‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా హైదరాబాద్‌

0
49

వేగంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదిక అందజేత

హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది.

ఈ విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (MoUs), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది.

ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ నగరాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

కమిటీ నివేదిక ప్రకారం అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి.

ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది. దీనికితోడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లోని డాక్టర్ MCR HRD ఇన్‌స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ అంతర్జాతీయ కోర్సులు రాబోయే నవంబర్ నెల నుంచే నగరంలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి.

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), లండన్ బిజినెస్ స్కూల్, వర్జీనియా టెక్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి దిగ్గజ విద్యాసంస్థల అధిపతులతో విస్తృత స్థాయి చర్చలు జరిపింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంస్థల నిపుణుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ప్రత్యక్షంగా ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి.

నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని నివేదిక స్పష్టం చేసింది.

కమిటీ నివేదికను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యానికి ఈ విదేశీ పర్యటన, అంతర్జాతీయ వర్సిటీల భాగస్వామ్యం ఊపిరి పోసిందని హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర విద్యార్థులకు, యువతకు హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాలు అందేలా రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’కు తానే స్వయంగా నాయకత్వం వహిస్తానని సీఎం ప్రకటిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ విద్యా కేంద్రం (గ్లోబల్ నాలెడ్జ్ హబ్) ఏర్పాటైతే మరిన్ని ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) తెలంగాణకు తరలివస్తాయని వెల్లడించారు.

దీనివల్ల మన యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తయారీ, పరిశోధన రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. డాక్టర్ MCR HRD ఇన్‌స్టిట్యూట్ వైస్ ఛైర్‌పర్సన్ శాంతి కుమారి, సీఎం సలహాదారు కె. రామకృష్ణరావు ఈ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేశామని వివరించారు.

రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో ప్రపంచ విద్యాసంస్థల భాగస్వామ్యం, క్రీడా రంగా అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని (ట్రాక్) నిర్వహించనున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here