తరతరాల వైభవం జగన్నాథ రథోత్సవం

Date:

20 జూన్, 2023 పూరీ రథయాత్ర సందర్భంగా…
(డా. వైజయంతి పురాణపండ)
వేసవి వెనుకబడి తొలకరి జల్లులు కురుస్తున్న సమయంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు వేడుకగా విహారయాత్రకు బయలుదేరతారు. దివ్యరథాల మీద పూరీ దేవాలయం నుంచి, స్వగ్రామంలో తోటలో కొలువుతీరిన భవంతికి చేరుకుంటారని భారతీయుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ యాత్రను శోభాయమానంగా, పవిత్రంగా నిర్వర్తిస్తారు. జగన్నాథుడిని విష్ణుమూర్తి అవతారంగా ఆరాధిస్తారు. ఒరిస్సాలోని పూరీ గ్రామంలో జగన్నాథుడు కొలువుతీరి ఉన్నాడు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను దేవాలయమంతా రథంలో ఊరేగిస్తుంటే, వేలకొలదీ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ రథాన్ని ముందుకు లాగుతారు.
ఈ ప్రక్రియకు మూలం బౌద్ధం
విగ్రహాలను రథంలో ఉంచి, భక్తులు లాగడం అనే ప్రక్రియకు బౌద్ధం మూలమని కొందరు చరిత్రకారుల భావన. క్రీ.శ. 5 వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు పాహియాన్‌… బుద్ధుడి రథాన్ని వీధులలో ప్రజలు లాగేవారని చెప్పాడు.
జగ్గర్‌నాట్‌…
ఈ యాత్ర ఆంగ్లేయుల జగ్గర్‌నాట్‌ ఆధారంగా ఏర్పడినదిగా భావిస్తారు. 18 వ శతాబ్దంలో రథయాత్రను ఆంగ్లేయ అధికారులు గమనించారు. వారు ఆ యాత్రను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే జగ్గర్‌నాట్‌ అనే పదాన్ని ఉపయోగించి, ఇక్కడి సంఘటనను మాతృదేశానికి చేరవేశారు. జగ్గర్‌నాట్‌ అనే పదానికి ‘విధ్వంసక శక్తి’ అని పేరు. రథయాత్ర సమయంలో అనుకోకుండా రథ చక్రాల కింద నలిగి వేలకొలదీ భక్తులు కన్నుమూశారు. జగ్గర్‌నాట్‌ అనే అభివర్ణన ప్రమాద సందర్భంలోనే రావడం యాదృచ్ఛికం.
ఇలా జరుపుకుంటారు…
ఉదయాన్నే రథయాత్రతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో… రథాన్ని ముందుకు నడిపి తమ భక్తిని చాటుకోవాలనే లక్ష్యంతో వేలకొలదీ భక్తులు దేశదేశాల నుంచి పూరీ చేరుకుంటారు. ఎంతో సంబరంగా జరిగే రథయాత్ర లాంఛనం – మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతుంది. బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు భక్తులకు కన్నులపండువుగా దర్శనమిస్తాడు.


మూడు రథాలు – మూడు రకాలు
మూడు రథాలు మూడు విభిన్న అంశాలు కలిగి ఉంటాయి. జగన్నాథుని రథాన్ని ‘నదిఘోష’ అంటారు. ఈ రథానికి 18 చక్రాలు ఉంటాయి. వీటి ఎత్తు 23 మూరలు. బలభద్రుని రథాన్ని తాళధ్వజ అంటారు, ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. వీటి ఎత్తు 22 మూరలు. సుభద్ర రథాన్ని ‘దేవదళన’ అంటారు. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. వీటి ఎత్తు 21 మూరలు.
విలక్షణం… వైభవం…
పూరీ రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిని సంతరించుకుంది. ముగ్గురు మూర్తులు ఒకే వేదిక మీద కొలువుతీరి ఉండటం వలన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. దేవతా మూర్తుల రూపకల్పనలోనూ, వాటికి అలంకరణ సామాగ్రిని తయారుచేయడంలోనూ అనేకమంది కళాకారులు నిమగ్నమై, అత్యంత ఆకర్షణీయంగా రూపొందించేందుకు కృషి చేస్తారు. దేవతా మూర్తులను అలంకరించడానికి 1200 మీటర్ల వస్త్రాన్ని వినియోగిస్తారు. 14 మంది దర్జీలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను రూపొందిస్తారు. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వస్త్ర తయారీ సంస్థ ఈ వస్త్రాలను అందిస్తుంది. ముంబైలోని సెంచరీ మిల్స్‌ కూడా వస్త్రాలను విరాళంగా ఇస్తుంది.
అహ్మదాబాద్‌ కూడా…
పూరీ రథయాత్ర తరవాతి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది అహ్మదాబాద్‌ రథయాత్ర. యాత్రను ఘనంగా నిర్వహించడంలోను, హాజరయ్యే భక్తుల సంఖ్యలోను అహ్మదాబాద్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఈ యాత్రను ఉపగ్రహాల సహాయంతో శాంతియుతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 1992లోరథయాత్ర హింసాత్మకంగా మారి, వేల మంది ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం.
సేరంపూర్‌ మహేశ్‌ రథయాత్ర…
పశ్చిమ బెంగాల్‌ హుగ్లీ జిల్లాలో నిర్వహించే మహేశ్‌ రథయాత్రకు ఎంతో చరిత్ర ఉంది. అతి పురాతన మైన రథయాత్ర మాత్రమే కాదు, అత్యంత వైభవంగా భక్తులను ఆకర్షించేలా ఈ యాత్ర సాగుతుంది. 1875లో నిర్వహంచిన మహేశ్‌ రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ యాత్రలో తప్పిపోయిన బాలికను ‘వందేమాతరం’ రచించిన బంకింగ్‌చంద్ర్‌ ఛటర్జీ స్వయంగా వెదికి పట్టుకున్నారు. కొన్ని నెలల తరువాత ఈ సంఘటన ఆధారంగా ‘రాధారాణి’ నవల రచించారు.


అందర్నీ ఏకం చేసే పండుగ
ప్రజలందరినీ ఏకం చేసే పండుగ. అన్ని తరగతులకు చెందిన భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు. ముస్లిములు సైతం ఈ రథయాత్రలో పాల్గొనడం విశేషం. ఒడిషాలోని సుబర్ణపూర్‌ జిల్లాకు చెందిన నారాయణపూర్‌ గ్రామంలోని వేల ముస్లిము కుటుంబాలు, క్రమం తప్పకుండా పూరీ రథయాత్రలో పాల్గొంటున్నాయి. రథాల తయారీ నుంచి రథాలను ముందుకు లాగేవరకు వీరు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు.
దారువులతో రథాల నిర్మాణం
ఆచార సంప్రదాయాలను అనుసరించి ప్రతి సంవత్సరం రథాలను దారువుతో రూపొందిస్తారు. ఇక్కడి విగ్రహాలను కూడా దారువుతోనే రూపొందిస్తారు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తొమ్మిదిరోజుల పాటు గ్రామంలో విడిది చేసే ఈ మూర్తులకు పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. వేసవి విడిది పూర్తి చేసుకున్నాక ఈ దారు మూర్తులు ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి.
వారం రోజుల పాటు ఉత్సవం
ఈ ఉత్సవం వారం రోజుల పాటు జరుగుతుంది. ఏటా రెండు మూడు లక్షల మంది ఈ ఉత్సవానికి హాజరవుతారు. 1397 నుంచి రథాలను ఏటా మారుస్తున్నారు. ప్రస్తుతం ఇనుప రథాల మీద ఈ యాత్ర సాగుతోంది. వీటి ఎత్తు 50 అడుగులు, బరువు 125 టన్నులు. నాలుగు అడుగుల వ్యాసంలో, 12 చక్రాలతో ఈ రథం రూపొందుతుంది. విగ్రహాలను ప్రతిష్ఠించే భాగాన్ని దారువుతోను, రెండు చెక్క గుర్రాలను తయారుచేస్తారు. రథసారథిని కూడా తయారుచేస్తారు.
మొదటి అంతస్థును చైతన్య లీల, రెండు మూడు అంతస్థుల్లో కృష్ణలీల, రామలీల నాలుగవ అంతస్థులో అతి పెద్దగా రూపొందిన జగన్నాథుని మూర్తిని ఉంచుతారు.
అహ్మదాబాద్‌లో రథయాత్ర
మిలియన్ల భక్తులు ఈ రథయాత్రకు హాజరవుతారు. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రథయాత్రను చూడటానికి అహ్మదాబాద్‌ చేరుకుంటారు. జమాల్‌పూర్‌లోని 400 ఏళ్లనాటి జగన్నాథ దేవాలయం నుంచి 14 కి.మీ. దూరం ప్రయాణించి మళ్లీ దేవాలయానికి చేరుకుంటాయి రథాలు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై, రాత్రి 8.30 కు ముగుస్తుంది.
ఆషాఢ శుక్ల విదియనాడు ప్రారంభమవుతుంది.
రథయాత్రకు పదిహేను రోజుల ముందుగానే జలయాత్ర ప్రారంభమవుతుంది.
సబర్మతి నదిలో పవిత్ర స్నానం ఆచరించడానికి బలభద్రుడు, సుభద్ర, జగన్నాథులను తీసుకువస్తారు. వేలకొలదీ భక్తులు రాగి బిందెలతో నీరు తీసుకువచ్చి ఈ జలయాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర కోసం 20 ఏనుగులను అలంకరించుతారు.
పవిత్ర స్నానం పూర్తయిన తరువాత ఈ మూర్తులను సరస్‌పూర్‌లో ఉన్న రంచోడ్జీ దేవాలయానికి తీసుకువచ్చి, మహాభిషేకం కోసం లక్షల మంది భక్తుల సమక్షంలో జగన్నాథ దేవాలయానికి తీసుకువెళ్తారు.
సంప్రదాయానుసారం తెల్లవారుజామున జరిగే మంగళహారతి కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి హాజరవుతారు. ముఖ్యమంత్రి పహింద్‌ సంబరాన్ని ప్రారంభిస్తారు. అంటే రథయాత్ర నడిచే చోట లాంఛనంగా వీధులను శుభ్రపరచటం అని అర్థం.
సరస్‌పూర్‌లో విశ్రమించే సమయంలో భక్తులకు స్థానికులు మహా భోజనం ఏర్పాటుచేస్తారు.
గజ ప్రదర్శన ఈ రథయాత్రకు ప్రత్యేకం. రథాలకు ముందుగా సుమారు 20 ఏనుగులు బారులు తీరతాయి. రథారోహుడైన జగన్నాథుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ఒక విశ్వాసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...