విజయవాడ ఉలికిపాటుకు కారణం?
ఈనాడు – నేను: 13
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
పని పూర్తయింది. ఇంటికెడదామని బయలుదేరాం. బయటకొచ్చి చూశాం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కూడళ్ళలో పోలీసుల ఇనుప బూట్ల నుంచి వెలువడే చప్పుళ్లు.. అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ తిరిగే పెట్రోలింగ్ వాహనాలు. అప్పుడు విజయవాడ కమిషనర్ ఆర్.పి. సింగ్.. ఇక్కడ ఆయన కనబరిచిన సమర్థత గురించి చెప్పుకుని తీరాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అంకం ముగియడంతో మొత్తం ఫోర్సును తదుపరి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలకు తరలించారు. అతి తక్కువ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాంటి సమయంలో సంఘ విద్రోహక శక్తులు చెలరేగిపోవడానికి అవకాశం ఎక్కవగా ఉండే ఘటన… రాజీవ్ గాంధీ హత్య…
పాత సంఘటనలు గుర్తుచేసుకున్న బెజవాడ
రంగా హత్య సమయంలో చోటుచేసుకున్న విధ్వంసకర ఘటనలు తలచుకుని విజయవాడ చివురుటాకులా వణికింది. కస్తూరిబాయ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఉన్న డాక్టర్ శ్రీహరి గారి ఇంటిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి… తక్కువ సిబ్బంది… కత్తిమొన మీదలాంటి సున్నితమైన వాతావరణం.. ఎలా హ్యాండిల్ చేస్తారు. కొన్ని పోలీసు వర్గాల ద్వారా మాకు తెలిసిందేమిటంటే… పోలీసు వ్యాన్లను పూర్తిగా టార్పాలిన్లతో కప్పేసి.. ఒక్కో వ్యానుకు కనీస సిబ్బందిని ఉంచి.. కిటికీలలోంచి తుపాకులను బయటకు కనబడేలా పెట్టి హెచ్చరికలు జారీ చేస్తూ నిరంతరం తిప్పారని. ఇది సత్ఫలితాన్నిచ్చిందని అప్పట్లో కొందరు చెప్పారు. ఇందుకోసం మునిసిపల్ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారని వ్యూస్ విత్ కె.వి.ఎస్. ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ చెప్పారు. అలా చేయటం ద్వారా, ఆ సిబ్బంది ప్రాణాలను కూడా ఇబ్బందుల్లో నెట్టినట్టవుతుంది అని అనిపించడం లేదా అన్న నవీన్ ప్రశ్నకు ఆర్పీ సింగ్ నేను అంత ఆలోచించలేదు. శాంతిభద్రతలను రక్షించడానికి అప్పటికి నాకు తోచింది చేశా అంతే అన్నారని నవీన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమి చేసినా సమాజం కోసమే కదా… HATSOFF TO RP SINGH. ఎటువంటి దారుణాలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది. సున్నితమైన శాంతిభద్రతల అంశాన్ని అత్యంత సమర్థంగా నిర్వహించిన శ్రీ ఆర్.పి.సింగ్ గారికి అప్పట్లో ధన్యవాదాలు చెప్పని వారు లేరు.
విజయవాడకు ఎందుకింత భయం?
ఇంత కంగారు పడడానికి కారణం… రంగా హత్యానంతరం విజయవాడలో చెలరేగిన హింసాకాండ. ఎవరు చేశారనేది పక్కన పెడితే… ఆవిష్కృతమైన భీతావహ వాతావరణం.. నగరవాసులను పసిపిల్లలుగా మార్చింది. చిన్న పిల్లల్ని ఏం చేస్తారోననే భయంతో వణికిపోని ఇల్లు లేదు అప్పట్లో.. కొన్ని ప్రాంతాలలో వీధి మొదట్లో ఆ వీధికి చెందిన పెద్ద మనుషుల్నీ, వయోవృద్ధుల్నీ, అజాత శత్రువుల్నీ నిలబెట్టి అల్లరి మూకలు తమ వైపు రాకుండా చేసుకున్నారు. మహీధర రామ్మోహనరావుగారు ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో పదుగురితో పంచుకున్నారు. దుకాణాల లూటీలు యథేచ్ఛగా సాగిపోయాయి. దొరికిన వారిని దొరికినట్లు తన పర భేదం లేకుండా రోడ్ల పైనే కొట్టడం. ఉరుకులు, పరుగులు, అక్కడక్కడా గృహ దహనాలు… ఆ పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది. వీలు చూసుకుని శత్రువుని దెబ్బదీయడానికి చూసే శక్తులకు ఇలాంటి సంఘటనలు మరింత రెచ్చిపోయేలా చేస్తాయి. అందుకు విజయవాడ నగరం పెట్టింది పేరు… అది ఒకప్పుడు..
ఈనాడు కార్యాలయం రక్షణకు…
1988 డిసెంబర్ మూడో వారంలో రంగా హత్యానంతరం బీభత్సకాండ నుంచి ఈనాడు కార్యాలయాన్ని కాపాడుకోవడానికి సిబ్బంది అహరహం శ్రమించారని అప్పటి ఉద్యోగులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వారికి తెలుసు అప్పుడేం జరిగిందో. ఈనాడు కార్యాలయం మీద కూడా దాడి జరిగింది. మూకలు కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చారు. వాహనాలను తగుల పెట్టారు. మెషినరీని ధ్వంసం చేశారు. ఒక సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్ పోశారు. దాంతో ఆయన అక్కడి నుంచి పారిపోయారు. ఉద్యోగులు బిక్కుబిక్కుమన్నారు. ఆ రోజు పత్రికను విశాఖ నుంచి ప్రింట్ చేయించారు. అంతటి భీతావహమైన పరిస్థితిలో కూడా పత్రికను తేవడం ఒక్క ఈనాడుకే చెల్లింది. ఆ తదనంతరం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే గన్ లైసెన్స్ తీసుకున్నారని చెబుతారు. ఆ గన్‌నే నేను మేనేజర్ కొల్లి వెంగళనీడుగారి దగ్గర చూసింది. ఇది మాత్రమే కాక… ఈనాడు కార్యాలయ కారిడార్లలో మూలన కంకర రాళ్ళు ఉంచుకుని.. వాటి సాయంతో మూకలు ఎడిటోరియల్ విభాగంలోకి రాకుండా కాపాడుకున్నారని జి. కేశవరామయ్యగారు ట్రైనింగులో ఉన్న మాకు చెప్పారు. సంస్థ కోసం ఉద్యోగులు అప్పట్లో పని చేసిన తీరు మా(నా)లో స్ఫూర్తి నింపింది. ఏం చేసినా సంస్థ కోసమే. స్వలాభం లేదు. పని పూర్తయ్యే వరకూ కార్యాలయంలో ఉండాల్సిందే. పనిలో విరామం లేదు.. విసుగు లేదు.. చిరాకు అసలే లేదు. బాయ్ నుంచి డైరెక్టర్ వరకూ అందరిలో ఇదే తృష్ణ. అదే ఈనాడు సహజ లక్షణం.
మరుసటి రోజే ఆఫీస్ బయటకు
ఇక మళ్ళీ విషయంలోనికి… ఆఫీసు నుంచి అడుగు బయటపెట్టడానికి భయపడ్డాం. కర్ఫ్యూలో తిరగడానికి వీలుగా పాస్‌లిస్తారనే విషయం కూడా మాకు తెలీదు. మళ్ళీ పైకెళ్ళాం. ఏమిటి వచ్చేశారు? అడిగారు మేనేజర్… విషయం చెప్పాం. సరే చేసేదేం లేదు.. ఇక్కడే భోజనాలు చేసేయండి..పొద్దున్నే వెడుదురు గానీ.. అన్నారు. అలా ఆ రాత్రి ఆఫీసులోనే గడిచిపోయింది. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కర్ఫ్యూ పాస్‌లు వచ్చాయి. తీసుకుని బయటపడ్డాం. అవి చూపించుకుంటూ ఇంటికెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఓ బెటాలియన్ నిలదీసింది. కర్ఫ్యూ పాస్‌లు తీసుకుని చింపేశారు.. లాఠీలు మీదకు విసిరారు.. పరుగులు తీసుకుంటూ ఆఫీసుకు చేరాం. అంతే అలాగే ఉంటుంది ఇలాంటి సందర్భాలలో…
హంతకుల వేట – కార్తికేయన్
రాజీవ్ హత్యానంతరం.. ఘటనలపై వార్తలతో పేపర్లు నిండిపోతున్నాయి. ఎవరు చేశారనేది మూడోరోజుకు స్పష్టత వచ్చింది. ఇది ఎల్.టి.టి.ఇ. పనేనని తేలింది. మానవబాంబు ఈ పనికి పాల్పడిందని తెలిసి దేశం మ్రాన్పడిపోయింది. ఒక నాయకుణ్ణి చంపేయడానికి ఒక మహిళను నియోగించారని తెలిసి ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందనే అంశంపై పుంఖానుపుంఖాలుగా కథనాలు.. వాస్తవాలు కొన్ని… అవాస్తవాలు మరిన్నీ..
మూడో రోజు ది హిందూలో ప్రచురితమైన ఫొటో నిజంగా సంచలనమే… రాజీవ్ గాంధీ చిరునగవు మోము తుత్తినియలు కావడానికి కొన్ని నిముషాల ముందు తీసిన ఫొటో అది. ఒంటి కన్ను గుంట నక్క శివరాసన్, మానవ బాంబు థాను, నళిని, తదితరులు ఆ చిత్రంలో ఉన్నారు. మానవ బాంబు ఈమే అని చిత్రిస్తూ ఫొటోను ప్రచురించారు హిందూ వారు. అదీ జర్నలిజమంటే… దేశం యావత్తూ అవాక్కయిపోయింది. బాంబు పేలుడు తరవాత రాజీవ్ అందమైన ముఖం ఎలా అదృశ్యమైందో ఊహించి మరీ వార్తలు రాసేశాయి పత్రికలు. ముఖ భాగం డొల్లగా మారిందనీ, వేనవేల ఇనుప గుళ్ళు ఆయన కపాలాన్ని తుత్తునియలు చేసేశాయనీ.. ఇలా భీతావహ దృశ్యాలను ఆవిష్కరించాయి.
(Sri G Valliswar with Sri DR Karthikeyan)
ఈ సంఘటనపై దర్యాప్తునకు కేంద్రం ప్రత్యేక కేంద్ర బృందాన్ని నియమించింది. దానికి కార్తికేయన్ నేతృత్వం. దర్యాప్తు అనంతరం అది సాగిన విధం.. ఆ క్రూరాత్ములను వేటాడిన పద్ధతి వివరిస్తూ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయుడు శ్రీ జి. వల్లీశ్వర్ తెనుగీకరించారు. దాని పేరు నిప్పులాంటి నిజం.
ఆయన రాసిన శైలి నన్నెంతో ప్రభావితం చేసింది. అద్భుతమైన కథనంతో సాగింది. ఓ దర్యాప్తు ఎలా సాగుతుందో… అందులో సవివరంగా ఉంది. వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులూ.. వాటిని వారు అధిగమించిన తీరు.. మాటలలో వివరించలేం. చదవాల్సిందే…
రాజీవ్ గాంధీ అంశాన్ని పుచ్చుకుని నేను ఒక ఏడాది ముందుకు వచ్చేశాను. వచ్చే భాగంలో కొంత వెనక్కి వెడదాం…