలుగా చేయాలని సీఎం అన్నారు. పేకాట తదితర వ్యవస్థీకృత నేరాలను సమూలంగా రూపుమాపాలన్నారు. ఎక్సైజ్ శాఖ లో సీఐ స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో వారికి డ్రగ్స్ నేరాలపై అవగాహన ఉంటుందని, నిజాయితీగా పనిచేసేవారికి ఆక్సిలేషన్ ప్రమోషన్స్ ఇవ్వాలని సీఎం తెలిపారు. యాజమాన్యాలను..డీఈవో లు తదితర విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులను సమావేశపరచాలని జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మెడికల్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంటర్ తదితర కళాశాల యాజమాన్యాలను తదితర కాలేజీల్లో ప్రిన్సిపాల్స్ ను పిలిచి సమావేశాలు నిర్వహించి కౌన్సిలింగ్ చేసి డ్రగ్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టమైన సూచనలు చేయాలన్నారు.


డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్ తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని సిఎం అన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాద్యత ఆయా గ్రామస్తులమీద కూడా వున్నదన్నారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయండి. సోషల్ మీడియా ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలిందని దాని మీద కూడా దృష్టి సారించాలని సీఎం సూచించారు. జిల్లాల వ్యాప్తంగా ఎస్పీలు, డిసిపి లు, కమిషనర్లు తరచుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని సీఎం సూచించారు. డ్రగ్ నేరస్థుల రికార్డు మెయింటేన్ చేసి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పి.డి. యాక్ట్ లు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకోని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రత్యేక రూంలను వసతులతో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైద్రాబాద్ మహానగరం పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నగర గొప్పతనాన్ని పాడుకాకుండా చూసుకోవాలన్నారు. వరంగల్, కరీంనగర్ వంటి సిటీలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయని వాటిని వ్యవస్థీక్రుత నేరాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు.


ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ లో అగ్గి కణికలు లాంటి అధికారులు కావాలన్నారు.గుడుంబా మీద.. ఇల్లీసిట్ లిక్కర్, డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ ను తిరిగి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని చేపట్టాలని డిజిపి ని సిఎం ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...