‘కరుణశ్రీ ఘంటసాలీ’యం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 94401 03345)
ఘంటసాల లలిత సంగీత గాన ప్రస్థానంలో అగ్రస్థానంలో నిలిచే ముఖ్య కవులలో జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ) ముందు వరుసలో ఉంటారు. జంధ్యాల పాపయ్యశాస్త్రికి ఘంటసాల వేంకటేశ్వరరావు వల్ల పేరు వచ్చిందా? ఘంటసాల వల్ల జంధ్యాల పరపతి పెరిగిందా? అని ఒకప్పుడు తెలుగునాట ముచ్చటించుకునేవారు. కానీ ఆ సంస్కారవంతులు ‘ఆ గొప్పదనం వారిదంటే వారిది’ అని గౌరవాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు. ‘కవి ఎంతో ఆవిష్కరించవచ్చు కానీ, అది గానరూపంలో జనంలోకి వెళ్లే అవకాశం, అదృష్టం అన్ని కావ్యాలకు, అన్ని వేళలా దక్కక పోవచ్చు. కనుక గాయకుడు గొప్పవాడు’ అనే వారు కరుణశ్రీ. అలాంటి భాగ్యం తన రచనలకు దక్కిందంటూ… ‘నా కవితా ఖండికలను ఖండఖండాంతరాల అశేష ప్రజానీకంలో ప్రచారం చేసిన ఆత్మీయుడు, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావుకు ‘నా అనురాగ లహరి’ని అనురాగపూర్వకంగా అంకితం చేస్తున్నాను’ అని కరుణశ్రీ ఖండకావ్యం పీఠికలో పేర్కొన్నారు. మరోవంక, బతుకు తెరువు కోసం సినీ నేపథ్య గానాన్ని ఎంచుకున్న తనకు, కరుణశ్రీ తదితర కవుల కావ్యాలు తన పద్యగాన తృష్ణను,ఇష్టాన్ని తీర్చాయని వినమ్రంగా చెప్పేవారు ఘంటసాల. ‘కుంతీ కుమారి’ రికార్డింగ్ కు హాజరు కాలేకపోయిన కరుణశ్రీ ‘నా అభిమాన కవిత ‘కుంతీ కుమారి’ని నీ చేతులలో పెట్టుచున్నాను. ఇకపై ఎటులనున్నదో దాని యదృష్టము’ అని లేఖ రాశారని శ్రీమతి సావిత్రి ఘంటసాల గుర్తుచేశారు. ఆ కవితా ‘కుమారి’ ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
భావసారూప్యం
జంధ్యాల, ఘంటసాల అభిరుచుల మధ్య అనేక సామ్యాలు కనిపిస్తాయి. ‘జీవించినంత కాలం రాయాలి, రాసినంత కాలం జీవించాలి’ అని మధురకవి అంటే, ‘బతికున్నంత వరకు పాడాలి, పాడేంత వరకు బతకాలి’ అన్నారు మధుర గాయకుడు. ఇద్దరూ తమ మనోవాంఛలను నెరవేర్చుకున్నారు.
‘పద్యం చచ్చిపోయిందని ఆనందంతో చిందులు త్రొక్కే పరమ మూర్ఖులు బయలుదేరారు ఈనాడు. ఈ పద్య ద్వేషం అన్న ద్వేషం వలె అనారోగ్యకరమైనది. పద్యమైనా, గేయమైనా, వచనమైనా కవిత్వమనే పదార్థం దానిలో ఉంటే అది తప్పక పది కాలాల పాటు బ్రతుకుతుంది’ అన్న కరుణశ్రీ ఆవేదనను ఘంటసాల గాత్రం మటుమాయం చేసింది. ఘంటసాలకు పూర్వాశ్రమంలో రంగస్థల అనుభవం ఉండడం వల్ల స్వతః ఆయన పద్యాలంటే మక్కువ కనబరిచేవారు. ఆ ఆసక్తితోనే పద్యగాన అవకాశాన్ని అందిపుచ్చు కున్నారు. ఘంటసాల పద్య పఠనానికి తనదైన పంథా సృష్టించారు.
హైదరాబాద్ లో ఒకసారి ఓ సినిమా శతదినోత్సవం వేడుకలో ప్రేక్షకుల అభ్యర్థనపై ఘంటసాల ఒకే ఒక పద్యం పాడారట. అదీ ‘పుష్పవిలాపం’లోనిదే. పద్యం పట్ల, కరుణశ్రీ పట్ల ఆయనకు గల ప్రేమాభిమానాలకు ఆ సంఘటనను మచ్చుగా చెప్పవచ్చు. ‘పుష్ప విలాపం’ అనన్య సాధ్యమైన గానలహరిగా నిలబడిందని, ఘంటసాల పద్య శైలికి అది ఒక బిరుదుగా బరువెక్కిందని ప్రముఖ దర్శకుడు సీఎస్ రావు వ్యాఖ్యానించారు. దేశవిదేశాల పర్యటనల్లో సంగీత విభావరుల్లో సినీగీతాలతో పాటు పద్యాలను సమంగా ఆలపించేవారు. అందులోనూ కరుణశ్రీ పద్యాలు తప్పనిసరి.
‘కరుణశ్రీ గారి కవిత్వం గురించి చెప్పడమంటే ఆకాశం నీలంగా ఉంటుందనీ, ఎవరెస్టు శిఖరం ఎత్తయిందనీ అన్నట్టుగా ఉంటుంది’ అని ఆచార్య సి. నారాయణ రెడ్డి ఒక సందర్భంలో అన్నారు. అదే పోలిక ఘంటసాల గారికీ వర్తిస్తుందనడం నిర్వివాదాంశం. ఘంటసాల వారి ‘భగవద్గీత’ రికార్డు విడుదల సభలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితో వేదిక పంచుకున్న ప్రముఖులలో జంధ్యాల వారూ ఒకరు.
భాషేతరులను కదిలించిన కలం, గళం
‘కరుణశ్రీ కలం నుంచి జాలువారిన పుష్ప విలాపం, కుంతీ కుమారి, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, అంజలి, కరుణామయి, ప్రాభాతి కావ్య ఖండికలు ఘంటసాల గాత్రంలో పరవశించాయి. ‘మహాకవి కాళిదాసు’ చిత్రంలో ఘంటసాల వారి శ్లోకాలు, శ్యామలాదండకానికి మురిసిన నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనను తమ అధికారిక నివాసానికి ఆహ్వానించారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా విచ్చేశారు. ఆ సందర్భంగా ఘంటసాల తమ కచేరిలో భాగంగా ఆలపించిన ‘పుష్ప విలాపం’ విన్న నెహ్రూ తనకు తెలుగు తెలియకపోయినా ఆ గాత్ర మాధుర్యానికి ముగ్ధులయ్యారు. ‘సాంధ్యశ్రీ, అద్వైతమూర్తి’ తదితర రికార్డులు విన్న ప్రఖ్యాత నటుడు రాజ్ కపూర్, సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ ఆయన గాత్ర మాధుర్యానికి, పద్యాల బాణీకీ ఆనందపడిపోయారట.
పుష్ప విలాపం, అద్వైత మూర్తి, సాంధ్యశ్రీ’ లను విన్న మలయాళీ భాషీయుడు ఒకరు తనకు తెలుగు అంతగా తెలియక పోయినా, ఆ పద్యాల బాణీ, ఘంటసాల వారి కంఠ మాధుర్యం, గాంభీర్యం, బాణీల గురించి విశ్లేషణాత్మకంగా పుస్తకం రాసిచ్చారని శ్రీమతి సావిత్రి ఘంటసాల నాటి స్మృతులను గుర్తు చేశారు. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)
ALSO READ: Neither a Drama or Novel a reality of Serious problem