అన్నమయ్య రత్నాల మాటలు

0
235

అన్నమయ్య అన్నది-22
(రోచిష్మాన్, 9444012279
)

“ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీఁడు
తిద్దరాని మహిమల దేవకిసుతుఁడు”

ముద్దులొలుకుతూ యశోదకు ముంగిటి ముత్యం; వీడు సవరించలేని (తిద్దరాని) మహిమలు చేసే దేవకి కొడుకు అని అంటూ అన్నమయ్య కృష్ణుడిపై చేసిన సంకీర్తన ఇది.

‘ముంగిటి ముత్యం‌’ అంటే అమూల్యమైనది అని అర్థం. కృష్ణుడు యశోదకు అమూల్యమే కదా? ముంగిటి ముత్యం అంటే ఎదురుగ్గా ఉన్న ముత్యం అని కూడా అర్థం ఉంది. ముత్యం సముద్రంలో చిప్పల్లో ఉంటుంది. సముద్రంలో ఉండే ముత్యం యశోద ఎదురుగా ఉంది అని అనడం ఎంతో బావుంది. జ్ఞానసాగరంలో ఉండే ముత్యం యశోద ముందున్నదని గొప్పగా చెప్పారు అన్నమయ్య. ముత్యం‌ స్త్రీలకు ఎంతో మేలు చేసే రత్నం. ముత్యం వైవాహిక విభేదాల్ని పోగొడుతుంది; మాంగళ్య వృద్ధినిస్తుంది. ముత్యం రాయి కాదు సేంద్రియమైనది.

ముంగిటి ముత్యము అనడం పింగళి సూరన కళాపూర్ణోదయంలో కూడా ఉంది. కృష్ణుడి మహిమలకు సవరణలు ఉండవు. అందుకే సవరించలేని మహిమలు (తిద్దరాని లేదా దిద్దరాని) అని అన్నారు. కృష్ణుణ్ణి రత్నాలలో ప్రతిబింబింపజేస్తూ చాల ప్రత్యేకంగా ఈ సంకీర్తన చేశారు‌ అన్నమయ్య ఇదిగో ఇలా…

“అంతనింత గొల్లెతల‌ అఱచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూఁడులోకాల గరుడపచ్చఁ బూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు”

గోపికలందఱి అఱిచేతి మాణిక్యం; స్పర్ధపడే (పంతమాడే) కంసుడి పాలిట వజ్రం; మూడులోకాల కాంతులతో ఉండే మరకతం (పచ్చ) మా చెంత ఉన్న చిన్ని కృష్ణుడు అని అంటున్నారు అన్నమయ్య.

మాణిక్యం విలువైన రత్నాల్లో ఒకటి. మాణిక్యాన్ని ‘రత్నాల రాజు’ అని అంటారు. విలువైన, రాజు వంటి వాడైనా కూడా గోపికలందఱి అఱిచేతిలో‌ ఉంటాడట. మాణిక్యానికి సూర్యకాంతం అనే పేరు కూడా ఉంది. కృష్ణుడి ప్రవర్తన సూర్యకాంతిలాగా చురుగ్గా ఉంటుంది. మాణిక్యం ఉత్సాహాన్ని , సాహసాన్ని , సంఘంలో ఉన్నత‌ స్థాయిని ఇస్తుంది. తనను నమ్ముకున్న వాళ్లకు కృష్ణుడు ఇవన్నీ ఇస్తాడు కదా? అందుకే ఇక్కడ కృష్ణుణ్ణి మాణిక్యం అన్నారు‌ అన్నమయ్య.

కంసుని పాలిట వజ్రము అంటున్నారు. వజ్రం అత్యంత కఠినమైనది; కొయ్యబడలేనిది. కంసుడు ఎంత చంపుదామనుకున్నా చిన్ని కృష్ణుణ్ణి చంపలేకపోయాడు. కృష్ణుడి కఠినత్వం ముందు కంసుడు నిలవలేకపోయాడు కదా? వజ్రం జాతకంలో‌‌ ఉండే సకల‌ దోషాల్నీ పోగొడుతుంది.‌ కృష్ణుడు కంసుడు అన్న పెనుదోషాన్ని‌ పోకార్చాడు కదా? వజ్రం ఆధ్యాత్మిక‌ పారవశ్యం పొందడానికి తోడ్పడుతుంది; ఆకర్షణనిస్తుంది; కీర్తినిస్తుంది; శత్రుజయాన్నిస్తుంది; ప్రశాంతతనిస్తుంది. కృష్ణుడు‌ ఇవన్నీ ఇవ్వగలిగిన వాడు కదా? ఇస్తాడు కదా?

మూడులోకాల కాంతులతో ఉండే మరకతం (పచ్చ) మా‌ చెంతనున్న చిన్నికృష్ణుడు అంటున్నారు. దోష రహితమైన మరకతం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. మరకతం లేదా‌ పచ్చ జనాకర్షణకు ప్రతీక.‌ కళలకు‌ సంబంధించినది.‌ ఈ రత్నాన్ని బుధుడికి చెందిన రత్నంగా చెబుతారు. బుధుడికి అధిదేవత మహావిష్ణువు. మహావిష్ణువు మహా కాంతిమంతుడు. మరకతానికి ‘హరిన్మణి’ అని కూడా పేరుంది. చూడండి‌ అన్నమయ్య ఎఱుక‌‌ ఎలాంటిదో. ఇవాళ తిరుపతి వేంకటేశ్వరుడికి కొన్ని‌ వందల కోట్ల ఖరీదు చేసే మరకతం‌ వక్షస్థలంపై‌ ఉండడం మనకు తెలిసిందే. ఇవాళ ఆ వేంకటేశ్వరుడి జనాకర్షణ కూడా మనం చూస్తున్నదే.

“రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేదికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ముఁ గాచేటి కమలాక్షుఁడు”

రతికేళి సమయంలో రుక్మిణి మోవి రంగైన పగడం;
గోవర్ధనం అంత పరిమాణం (మితి) ఉన్న గోమేదికం;
శాశ్వతంగా (సతమై) శంఖు చక్రాల మధ్యలో వైడూర్యం అయి మాకు గతి అయి మమ్మల్ని సంరక్షించే వాడు కమలాక్షుడు అని అంటున్నారు అన్నమయ్య.

రతికేళి సమయంలో రుక్మిణి మోవి రంగు వంటి పగడం అని అనడం గొప్పగా ఉంది. పగడం ఎఱ్ఱని రంగులో ఉంటుంది. పగడం ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ప్రయత్నాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. భావావిష్కారానికి(emotionకు) ప్రతీక పగడం. ఇక్కడ మనం అన్నమయ్య సందర్భౌచిత్య విజ్ఞతను గ్రహించాలి; గ్రహిద్దాం. పగడం వివాహ జీవితం రాణించడానికి ఉపయోగపడే రత్నం. ముత్యంలా పగడం కూడా రాయి కాదు; పగడం సేంద్రియమైనది.

గోవర్ధనగిరి అంత పరిమాణం ఉన్న గోమేది(ద)కం అట. గోమేదికం గోమూత్రం రంగులో ఉంటుంది. కష్టాలలోనూ, మంద స్థితిలోనూ ఉన్నప్పుడు గోమేదికం వాడితే సత్ఫిలితాలు వస్తాయి‌. గోమేదికం శత్రు జయాన్నిస్తుంది. గోమేదికం ఆధ్యాత్మిక పురోగతిని కూడా ఇస్తుంది. రక్షణనిచ్చే రత్నం గోమేదికం. గోవర్ధనగిరితో గోవుల్ని రక్షించి కమలాక్షుడు గోవిందుడయ్యాడు. ఆ సందంర్భంలోని కమలాక్షుణ్ణి గోమేదికం అని అనడం అన్నమయ్య గొప్పతనం.

కమలాక్షుడు శాశ్వతంగా (సతమై) శంఖు చక్రాల మధ్యలో వైడూర్యం అయి, మాకు గతి అయి మమ్మల్ని సంరక్షిస్తాడు అని అంటున్నారు అన్నమయ్య. వైడూర్యంవల్ల సుఖం, సంతోషం కలుగుతాయి; శోకం తొలగిపోతుంది. శీఘ్ర సత్ఫలితాలను ఇస్తుంది వైడూర్యం‌. ‘సర్వాకర్షణి’ అని వైడూర్యానికి పేరుంది. ఈ రత్నం రక్షణనిస్తుంది. అవరోధాల్ని తొలగిస్తుంది. ఇందుకే అన్నమయ్య కమలాక్షుణ్ణి ఇక్కడ వైడూర్యం అని అన్నారు.

“కాళింగుని తలలపైఁ గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధిలోనఁ బాయని దివ్య రత్నము
బాలుని వలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు”

కాళింగుడి తలలపై ఉన్న పుష్యరాగం, చేకొనే లేదా సంరక్షించే (ఏలేటి) శ్రీవేంకటాద్రి ఇంద్రనీలం, పాల కడలిలోన కొట్టుకుపోని దివ్యమైన రత్నం బాలుడులాగా తిరిగే ఈ పద్మనాభుడు అని అన్నారు అన్నమయ్య.

కాళింగుడి తలలపైని పుష్యరాగం అట. పుష్యరాగం అనే రత్నం జాతకంలో ఎక్కువ దోషాలుంటే వాటికి విరుగుడు. ‘విజయ రత్నం’ అని పుష్యరాగానికి పేరు. ఈ రత్నం నిజాయితీని, భక్తిని, మానవ సంబంధాల్ని పెంపొందిస్తుంది; ఆత్మన్యూనతా భావాన్ని తొలగిస్తుంది. కాళింగుడు‌ అంటే కుండలిని లేదా సర్ప శక్తి (serpent power). ఆ కుండలినిపై ఉండేది అధ్యాత్మికత. పుష్యరాగం ఆధ్యాత్మికతకు ప్రతీక.‌

శ్రీవేంకటాద్రి‌ ఇంద్రనీలం అట. ఇంద్రనీలం‌ విధిని మార్చగలిగే రత్నం. దురదృష్టాన్ని తీసేస్తుంది. జీవితాన్ని పునర్నిర్మిస్తుంది. “తళుకు బేళుకు రాళ్లు తట్టడేల? … … … మంచి నీలమొక్కటి చాలు” అని అన్నాడు వేమన. ఆర్ధిక ప్రగతినిస్తుంది, బ్రతుకు గతిని ఉన్నతంగా చేస్తుంది నీలం. అలాంటి‌ ఇంద్రనీలాన్ని వేంకటాద్రి అంటున్నారు అన్నమయ్య.‌
పిల్లాడిలా తిరిగే పద్మనాభుడు ఎలాంటి వాడు?
పాల కడలిలో కొట్టుకుపోని దివ్యరత్నం వంటి వాడు.
ఎంత గొప్పగా ఉంది అలా అనడం? అన్నమయ్య ఏమన్నా అది గొప్పగానే ఉంటుందేమో?

రత్నాల ప్రస్తావన చేస్తూ ఆ రత్నాల్లో కృష్ణుణ్ణి ప్రతిబింబింపజేశాక చిన్నికృష్ణుణ్ణి దివ్యమైన రత్నం అనడం అనడానికే రత్నం వంటిది. ఇలా అనడం శిల్ప శ్రేష్టత. అన్నమయ్య వంటి దివ్యమైన వాళ్లు మాత్రమే అందించగలిగే రత్నాల మాటల హారం ఈ సంకీర్తన.

రత్నాల ప్రస్తావనతో‌, రత్నాల మాటలతో రత్నం వంటి సంకీర్తనై మనలో తళుకులీనుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here