వేదిక కానున్న హైదరాబాద్
ముస్తాబైన టీఆర్ఎస్ కార్యాలయం
రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో సందడి
హైదరాబాద్, డిసెంబర్ 09: హైదరాబాద్ శుక్రవారం నాడు రెండు చారిత్రక సంఘటనలకు వేదిక కానుంది. తెలంగాణ సెంటిమెంటుకు ఆలంబనగా నిలిచి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కీలకమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక కనుమరుగు కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిముషాల నుంచి అది భారతీయ రాష్ట్ర సమితిగా మారనుంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సచివాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు గురువారం లేఖ అందింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరో కీలకమైన అంశం. రాయదుర్గ్ – శంషాబాద్ మెట్రో లైన్. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే ప్రయాణికులకు అత్యంత ప్రయోజనం కలిగించే ఈ కార్యక్రమం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌లోనే లగేజిని ఇచ్చేసి, నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. దీని వల్ల విమానాశ్రయంలో చెక్ఇన్ సమయం తగ్గుతుంది. 6500కోట్ల రూపాయల అంచనాతో తెలంగాణ ప్రభుత్వమే మెట్రో లైన్‌ను నిర్మించపూనుకుంది.