Thursday, March 23, 2023
HomeArchieveశూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై

శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై

Goda devi story

(మాడభూషి శ్రీధర్‌)
తిరుప్పావై, అంటే సిరినోము లేదా శ్రీ వ్రతం, పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా 12 వందల సంవత్సరాల తరువాత కూడా చిరంజీవియై భాసిస్తున్న మహాకవయిత్రి గోదా దేవి. గోదా దేవి నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున (క్రీ.శ. 776) తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపు తీస్తున్నపుడు జనకునికి సీత వలె, విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ. అయోనిజ.
తులసీదళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు తండ్రి. ముద్దుగా కోదై (తులసిమాల) అని పేరు పెట్టుకున్నాడు. భూమినుంచి తులసి వచ్చినట్టే ఈ పాపకూడా వచ్చిందని మరొక అర్థం. పెంచింది శ్రీ విష్ణుచిత్తుడు. విష్ణువే చిత్తములో గలవాడు. తండ్రి ఆలోచనలు, మనసు, మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ భాసించారు.
వైష్ణవ మతంలోని ప్రేమ తత్త్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించారు. పిలుపులలో గోదై, అనే పేరు కాస్త మారి గోద అయింది. 13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించిన విద్యన్మణి గోదాదేవి. అందరినీ కలుపుకుని పోయే నాయకత్వలక్షణాన్ని ఈవ్రతం వివరిస్తున్నది.

Goda devi
Goda devi

స్త్రీమూర్తుల చదువులకు శ్రీ మూర్తి
ఆళ్వార్ అంటే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది
శ్రీవిల్లిపుత్తూరులో గోదమ్మ లభించిన పూలతోట, తులసీవనం
వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులబేధాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్) శ్రీవిష్ణుచిత్తులు, వారి కూతురు గోద ఉన్నారు. 12 మంది ఆళ్వార్ లలో స్త్రీమూర్తి ఈమె ఒక్కరే.
స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై. తులసీ వనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంటనడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది.
ఆండాళ్ అంటే నను గన్ననా తల్లి
తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే తనూ నేర్చుకున్నది గోద. తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీ మాల కోదై పూమాలల ద్వారా శ్రీ విల్లి పుత్తూరులోని మూలమూర్తి వటపత్రశాయికి ప్రేమసందేశాలు

Goda devi
Goda devi

గోదమ్మ దొరికిన చోట భక్తుల పుష్పార్చన
తన జన్మభూమి శ్రీ విల్లి పుత్తూరులో కొలువైన గోదాదేవి
పంపింది. ఆ కథల్లో అన్ని అవతారాలలో ఉన్న నారాయణుడు రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చినాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడనీ భర్తఅని బంగారు కలలు కన్నది. వటపత్రశాయిలో రంగడిని చూసుకున్నది. తండ్రీ అల్లినా తానే అల్లినా సరే ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తిచెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆమాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది.
ఓరోజు పెరియాళ్వార్ కు తాను తీసుకుని పోయిన పూమాలలలో అమ్మాయి శిరోజం కనిపించింది. శుధ్దిలో లోపం వచ్చిందని బాధపడి ఆ మాలలను స్వామికి సమర్పించకుండానే వచ్చి శిరోజం ఎందుకు వచ్చిందో తెలుసుకుని కూతురిని మందలించాడు విష్ణు చిత్తుడు. మహా అపరాధం జరిగిందనిమదన పడ్డారాయన.
ఆ రాత్రి విష్ణుచిత్తుడికి విష్ణువే కలలో కనిపించి కోదై తాను ధరించిబాగుందో లేదో చూసుకుని బాగుందనుకుని ఇచ్చిన మాల అంటేనే తనకు ఎంతో ప్రియమని కనుక గోదమ్మ ధరించి విడిచిన ఆ మాలలనే తనకు రోజూ సమర్పించాలని నారాయణుడు కోరుతాడు.

Goda devi
Goda devi temple

విష్ణుచిత్తునికి తన చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇక గోద తన కూతురు కాదు తనకు కన్నతల్లి ఆండాళ్ (అంటే నను గన్న తల్లి అని అర్థం) అనీ అర్థమైంది. అప్పడినుంచి విష్ణుచిత్తులు వారు ఆమెను ఆండాళ్ అనే పిలిచేవారు. (మనం కూడా కన్న కూతురిని బంగారు తల్లి అనీ మా అమ్మే అనీ అనుకుంటాం కదా).
ఇక గోదమ్మవారు మాలలు ధరించి బాగోగులు చూడడం, బాగున్నాయని ఆమె అన్నవే వటపత్రశాయికి పంపడం ఆనవాయితీ మారింది.
శ్రీరంగని వలచి వరించి…
అప్పడినుంచి ఆమెకు వచ్చిన మరో పేరు శూడి(చూటి)క్కొడుత్త (ఈ తమిళ పదానికి, ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు. 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక ‘‘పాడికొడుత్త నాచ్చియార్’’ అని మరో పేరుకూడా వచ్చింది. (వ్యాస ర‌చ‌యిత మ‌హీంద్ర స్కూల్ ఆఫ్ లా డీన్‌)

Madabhushi Sridhar
Madabhushi Sridhar

ALSO READ: కొత్త దారిలో కేసీఆర్!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ