(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
ఆమె మన కుమార్తె.. చక్కగా పెంచుకుందాం అనే డైలాగుతో ఒక కోటీశ్వరుణ్ణి సొంతం చేసుకున్న ఒక యువతి అనంతర కాలంలో ఎలా మారిపోయింది.. ఆ కోటీశ్వరుడి మానసిక సంక్షోభం… ఈ రెండింటి మధ్య ప్రేక్షకులను నలిపేసిన కథ ‘గమ్యం’. ఆటిజంతో బాధపడే కుమార్తె వెంటనే ఆయన ఆలోచనలు ఉంటాయి. రెండో భార్య సతాయింపులు… ఏమీ తెలియని చిన్నారి బేల చూపులు.. నడుమ ఆ కోటీశ్వరుడు సతమతమవుతాడు.
చివరికి ఒక ఆటిజం కేర్ సెంటర్లో తన కుమార్తెను చేరుస్తాడు. వారానికి ఒకసారి భార్యకు కూడా తెలియకుండా చూసివస్తుంటాడు. ఆమె పుట్టినరోజున తప్పనిసరిగా వెడతాడు. అవసరాల రీత్యా క్యాబ్ డ్రైవరుగా మారిన మరో యువకుడితో ఆటిజం సెంటరుకు వెడుతుండగా మాటలు కలుస్తాయి.
తన కథ చెబుతూనే ఆ కోటీశ్వరుడు క్యాబ్ లోనే కన్నుమూస్తాడు. ఇక్కడే అసలు మలుపు. ఆ మలుపు తెలుసుకోవాలంటే ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న ‘గమ్యం’ చూడండి. గుండె తడి అవ్వడం ఏమిటో తెలుస్తుంది. కరడుగట్టి పోయినవారికి సైతం ఎక్కడో మూలాన దాక్కున్న మానవత్వం సైతం నిట్టూర్పు రూపంలో బయటకు వస్తుంది.

ప్రముఖ దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తీరు, ఒక చక్కని సందేశాన్ని ఇచ్చింది. ఎలాంటి చిత్రాలు నిర్మించాలో ఒక సూచన చేసింది. స్క్రీన్ ప్లే పక్కాగా ఉంది. లెక్కల మాస్టారు, కాలింగ్ బెల్ తరవాత చూసిన అత్యంత హృద్యమైన చిన్న కథ ఇది. ఇందులో సిగరెట్లు కాల్చడం ఉండదు. మందు తాగడం ఉండదు… ఒక్క మాటలో చెప్పాలంటే ఇవేవీ లేకుండా ఒక ఫిలిం ఎలా తీయాలో ‘గమ్యం’ చెప్పింది.

ఇంతటి మానవీయమైన కథనాన్ని ఆమోదించిన ఈటీవీ విన్ యాజమాన్యానికి, ముఖ్యంగా కిరణ్, శైలజ గార్లకు, బాపినీడు గారికి కృతజ్ఞతలు చెప్పితీరాలి. ఎప్పుడో రేడియోలో వచ్చిన అరగంట నాటికల స్ఫూర్తిగా సంస్థ చేస్తున్న ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. పాడుతా తీయగా ద్వారా రామోజీ రావు గారు కొత్త గళాలకు ఎలా అవకాశం ఇచ్చారో.. పైన పేర్కొన్న ముగ్గురూ కథాసుధ రూపంలో కొత్త కళాకారులకూ, దర్శకులకూ చోటుఇస్తున్నారు. వెలుగులోకి తీసుకొస్తున్నారు.

