ఇంటర్వ్యూలో నన్నడిగిన ప్రశ్నలు
ఈనాడు – నేను 4
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
అప్పుడు నేను కుర్చీలలో కూర్చుని ఉన్నవారిని పరికించి చూశా. ఈనాడు చీఫ్ ఎడిటర్ (అప్పుడు ఆయన పోస్టు అదే) రామోజీరావుగారు, మోటూరి వెంకటేశ్వరరావుగారు(న్యూస్‌టుడే డైరెక్టర్), జి. రమేష్‌బాబు(న్యూస్‌టుడే మేనేజింగ్ డైరెక్టర్), మరొకరు ఉన్నారు. నేను రాసిన సమాధాన పత్రాన్ని రామోజీరావుగారు నిశితంగా చూస్తున్నారు. నాలుగు పేజీలు తిప్పిన తరవాత నాకేసి చూసి, ఓ చిరునవ్వు నవ్వి.. నువ్వు పత్రికలు బాగా చదువుతావనుకుంటాను… అన్నారు. అంత ఏసీలోనూ ఒళ్ళు చెమటలు పట్టింది. ఆయన ప్రశ్నించడానికి సిద్ధమైపోతున్నారన్నమాట అనుకున్నాను. ఓ ప్రశ్న తూటాలా దూసుకొచ్చింది.
‘నీకు పెళ్ళయ్యిందా?’
లేదండి
‘ఎందుకుకాలేదు’
(అప్పటికి నా వయసు ఇరవై ఆరు). స్థిరమైన ఉద్యోగం లేదు కదండి.. అయినా నాకింత వరకూ ఆ ఆలోచన కూడా లేదండి.
‘ఉద్యోగం ఇస్తే చేసుకుంటావా?’
మౌనంగా ఉండిపోయా…
నాలోని కంగారును గ్రహించి ఆయన ఈ ప్రశ్నలు వేశారని నాకు తరవాత అర్థమైంది. నేను తేలికగా ఊపిరి పీల్చుకోవడం గమనించి ఆయన మరో ప్రశ్న వేశారు.
మీ కుటుంబ సభ్యులెంత మంది?
నేను కాక అయిదుగురం
నీ జీతం వారికి అవసరమా!
నాకు తెలిసుండి మా నాన్నగారు ఎప్పుడు ఎవరి దగ్గరా సాయం పొందలేదు.
సిటిఆర్‌ఐ(రాజమండ్రి)లో పనిచేస్తూ మా చిన్నాన్న గారిని కూడా చదివించారు.
ఆయన నా జీతం ఆశిస్తారని అనుకోవడం లేదు…
మరోసారి చిరునవ్వు నవ్వి.. మీరేమైనా అడుగుతారా అన్నట్లు మిగిలిన వారివైపు చూశారు.
అవసరం లేదన్నట్లు వాళ్ళో చూపు చూశారు నాకేసి..
సరే సుబ్రహ్మణ్యం వెళ్ళు.. ఆప్యాయతతో కూడిన ఆదేశం రామోజీరావుగారి దగ్గరనుంచి.
ఆయనకు రెండుచేతులతో నమస్కరించి.. తలుపు దగ్గరకు వెళ్ళి మరోసారి ఆయనకేసి చూసి బయటకొచ్చా.
ఇక అసలు వత్తిడి.. ఆందోళన ఆరంభమయ్యాయి నాలో..
ఏమిటిది.. ఏమీ అడగలేదు… సాధారణ ప్రశ్నలతో సరిపుచ్చారు.
ఎంపికచేసుకోలేదా…
ఇలా అనేక అనుమానాలు కందిరీగ మోతలా నా మనసులో గొణుగుతున్నాయి.
కిందకి దిగిన వెంటనే టైము చూశా. సరిగ్గా పది నిముషాలు నేనా గదిలో ఉన్నది.
మిగిలిన వారంతా గంటకి తక్కువ లేరు.
కంగ్రాచ్యులేషన్సు.. రిసెప్షన్‌లో రాజేష్ అభినందన..
అదేమిటి.. అప్పుడే.. అన్నా..
మీలాగా తక్కువ ఇంటర్వ్యూ చేసినవారంతా ఇక్కడ చేరారు.. అనుభవంతో చెబుతున్నా అన్నాడాయన. అప్పుడు రాజేష్ చేసిన కరచాలనంలోని ఆత్మీయ స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది.
బయటకొచ్చి… రాజమండ్రి చేరా… రోజులు గడుస్తున్నాయ్.. కబురు లేదు. ఆందోళన పెరిగిపోతోంది.
ఆత్రం పట్టలేక మా తాత గారు ర్యాలి సత్యానందం గారిని అడిగా… తాతగారు.. ఆర్డర్ ఎప్పుడొస్తుందని..
ఆయన దేవీ ఉపాసకులు..
కాసేపు దీర్ఘాలోచనలోకి వెళ్ళారు.
రేపు రాత్రి ఎనిమిది నలబై రెండు నలబై ఐదు నిముషాల మధ్య నీకు కబురు తెలుస్తుంది అన్నారు.
ఆ…. అనుకుంటూ… ఆ విషయాన్ని వదిలేశా.
రాత్రి పూట ఎవడేనా అపాయింట్‌మెంట్ ఆర్డర్ పంపుతారా… అనుకున్నా.
ఈయన్నడిగానే నాదీ బుద్ధి తక్కువ అని నిందించుకున్నా…
మరుసటి రోజు రాత్రి భోజనాలు చేస్తున్నాం…
గేటు చప్పుడైంది. ఎవరూ! అంటూ లేచా..
టెలిగ్రాం.. అంటూ కేక..
అంతా కంగారు పడ్డారు..
కంగారు లేదు.. శుభ వార్తే…
అంటూ సంతకం తీసుకుని కవరు చేతిలో పెట్టాడు.
జా యి న్ డ్యూ టీ ఆ న్ ట్వెం టీ ఫి ఫ్త్ ఆ ఫ్ ఏ ప్రి ల్ ఎ ట్ ఎ లి వె న్ పి ఎమ్
వేణుగోపాల్ అని ఉంది… ఈయనెవరు అనుకుంటూ నాన్నగారి చేతికిచ్చా…
ఆయన చదివి.. ఇది కందుకూరు నుంచి వచ్చిందన్నారు.
అప్పుడర్థమైంది. ఆ చిరునామా ఇవ్వడంతో టెలిగ్రాం అక్కడికెళ్ళింది. అక్కడ పనిచేస్తున్న నాన్నగారి కొలీగ్ వేణుగోపాల్ ఈ టెలిగ్రాం ఇచ్చారు. వెంటనే ఆయనకు ఫోను చేసి మాట్లాడా. అసలు టెలిగ్రాం ఆయన దగ్గరుంది. నేను కందుకూరు వెళ్లి అది తీసుకుని విజయవాడలో డ్యూటీలో చేరాలి. ఆనందానికి హద్దుల్లేవ్. నా స్వయంకృషితో సంపాదించుకున్న ఉద్యోగమిది. ఎవరి సిఫారసులూ.. లేకుండా సాధించుకున్నా అని ఉప్పొంగిపోయా. మా తమ్ముడు అప్పటికప్పుడు స్వీట్ షాప్‌కి వెళ్ళి స్వీట్లు తెచ్చి అందరకీ పంచాడు.
మా తాతగారు దీన్నంతా వినోదంగా చూస్తున్నారు…
టైమెంతయ్యింది అనడిగారు..నిజమే టీవీలో హిందీ వార్తలు వస్తున్నాయి. అప్పట్లో అవి రాత్రి ఎనిమిది నలబై నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రసారమయ్యేవి. నిజమే తాతగారు చెప్పిన సంగతి వాస్తవం. కరెక్టుగా అదే సమయంలో నాకు సమాచారం అందింది. ఎంత ఆశ్చర్యం…. అప్పుడు ఆయన నా జాతకం పుస్తకం బయటపెట్టారు…చూడమని ఓ పేజీవరకూ మడత పెట్టి ఇచ్చారు.
(అందులో ఏం రాశారో…రేపు.. చదువుదురు గాని….)
Nice to hear