ఆరుద్ర రచనల్లో మకుటాయమానం త్వమేవాహం

0
172

(రోచిష్మాన్, 9444012279)

“కసిని పెంచే మతము
కనులు కప్పే మతము
కాదు‌ మనకభిమతము
ఓ కూనలమ్మ”

ఆరుద్ర రచనగా ఇదే నే తొలిసారి‌ చదివింది. బాగా చిన్నప్పుడు.‌

“ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు”

ఓ‌ సినిమా పాటలో ఆరుద్ర రాసిన వాక్యాలు. నేను వీటిని విన్నప్పటినుంచీ ఇప్పటి వఱకూ నచ్చినవి నచ్చినట్టుగానే ఉన్నాయి.

ఆరుద్ర త్వమేవాஉహమ్ లోని “ఆవాహన” నాకు చాలా ఇష్టం. అందులో “శూన్యం నిద్రలో సూర్యుడు‌ కలలాగా పుట్టాడు” అనీ, “కాల స్వరూపం విరి, కాదు ఆవిరి” అనీ ఆపై ఇంకొన్నీ వారు అన్నవి వారిని నాకు నచ్చేట్టు చేశాయి.‌‌ కవిత్వానికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్న తొలినాళ్లవి.

త్వమేవాஉహమ్ లో … “ఖేయాను ఎడారి‌ లోపల
ఒయాసిస్సు పొయిట్రీ”
ఆపై “ఒక పదంతో ఇముడవలసిన అర్థం
కొన్ని వాక్యాల‌ విస్తీర్ణతను
దురాక్రమణ చేస్తుంది…” ఆపై
“ఎందులకీ కొలమానమ్ములు
దండుగ మన ఉపమానమ్ములు”
ఆపై “నువ్వు ఎక్కదలచుకొన్న రైలు
ఎప్పుడూ ఒక జీవితకాల‌ం లేటు”
ఆపై “అడ్డమైన కొండలని
కోసుకొని ప్రవహించమని
జ్ఞాపకం చెయ్యక్కర్లేదు
సరితకు –
అడ్డమైన‌ మేఘాలను
చీల్చుకుని ప్రకాశించమని
జ్ఞాపకం చెయ్యక్కర్లేదు
సవితకు”
వంటివి నాకు ఇష్టం.

“ఆరుద్ర చేసిన రచనలన్నిటిలో ముఖ్యంగా కవితా రచనల్లో మకుటాయమానమైనది త్వమేవాஉహమ్” అని దాశరథి అన్నారు‌. “ఆరుద్రది ధ్వని ప్రధానమైన కవిత. త్వమేవాஉహమ్ లో మహాధ్వని ఉంది” అనీ దాశరథి అన్నారు. తనకు నచ్చిన ఇద్దఱు ఆధునిక ఆంధ్ర కవుల్లో ఆరుద్ర ఒకరని దాశరథి చెప్పారు.

అటు తరువాత ఆరుద్ర కూనలమ్మ పదాలు, ఇంటింటి పజ్యాలు, మఱి కొన్నీ చదివాను.

“నీ పిల్లన గ్రోవిలో ఏముందో కృష్ణా
తెలియక వేశాను ఈ ప్రశ్న”
అని ఆరుద్ర అన్నదాన్ని పీ.
బీ. శ్రీనివాస్ ఒక‌‌‌‌ లలిత గేయంలో పాడారు.

వీ.ఎ.కె. రంగారావుతో‌ పాటు‌ చిన్నప్పుడు నేను ఆరుద్ర ఇంటికి వెళ్లేవాణ్ణి. ఎంతో పేరున్న వాళ్లనైనా పెద్దగా పరిగణించని రంగారావుకు ఆరుద్ర అంటే గౌరవం.

ఆరుద్ర సంస్కారి; 80% కవులకు, సాహితీ వేత్తలకు ఉండే దుర్లక్షణాలు లేనివారు. ముఖ్యంగా కవులకుండే చవకబాఱుతనం, అసభ్యత, నైచ్యం, అసాంఘీకత్వం లేవు ఆరుద్రకు; హుందాగా ఉంటారు‌ ఆరుద్ర

“తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ”

తెలుగులో కవితకు సంబంధించిన వాళ్లకు ఈ ఆరుద్ర మాటలు బాగా పొసుగుతాయి.

పలకల వెండి గ్లాసు అని ఆరుద్ర తను రాసిన ఒక నవలకు పేరు పెట్టారు. నాకు బాగా నచ్చింది అలా అనడం.

ఒక మనిషి ఒక‌ భాషా సాహిత్య చరిత్రను సమగ్రంగా రాయగలగడం అన్నది ఏది నిజమైన అద్భుతం అవుతుందో అదే. ఆ అద్భుతమే ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్య చరిత్ర. అందువల్ల ఆరుద్ర కూడా ఒక అద్భుత‌ చరిత్ర.

రాయడంపై అడిగినప్పుడు కొంత చెప్పారు ఆరుద్ర ఒక‌‌ రోజున. మెత్తగా మాట్లాడతారు ఆయన. ఆయన కారు షెడ్‌ గ్రంథాలయం. ఆ‌ గ్రంథాలయంలో‌ నేను ఆయన ఎదురుగ్గా కూర్చుని వారితో మాట్లాడాను. అప్పుడు ఆయన్ను తెలుసుకోగల వయసు నాకు లేదు.

రమారమి 1,500కు పై చిలుకు సినిమా పాటలు రాశారు ఆరుద్ర. హిందీ ఆహ్ సినిమా తెలుగు రూపం ప్రేమ లేఖలు సినిమాలో ట్రాక్ చేంజ్ (డబ్బింగ్ కాదు) పాటలు ఆరుద్ర రాశారు.

“రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా” అంటూ అన్నమయ్య భావన్ను సినిమాలోకి తెచ్చారు‌. తమిళ్ష్(ழ்) కణ్ణదాసన్ భావాల్ని అరుద్ర కూడా తెలుగులోకి తెచ్చారు. కణ్ణదాసన్ భావాల్ని తెలుగులోకి తెచ్చిన మొదటివారు ఆత్రేయ కాదు ఆరుద్ర.

కమ్యూనిజమ్‌వల్ల సంఘానికి, సగటు మనిషికి, సాహిత్యానికి, కవిత్వానికి తీవ్రమైన హాని జరుగుతుంది; అది తప్పనిసరి పర్యవసానం. అదేమిటో
మరే భాష కవిత్వాన్నీ దెబ్బ కొట్టనంతగా తెలుగు కవిత్వాన్ని కమ్యూనిజమ్ దెబ్బకొట్టింది!
ఆరుద్ర కమ్యూనిస్ట్(?) అనేది ఉన్న మాటే; కానీ తన కమ్యూనిజమ్‌తో ఆరుద్ర తెలుగు కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఎంత మాత్రమూ దెబ్బకొట్టలేదు; ఏ దెబ్బా కొట్టలేదు. ఇది ఆరుద్రలోని మహోన్నతమైన అంశం!

“చీకట్లో బయలు దేరాను
వెలుగులోకి వెళ్లాలనుకుంటాను
విరోధం నుంచి విడివడ్డాను
స్నేహంలోకి పోవాలనుకుంటున్నాను
ఒంటరిగా బయల్దేరాను
జంటను వెతుక్కోవాలనుకొంటున్నాను”
(సినీవాలి నుంచి) అని ఆరుద్ర చెప్పిన‌ మాటల్ని మనం ఎన్నిసార్లైనా మళ్లీమళ్లీ చెప్పుకోవచ్చు‌.

ఇలా ఎన్నో చెప్పుకోవచచ్చు ఆరుద్ర గుఱించి. ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు ఆరుద్ర గుఱించి.

శివారెడ్డి, గోపి, అఫ్సర్ వంటి అనర్హులు ప్రముఖ కవులైపోయిన ఇవాళ్టి తెలుగు కవిత్వంలో, తెలుగులో కుల, మత నైచ్యం కవిత్వంగా వ్యాపించిన ఇవాళ్టి స్థితిలో, బ్రాహ్మణ భిక్షగా బతుకు వచ్చాక, ఒక హిందువు భిక్షగా చట్టం నుంచి తప్పించుకున్నాక, చీట్ల డబ్బు పాడుకుని దేశం విడిచి పోయి హిందుత్వం మీద దాడిచేస్తున్న తెలుగు, ఇంగ్లిష్ వాక్యాలు కూడా రాయడం తెలియని అనైతికత కవిత్వ ప్రాముఖ్యాన్ని పొందిన ఇవాళ్టి తెలుగు పరిస్థితిలో, గత దశాబ్ది కాలంగా కవులం అంటూ అశ్లీల జీహాది శక్తులు తెలుగు కవిత్వాన్ని ధ్వంసం చేస్తున్న దుస్థితిలో, తెలుగు కవిత్వం ఉచ్చల కంపుకొడుతున్న ఇవాళ్టి దుర్గతిలో…

ఆరుద్ర గుఱించి చెప్పుకోవడం తెలుగు సాహిత్యానికి ఎంతో అవసరం.

ఆరుద్ర శత జయంతి స్మరణలో


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here