గుండెపోటు అనంతరం నాన్న అడిగిన మొదటి ప్రశ్న

Date:

ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకం
ఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలి
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య
జులై 23 కోడి రామకృష్ణ జయంతి

(డాక్టర్ వైజయంతి పురాణపండ)
చలన చిత్ర రంగాన్ని మించి ప్రజలను ప్రభావితం చేసే రంగం మరొకటి ఉండదు. మంచైనా.. చెడు అయినా… సృజన అయినా… సందేశమైనా… కుటుంబ బంధాలైనా… ఇలా ఏ అంశాన్నైనా హృదయానికి హత్తుకునేలా చెప్పగల సమ్మోహన శక్తి ఆ ఒక్క రంగానిదే. హీరోలను అనుకరించే విషయంలో యువతరం ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచి సినిమాలు కచ్చితంగా వస్తాయి. ఈ విషయంలో ఈ దర్శకుని బాణీ బహు గొప్పది. ఈయన చిత్రాలలో కనిపించేది దర్శకుడే. ఎంత పెద్ద నటుడు ఆయన చిత్రంలో పాత్రధారి అయినా తెరమీద కనిపించేది ఆయనే. సృజనకు పెద్ద పీట వేశారు. గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లో అమ్మోరుతో ఉర్రూతలూగించారు. అరుంధతితో వదల బొమ్మాళి అనిపించారు. ఇలా ఎన్నని చెప్పగలం. ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఇప్పటి గ్రాఫిక్ చిత్రాలకు ఆద్యుడాయన. పాలకొల్లుకు చెందిన కోడి రామకృష్ణ పేరు చెబితే ఇవన్నీ గుర్తుకురాక మానవు. జులై 23 కోడి రామకృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె దివ్యతో వ్యూస్ ప్రత్యేక సంభాషణ.

నాన్న ఎక్కడికి వెళ్లినా నన్నే ఎదురు రమ్మనేవారు అంటూ తండ్రిని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు దివ్య. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టిన నాన్న(రామకృష్ణ)కు మొదటి నుంచి నాటకాలంటే ప్రాణం. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్‌ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేశారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చారని దివ్య చెప్పారు.
నాటకాలు వేయడానికి పెయింటింగ్స్…
నాన్నకి పెయింటింగ్స్‌ వేయటం అలవాటు. మంచిమంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇలా చేసేవాడినని నాన్న చెప్పారు.
దాసరి ద్వారా సినీ రంగానికి…
నాన్న సినిమాలలోకి వెళ్తానంటే నానమ్మ వాళ్లు అభ్యంతరం చెప్పలేదు. దీనితో ధైర్యం తెచ్చుకున్న నాన్న మద్రాసు వెళ్లి ముందుగా దాసరి నారాయణరావుగారిని కలిశారు. ఏం చదువుతున్నావంటూ ప్రశ్నించిన దాసరి, ముందు డిగ్రీ పూర్తి చేసి అప్పుడు రా అని తిప్పిపంపారట. దీనితో ఉత్సాహం తెచ్చుకుని డిగ్రీ పూర్తి చేశారు. ఆ విషయాన్ని దాసరి గారికి తెలియజేశారు. సరే రా అంటూ దాసరి పంపిన టెలిగ్రామ్‌ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారితో నాన్నకు అనుబంధం ఎక్కువ. దాసరి గారు చనిపోవటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. సోఫాకి ఒక చివర కూర్చునే వారు. ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం చేసేవారు. ఆయన పోయిన తరవాత నాన్న చాలా కాలం కోలుకులేకపోయారు. నాన్నకు ఆయనతో గురుశిష్య సంబంధం కంటె ఎక్కువ. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. దేని దారి దానిదే.
నాన్నది ప్రేమ వివాహం
అమ్మ వాళ్లది తెనాలి. సినిమాల మీద ఆసక్తితో అక్కడ నుంచి మద్రాసు వచ్చారు. తాతగారు ఎ. సుభాష్‌ బాబు ‘భారత్‌ బంద్‌’ నిర్మించారు. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో అమ్మ నటించింది. అమ్మ పేరు పద్మ. వాస్తవానికి అమ్మకు నటించటం ఇష్టం లేదు. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. సన్నిహితులందరూ కలిసి అమ్మవాళ్ల నాన్నగారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. నాన్న వాళ్ల అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో నాన్న వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక ఇంటి బాధ్యత అంతా నాన్నే భుజాల మీద వేసుకున్నారు.
అనారోగ్యం తెలిసి హైద్రాబాదుకు
నాన్నకి అనారోగ్యంగా ఉన్నప్పుడు మేం బెంగళూరులో ఉండేవాళ్లం. ఆయన బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. మా చెల్లి పేరు ప్రవల్లిక. కిందటి సంవత్సరమే వివాహం చేశాం. నేను బిబిఏ చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్‌ కూడా చేశాను. నన్ను దీపమ్మా అని, చెల్లిని చిన్ని అని పిలిచేవారు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా నాన్నకు ఇష్టం లేదు. మీకు ఇద్దరు ఆడపిల్లలు అని ఎవరైనా అంటే ఆయనకు నచ్చేది కాదు. నాన్నకు అస్సలు కోపం రాదు. మా చదువులు, ఇంటి బాధ్యత అంతా అమ్మే చూసుకునేది. ఇంట్లో ఉన్నప్పుడు మాతో బాగా కబుర్లు చెబుతూ, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవారు. నాన్నకు కోపం రాదు, అరవటం, తిట్టడం అలవాటు లేదు. ఏ విషయాన్నీ ఎక్కువ సాగదియ్యరు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ విషయంలోనూ అంతే. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేసేది. ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. మా మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. అన్నీ అందరం మాట్లాడుకుంటాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేవారు.
ఇంటి బాధ్యత అమ్మదే….
అందరు సినిమా వాళ్లలాగే నాన్న కూడా సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో ఇంటి బాధ్యతలన్నీ అమ్మే చూసుకునేది. ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్‌ పూర్తి చేసుకుని విమానంలో రాత్రి వేళ నాన్న ఇంటికి వచ్చాక, మమ్మల్ని కార్‌లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్‌ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్‌ చేసేవారు. నాన్న మాతో చాలా స్నేహంగా ఉండేవారు. మమ్మల్ని ఒక్క రోజు కూడా కోప్పడలేదు.
షో చెయ్యటం నాన్నకు నచ్చదు…
నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అనుకున్నాను. అదే సమయంలో అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు నాన్న.
సినిమా చూసాక….
మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు నాన్న. మా కోసం ఖర్చు చేయటానికి వెనకాడరు. ఆయన కోసం అస్సలు ఖర్చు చేసుకోరు అంటూ కోడి రామకృష్ణ సామాన్య జీవనం గురించి చెప్పారు దివ్య.
నాన్నకి ట్రావెల్‌ అంటే ఇష్టం. ఔట్‌డోర్‌ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు తీసుకువెళ్లేవారు. ఇల్లు, షూటింగ్‌ అంతే. నాన్నకు పార్టీ అంటే ఇష్టం ఉండేది కాదు. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. వైట్‌ డ్రెస్‌ మాత్రమే వేసుకునేవారు. వేడుకలకు కూడా సింపుల్‌గానే వెళ్లేవారు. చాలా తక్కువ తింటారు. బయటి ఫుడ్‌ ఇష్టపడేవారు కాదు. నాన్‌ వెజ్‌ కూడా ఇంట్లో వండినదే ఇష్టపడేవారు.


అంత్య క్రియలు నేనే చేశా
నా పెళ్లి ఇంకా ఒక వారంలో జరగబోతోందన్నప్పటి నుంచి నాన్న ఏడుస్తూనే ఉన్నారు. అంతవరకు ఎన్నడూ నేను అమ్మనాన్నలను విడిచి ఉండలేదు. అందరం నాన్నను ఓదార్చవలసి వచ్చింది. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్‌ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యి, నాన్న కళ్లకు నేను కనిపించేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, ‘మా అమ్మలా ఉంది’ అన్నారు. బాల్కనీలో తన పక్కన కూర్చోపెట్టుకుని, పాపని, ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచేవారు. చేతిలోకి తీసుకుని, ‘చిన్నిలా తెల్లగా ఉంది’ అనేవారు. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. మా పాప పుట్టగానే నాన్న చేతికి ఇవ్వమన్నాను. ఆయన ఎత్తుకుని మురిసిపోయా. మా అమ్మాయికి ‘ఐరా’కి అన్నీ నాన్న లక్షణాలే.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు…
సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్‌ అటాక్‌ వచ్చింది. హార్ట్‌ ఆపరేషన్‌ అయింది. ఆపరేషన్‌ అయిన మరుసటి రోజు స్పృహలోకి వచ్చే సమయానికి నాన్ను చూడటానికి ఆసుపత్రికి వెళ్లాం. మమ్మల్ని చూస్తూనే ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. నాన్న వల్ల ఏ నిర్మాత నష్టపోలేదు. నిర్మాత తరవాతే నాన్నకు కుటుంబం. నాన్నను చూడటానికి మేం వస్తే, మా గురించి కాకుండా నిర్మాత గురించి అడిగినందుకు మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్‌ చేశారు. తన వల్ల ఎన్నడూ సినిమా ఆగిపోవటం నాన్నకు ఇష్టం లేదు.
విపరీతమైన భక్తి….
నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకుని, ఆ తరవాత టిఫిన్‌ తినేవారు. మంత్రాలు చాలా గట్టిగా చదివేవారు. వినాయకచవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. ఆటంకం రాకూడదు, తడబాటు ఉండకూడదు ఆయనకు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్, లేదంటే షూటింగ్‌… అంతే. సినిమా మీద కూడా కమిటెడ్‌గా ఉండేవారు. ఆరు గంటలకు షూటింగ్‌ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్‌లో ఉండేవారు.
జేబులో ఎప్పుడూ పర్సు ఉండేది కాదు…
తన జేబులో రూపాయి కూడా పెట్టుకునేవారు కాదు. అసలు పర్సే ఉండేది కాదు. ఒక బ్రీఫ్‌కేస్‌లో కొద్దిగా డబ్బు పెట్టుకునేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్‌ కొన్నారు. చెల్లి మాత్రం నాన్న ఏదైనా మాట్లాడితే, ‘ఇలా కాదు’ అని ధైర్యంగా అనేసేది. ఇద్దరూ వాదించుకున్నాక కూడా, ‘అమ్మా! చెల్లి జ్యూస్‌ తాగిందా’ అని నన్ను అడిగేవారు. నాన్నతో పని ఉండి చెల్లి నాన్న గది బయట అటుఇటు నడుస్తూంటే, ‘చెల్లికి ఏదైనా పని ఉందా’ అని అడిగేవారు. అది చిన్నపిల్ల అని గారం చేసేవారు. నాకూ అన్నీ ఇచ్చేవారు. కాని చెల్లి ఏది అడిగినా వెంటనే చేసేసేవారు. నేను ‘ప్లీజ్‌’ అంటాను, చెల్లి ‘ఆర్డర్‌’గా అంటుంది. చెల్లి చిన్నప్పటి నుంచి సినిమా కథ బాగా చెప్పేది. చెల్లి పెళ్లి నాన్న లేని లోటు తెలియకుండా అలాగే చేశాం.
డౌన్‌ టు ఎర్త్‌
ఎంత పేరు వచ్చినా అలాగే ఉన్నారు. ప్రొడక్షన్‌ నెంబర్‌ – 1 కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌.
నాన్న చేసిన గ్రాఫిక్‌ ఫిల్మ్స్‌కి ఎలా కావాలనే విషయంలో, పూర్తిగా స్కెచ్‌ వేసి అడిగేవారు.
చిరంజీవి, బాలకృష్ణలతో చాలా అటాచ్‌మెంట్‌. అందరూ ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. నాన్న పుట్టినరోజుకి అందరూ వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న మీద అభిమానంగా ఉన్నవారు అందరూ ఉన్నారు.
ఆ నాలుగు రోజులూ సూపర్ సెలెబ్రేషన్స్
జనవరి 1, దీపావళి, నాన్న పుట్టినరోజు, నా పుట్టినరోజు… ఈ నాలుగురోజులూ బాగా సెలబ్రేట్‌ చేసేవారు.ఆ రోజు అందరికీ బెస్ట్‌ విషెస్‌ చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. నాన్న ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...