Thursday, September 28, 2023
Homeటాప్ స్టోరీస్మట్టివాడలో పుట్టిన మంచి మట్టిమనిషి

మట్టివాడలో పుట్టిన మంచి మట్టిమనిషి

జూన్ 19 స్వరసవ్యసాచి వేణుమాధవ్ వర్ధంతి

(మాడభూషి శ్రీధర్)

ఇంగ్లీషులో Speech is silver but silence is gold అని అంటారు. చాలా ఆలోచించి విచక్షణ చూపడం చాలా ముఖ్యమనిచెప్పడానికి, మాట వెండి అయితే మౌనం బంగారమనే సామెత పుట్టుకొచ్చింది. కాని నేరెళ్ల వేణుమాధవ్ స్వయంగా పలికే మాటలు, పలికించే శబ్దాలు, వెండి కాదు బంగారం. అదీ కాదు, వజ్రాల మూట.

ప్రపంచాన్ని తన మిమిక్రీ గళకళతో ఉర్రూతలూగించిన శబ్ద స్వర భావ రాగ తరంగ నిపుణుడు.వరంగల్లులో మామూలు బడిలో పాఠాలు చెప్పే పంతులు స్థాయినుంచి తన బహుగళాల వైభవ కళతో అనేక దేశాల ప్రజలను ఆకట్టుకున్నఅద్భుత అనూహ్య కళామూర్తిత్వ వ్యక్తిత్వం వేణుమాధవ్ ది. జూన్ 19, 2018నపరమపదించకపోతే ఎంత బాగుండేది.

జనధర్మలో గల్పికలు

వరంగల్లునుంచి మానాన్నగారు ఎం ఎస్ ఆచార్యనడిపే జనధర్మ వార పత్రికలో ఆయన రెండు మూడు గల్పికలు రాసినాడు.అవి నేను కంపోజ్ చేసి, చేయించి జనధర్మపేజిలో కూర్చి శీర్షికను అందంగా చేర్చి ముద్రించిన గుర్తుంది. అవి చిలకమర్తి ప్రహసనాల వలె ఉండేవి. అద్భుతమైన హాస్యం పండించే సన్నివేశాలను ఊహించి, స్క్రీన్ ప్లేతో సహా నిర్మించి ప్రదర్శించే శక్తి యుక్తులు ఆయన సొంతం.ఓ గల్పిక సారాంశం మీకోసం. ఒక వృద్ధుడు మరో వృద్ధుడితో రైల్లో మాట్లాడుతూ ఉంటాడు. రైలు ధ్వని, రైల్లో రకరకాల జనులు, వారి మాటలు, కాఫీ చాయ్ పల్లీలు సమోసాలు అమ్ముకునే వారి గోల, అంతా వినిపిస్తూ ఉంటుంది. రైలు కుదుపులకు నిలబడ్డవారు ఊగిపోతూ ఉంటారు.కూర్చున్నవారు కూడా కుదురుగా ఉండరు. పైబెర్తులో పడుకున్నవారు కూచున్నవారు కూడా కదులుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో కింది కుర్చీలలో ఎదురెదురు కూర్చున్న ఇద్దరు వృద్ధుల సంభాషణ.

విశ్వనాథ సత్యనారాయణ గారు, వేణుమాధవ్ గారు కలుసుకున్న అరుదైన ఫోటో ఇది. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన “శివార్పణము” అన్న కావ్యాన్ని, వేణుమాధవ్ గారికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఇది.

ఒకరు: ఒరేయ్ నీ వయస్సెంతరా?

మరొకరు: ఆ…. ఎంతో కొంత నీకెందుకు రా?

ఒకరు: ఎంతో కొంత అనే కన్న ఎంతో చెప్పవచ్చుకదా.నీకెందుకు అంటావేమిటి? కావాలంటే నా వయసు చెబుతాగానీనీ వయసు ఎంతో చెప్పు.

మరొకరు: నీ వయసు చెబుతానన్నావు కదా. ముందు చెప్పు. తరువాత నా వయసు చెబుతా…

ఈ విధంగా ఇద్దరూ ఎటూ తెమలకుండా ఓ పది పదిహేను నిమిషాల పాటు వయసు చెప్పుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. వినే వాళ్లు వీరికి ఎంత వయసుంటుందబ్బా అని ఎదురుచూస్తుంటారు. వీరు ఎంతకూ చెప్పరు. విసుగు వస్తూ ఉంటుంది.

మరొకరు:సరే విను చెబుతా. నా వయసు బహుశహా ఇరవై పాతిక మధ్య ఉండవచ్చురా…

ఒకరు: అవునా మరీ ఏమిట్రా అంత వయసైన వాడిలా ఎంతో పెద్ద వాడి వలె కనిపిస్తున్నావేం రా? నిజమేనా.

మరొకరు: మరి మనం ఎన్ని కష్టాలు పడ్డాం. అందుకే ఎక్కువ వయసనిపిస్తుంది.. అది సరే నీ వయస్సెంతరా?

ఒకరు: అబ్బే నీ అంత వయసు కాదులే…

మరొకరు:ఏమిటీ నా అంత కాదా… పళ్లూడి పోయి సరిగ్గా మాటలు కూడా రావడం లేదు. నీది నాకన్నా చిన్న వయసా… ఇంతకీ ఎంతంటావు చెప్పు.

ఒకరు: వేసుకోవచ్చు… పద్దెనిమీ ఇరవై మధ్య….

అందరూ నవ్వు ముఖం పెట్టి ఆశ్చర్యపోతూ ఉంటే…. పై బెర్తునుంచి ఠపీమని ఒకడు కింద పడ్డాడు.ఇద్దరు వృద్ధులూ నోరెళ్ల బెట్టి కిందికి చూస్తారు.ఏమిటి నాయనా ఇది అని అడుగుతారు. దానికతడు చెప్పిన జవాబు:

’’నేనిప్పుడే పుట్టాను‘‘

స్వర్గంలో మిమిక్రీ చేస్తూ దేవతలను అలరిస్తూ ఉంటాడు

కాలక్షేపం కబుర్లలో ఇంత హాస్యం వ్యంగ్యం జోడించడం విశేషం. తన ఈ రచనను వేణుమాధవ్ స్వయంగా తన గొంతులో అన్ని స్వరాలు పలికిస్తూ, రైలు బయలుదేరిన చప్పుడూ, క్రమంగా వేగం పెరగడం, నెమ్మదించడం… కాఫీ చాయ్ గోల, రకరకాల ధ్వనులు వివరిస్తూ ముసలి వారి గొంతును అనుకరిస్తూ గల్పిక రసవత్తరంగా సాగిపోతూ ఉంటే ప్రేక్షకులెవరికీ మరో ఆలోచన రాదు. నవ్వు ఆగదు. సభాసదులంతా గొల్లున నవ్వుతూ ఉంటేఎంత వింత? ఎంత ఆశ్చర్యం? ఎంత వినోదం? ఎక్కడ దొరుకుతుంది? వేణుమాధవ్ స్వర్గంలో మిమిక్రీ చేస్తూ దేవతలను అలరిస్తున్నాడా అనిపిస్తుంది.

మనకు కళాకారుల ప్రదర్శనాభిలాష పైన అనేక జోకులున్నసంగతి తెలిసిందే. ఒక వార్షికోత్సవంలో, చివరి కళాకారుడు ప్రోగ్రాం ఇస్తున్నాడట. ఆయనకు ఒకే ప్రేక్షకుడు మిగిలాడట. అందుకు ఆయన ధన్యవాదాలు చెబితే, ‘‘నేను ఉండక తప్పదు సార్, మీ కార్యక్రమం అయిపోయింతర్వాత ఆ తివాచీ తీసుకుపోవాలి’’ అన్నాడట. ఈ జోకును వేణుమాధవ్ ఎంతబాగా మలిచాడో చూడండి..ఒక్కడైనా ఉన్నందుకు ఆ కళాకారుడు ధన్యవాదాలు చెబితే, ఆ ప్రేక్షకుడు.. ‘‘మీ తరువాత నా మిమిక్రీ ప్రోగ్రాం ఉందండి’’ అన్నాడట.ఎంత వ్యంగ్యం, ఎంత హాస్యం కదా?

ఇటువంటివి చాలా రాశారు. చేశారు. ఇటువంటి సృజనాత్మక కళాకారుడు మరొకరు దొరకరు. ఉండరు. మిమిక్రీ కళాకారులెందరో ఉన్నా బహు భాషా నైపుణ్యం, సమయోచిత సంభాషణా చాతుర్యం, అద్భుతమైన సన్నివేశాలను సంభాషణలు నేపథ్య ధ్వనులతో సహా పండించడం, అపూర్వమైన జ్ఞాపక శక్తి, మైకు ముందు మనిషి తప్ప మరేమీ అవసరం లేని నిలువెత్తు కళారూపం మళ్లీ దొరకరు.

శిష్యపరంపర గొంతుల్లో వినిపిస్తున్నారు

వందలాది శిష్య పరంపరను సృష్టించిన వేణుమాధవ్ వారి గొంతుల్లో కనిపిస్తూ ఉండవచ్చు. అసమాన ప్రతిభావంతులెందరో ఉండి ఉండవచ్చు. కాని ఈ కళను సృష్టించి, నేర్చి, తీర్చిదిద్ది, ప్రదర్శించి, సిలబస్ తయారు చేసి, పాఠాలు చెప్పి, ఒక కొత్త వరవడి ప్రవేశ పెట్టిన తొలి కళాకారుడుగా వేణుమాధవ్ నిలిచిపోతాడు. ఆయన నటుడా, గాయకుడా, దర్శకుడా, రచయితా, బహుపాత్రధారియా, అంటే అన్నిటికీ కాదు కాదు లేదా అవును అవునూ అని జవాబు వస్తుంది. అన్నీ ఆయన గొంతులో ఉన్నాయనీ, ముఖంలో పలుకుతాయనీ, హావభావాల, అంగన్యాస విన్యాసాలతో కనిపిస్తాయనీ తెలిస్తే ఆయన్నేమనాలి? అసలు వేణుమాధవ్ ప్రతిభను ఏ పేరుతో పిలవాలి? బహుశా వేణుమాధవ్ కళ అనాల్నేమో?

ఇది ఆయన సంతకం. అటువంటి గొప్ప శిష్యుడెంత గొప్పవాడో తెలుసా.

మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్యులు గారు 36 ఏళ్ల క్రితం మిమిక్రీ శ్రీనివాస్గారి ప్రదర్శన చూసి రాసిన ఆశీః ప్రశంస. మిమిక్రీ శ్రీనివాస్ గారు ఎంత లబ్ధ ప్రతిష్ఠులో ఈ ఉత్తరం చూస్తే తెలుస్తున్నది. అడ్రస్ చూడండి…ఇంటి నంబర్ లేదు. శ్రీ శ్రీనివాస్ మిమిక్రీ ఆర్టిస్ వరంగల్ సరిపోదు.

చిలకమర్తివారి ప్రహసనాలు

ఆయన కళాజీవితం 1947లో ప్రారంభమైంది. చిలకమర్తి వారి ప్రహసనాలలో నటించినపుడే ఆయన ప్రతిభ భాసించింది.తన కళలకు ప్రేరణ చిత్తూరు నాగయ్య, మాధవ పెద్ది వెంకట్రామయ్య, వేమూరు గగ్గయ్య వంటినాటి తరం మేటి నటులని వేణుమాధవ్ చెప్పేవారు. ఈ మహానుభావుల నటకౌశల్యాన్ని ఎవరన్నా వివరించాలంటే వేణుమాధవే. వారి గొంతును అనుకరిస్తూ, వారి సినీ సంభాషణలను పలుకుతూ, పాడుతూ, నటిస్తూ వారిని మనముందు ప్రత్యక్షం చేస్తూ ఉంటే అంతకన్న కావలసిందేమిటి? రవ్వలు రాకపోతే ఏపనీ చేయని ఈ నాటి తరం వారు నవ్వులే రవ్వల కన్న మిన్న అని నవ్వులకోసమే కళ అని నమ్మిన వారొకరున్నారనడానికి వేణుమాధవ్ ఒక ఉదాహరణ.

పనులు ఆపి చూస్తూ ఉండిపోయేవాళ్ళం

విదేశాలకు ప్రదర్శనకు వెళ్లడం, రావడం, ఆ తరువాత జనధర్మ కార్యాలయానికి రావడం. అక్కడ ఆయన విశేషాలు చెబుతూ ఉంటే మాకే ఆ దేశానికి వెళ్లి ఆ కార్యక్రమం చూస్తున్నట్టు అనిపించేది. మా పనులు ఆపేసుకుని అట్లా చూస్తుండి పోవడమే మాపని. సీరియస్ గా పనిచేసుకునే మానాన్న కూడా నవ్వీ నవ్వీ కడుపు పట్టుకుని మరీ ఆనందించేవారు. మా ప్రింటింగ్ యంత్రం ఆగిపోయేది. రోడ్డుకే ఉన్న మా కార్యాలయం ముందు జనం ఆగి చూసే వారు. ఆయన నిరంతర కళాకారుడు. కళా ప్రదర్శన లేని సమయాలు చాలా తక్కువేమో.

మట్టివాడలో పుట్టిన మట్టిమనిషి

మట్టెవాడలో పుట్టిన మట్టి మనిషి నేరెళ్ల. మట్టివాసనలు మరవని మంచి మనిషి వేణుమాధవ్. నిరాడంబరుడు. ఆశయాలు పెద్దవే కాని ఆశలేమీ లేవు. ఎం ఎల్సీ పదవికి నామినేట్ చేశాం రావోయ్ అని నాటి ముఖ్యమంత్రిపి వి నరసింహారావు పిలిస్తే, ముందు ఉబ్బి తబ్బిబ్బు అయినా, వెంటనే అయ్యో టీచర్ ఉద్యోగం వదిలిపెట్టాల్సి వస్తుందే. ఆరేళ్ల ఎంఎల్సీ పదవి తరువాత ఏం చేయాలి? నాకు జీతం ఎవడిస్తాడు? అని బాధపడి, ఎంఎల్సీ పదవిలో చేరాలా వద్దా అని పదేపదే ఆలోచించిన అతి సామాన్యుడు, మాన్యుడు, ధన్యుడు, మనందరి మధ్యమెలిగిన వాడు వేణుమాధవ్. మామూలు మధ్యతరగతి కుటుంబం. ఉద్యోగం ఉంటే తప్ప నడవని బతుకులు. పూర్తిగా నేలమీదే ఉండే సగటు జీవులు.

తెలంగాణ సామాన్యతకు నిలువెత్తు ఉదాహరణ

తెలంగాణ సామాన్యతకు ఆయన నిలువెత్తు ఉదాహరణ. పాంటు షర్టువేసుకున్నా, ధోవతి లాల్చీ ధరించినా చెదరని చిరునవ్వు ఆయన చిరునామా. ఎప్పుడూ ఒక జోక్ చెప్పడానికి, దానికి ధ్వన్యనుకరణను జోడించడానికి సిద్ధంగా ఉండే నిత్య ఉత్సాహి. నేరెళ్లవేణుమాధవ్ నడుస్తూ ఉంటే ఆయన మధ్యతరగతి జీవితం కనబడదు. కులం కనబడదు, తెలంగాణ, రాయలసీమ కనబడదు. కళ -కళకళలాడుతూ కనిపిస్తుంది. జీవం ఉత్సాహం ఉట్టిపడుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ చైతన్యం. మా వరంగల్లుకు ఆయనే ఒక తాజ్ మహల్. మా వరంగల్లు కళలకు ఆయన ఒక బృహదీశ్వరాలయం.ఎంఎల్సీ సమావేశాలు ముగియగానే వరంగల్లు రావడం, జనధర్మ కార్యాలయంలో బుల్లి సమావేశం. అందులో మాకు విధానమండలి ప్రత్యక్షప్రసారం జరిగేది, సకల గళ కళావేదిక అయిన వేణుమాధవుడి ద్వారా.

వదాన్యదంపతులు

వారి నాన్నగారు నేరెళ్ల శ్రీహరి అమ్మగారు శ్రీలక్ష్మి గార్ల అతిథి మర్యాద, గృహిణీ గృహస్తు ధర్మం వేణుమాధవ్ ని కళాకారుడు చేశాయంటే అతిశయోక్తి కాదు. వరంగల్లుకు ఏ పెద్దసాహితీ వేత్త వచ్చినా, ఎంతటి కళా నిపుణుడు ఏతెంచినా వారి ఇంటికి రావలసిందే. ఆ ఇద్దరు వదాన్యదంపతుల ఆతిథ్యం స్వీకరించాల్సిందే. అయిదుతారల పూటకూళ్లకు వాళ్లు వెళ్లే వాళ్లు కాదు. ఎక్కడా దొరకని సజ్జన సాంగత్యం. వారు ప్రేమతో చేసే తిండి, పిండి వంటలు ఎక్కడ దొరుకుతాయి? వచ్చిన వారు ఎవరనుకున్నారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, వావిలికొలను సుబ్బారావు. వడ్డాది సుబ్బారాయుడు. కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి. ఇంకా నాకు తెలియదు. చాలామంది వచ్చేవారు. వారంతా ఉద్దండ పిండాలు. వారు మాట్లాడుతూ ఉంటే వినాలనిపించేంత తియ్యగా ఉండేవి.రకరకాల గొంతులు, ధ్వని విన్యాసాలు.

చమత్కారాలువ్యంగ్యశరాలు

మాట మెరుపులు మాట విరుపులు, వ్యంగ్యం, హాస్యం, కోపం, విసుగు, చాతుర్యం, పండిత ప్రకాండుల చర్చలు, రచ్చలు, వాద వివాదాలు… అన్ని బాల వేణుమాధవ్ కు మిమిక్రీ పాఠాలు చెబుతున్నాయని ఎవరికీ తెలియదు. అది కళ అనీ దానికి మిమిక్రీ అని పేరని కూడా తెలియదు. వేణుమాధవ్ కు కూడా తెలియదు. కాని కళాకారుడు తయారవుతున్నాడు. అర్జునుడు చెబుతూ ఉంటే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం విని తెలుసుకున్నట్టు, ఈయన నాయనగారి ఆతిధ్య కళాశాలలో,

మహామహుల సాహితీ కళా ప్రసంగాల పాఠాలతో సగం పద్మవ్యూహం కాదు పూర్తి ప్రపంచ వ్యూహాలను నేర్చుకుని విజయుడై, ధనంజయుడై, గళ సవ్యసాచియై, మురళీగానంతో ముల్లోకాలను బుజ్జగించిన వేణుమాధవుని వలె, గళం కళలతో విశ్వాన్ని వినోదంలో ముంచెత్తిన కృష్ణుడై వెలిగిపోయాడు. మిగిలిపోయాడు. మన మధ్యలేకపోయినా ఉన్నట్టే ఉన్నాడు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టే ఉన్నాడు.

వరంగల్లు ఆచార్యదేవులు

అమ్మగారి వంట, నాన్నగారి ఇంట మాత్రమే కాదు, వేణుమాధవ్ కు పాఠాలు చెప్పిన గురువులు- సినిమాలు. కళాశాలలు -సినిమా థియేటర్లు. టిక్కెట్ డబ్బులే ఆయన కట్టిన ఫీజులు. ప్రేక్షకులంతా సహాధ్యాయులే కాని వారికి తమ మధ్య ఒక అంతర్జాతీయ కళాకారుడు మౌనంగా ఎదుగుతూ ఉన్నాడని తెలియదు. నాగయ్య సినిమాలు తొలి నాటి గురువులు. తెలుగు ఇంగ్లీషు హిందీ సినిమాలు ఆతరువాత.వీరుగాక వరంగల్లు లోఆచార్యదేవులు కందాళై శేషా చార్యులు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి గారు వేణుమాధవుని లో ప్రతిభను గుర్తించి వెలిగించి దివ్యజ్యోతిగా మార్చారు.

రసాలే తప్ప రసాయనాలు లేని ప్రయోగాలు

1950లో మెట్రిక్యులేషన్ పాసై, 1952లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చేరారు. అప్పుడు ప్రిన్సిపాల్ బారు వెంకటనర్సయ్యగారు. వారి పేరు తెలియని వారు ఉండరు. ఇప్పుడు ప్రిన్సిపాల్స్ ఎవరికైనా గుర్తుంటారో లేదో. వేణుమాధవ్ కు ఆ ప్రిన్సిపాల్ గారు బర్సరీ స్కాలర్ షిప్ కింద 60 రూపాయలు మంజూరు చేశారట. ఇంకేముంది..మరి కొన్ని అపూర్వస్వర అనుకరణ కళలకు పునాది పడింది.కొత్త పుస్తకాలు కొనుక్కున్నట్టు. ఆయనకు సినిమాలే కళ్లముందు కదలాడే పాఠ్య పుస్తకాలు. పంతుళ్లు చెప్పని పాఠాలు, రసాలే తప్ప రసాయనాలు లేని ప్రయోగశాలలు.. అన్నీ. బోలెడు ఇంగ్లీషు సినిమాలు చూసారు. 60 రూపాయలు వడిసేదాకా.

విఠల్ మెచ్చిన కళాకారుడు

మరునాడు సినిమా దృశ్యాలు, నేపథ్య ధ్వనులు, గొంతులు, జంత్రాల రాగాలతో సహా సన్నివేశాలకు సన్నివేశాలు ప్రదర్శిస్తూ ఉంటే రామనర్సుగారు ఎంతో సంతోషించి ..,.ఆనందం పట్టలేక నీవేదో గొప్ప కళాకారుడివై ప్రపంచ ప్రసిద్ధుడివవుతావురా అని నోరారా దీవించారట. నా పెద్దకొడుకు బిపిఆర్ విఠల్ (గొప్ప సివిల్ సర్వెంట్, ఈయన కొడుకు సంజయ్ బారు). నీవు నా చిన్నకొడుకువు అన్నాడట ఆయన. అంతటి మహానుభావులు మనకు కనిపిస్తారా? ఆ ఉత్తముడి నోటి పుణ్యమేనేమో, వేణుమాధవ్ ఆ ఆశీస్సును నిజం చేసారు. ఆ కల, ఈ కళ సాధించారు. తండ్రి శ్రీ హరి మన వేణుమాధవ్ కళలకు పాదులుకల్పిస్తే, వెంకటనర్సయ్య గారు అమృత జలాలు అందించారు. ఆశీస్సుమాలు కురిపించారు. ఆచార్యుడు తండ్రి అంతటి వాడని నిరూపించారు.

వివిధ దేశాలలో అనేకానేక ప్రదర్శనలు

ఆస్ట్రేలియా ఫిజీ దీవుల్లో (1965), సింగపూర్ మలేషియాల్లో (1968, 1975), పశ్చిమజర్మనీ ఇంగ్లండ్, ఫ్రాన్స్ అమెరికా కెనెడా, లెబనాన్ లో (1971), ఐక్యరాజ్యసమితిలో (1971), అమెరికా కెనడా (1976, 1982), దక్షిణాఫ్రికా, మారిషస్, సీషెల్స్ (1976), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1987), మళ్లీ మారిషస్ (1990) దేశాల్లో ఆయన అనేకానేక ప్రదర్శనలు ఇచ్చి దిగ్విజయ యాత్ర చేసారు. ఇక మనదేశంలో గజారోహణ, కనకాభిషేకం, పౌరసన్మానాలు, కళాప్రపూర్ణ, గౌరవ డాక్టరేట్లు ప్రవాహమై ఆయనను చేరాయి. ధ్వన్యనుకరణ సామ్రాట్ అని మనం అందరం చెప్పుకుంటాం. కాని చుపే రుస్తుం అనీ, స్వర్ కే రాజా అనీ ధ్వన్యనుకరణతో కలిపి చక్రవర్తి, కళానిధి, కళాసరస్వతి, సార్వభౌమ అనీ ఎన్నెన్నో బిరుదులు వరించాయి.

చేయించు‘కొన్న’ సన్మానాలు అక్కరలేని వ్యక్తి

చేయించు’కొన్న‘ సన్మానాలు, తెప్పించు ’కొన్న‘ బిరుదులు, కప్పించు ’కొన్న‘ శాలువలు ఆయనకు అక్కరే లేవు. ప్రేమాదరాలతో పెద్దలు చేసి ఆశీస్సులే అవన్నీ. పద్మశ్రీ, ఎం ఎల్సీ, ఆయన పేరు పక్కన చేరిన అలంకారాలు. మిమిక్రీ కళాసరస్వతీ పీఠంలో వేణుమాధవ్ సాహితీ ప్రబంధ పరమేశ్వరుడైన శ్రీనాథుడి వంటి వాడు. మట్టెవాడ, వరంగల్లు, తెలంగాణ, భారతదేశం మాత్రమే కాదు ఈ ప్రపంచం అంత గొప్ప ముద్దుబిడ్డును కన్నందుకు గర్వపడుతుంది. తను ప్రేమించిన తనను ప్రేమించిన సొంత ఊళ్లో, తన ఆత్మీయుల అనురాగ నిలయమైన సొంత ఇంట్లో, సహచరి శోభను, కుమారులు శ్రీనాథ్, రాధాకృష్ణులను, కుమార్తెలు లక్ష్మీ తులసీ, వాసంతి గార్లను కన్నీళ్లకు వదిలేసి, ప్రపంచానికి వినోదం పంచిన స్వర సమ్మోహనుడు వేణుమాధవ్ జూన్ 19, 2018న, సహస్ర చంద్రదర్శనం వయసుదాటి 86 సంవత్సరాలు ఈ భూమ్మీద జీవించి, ఐక్యరాజ్యసమితికి మిమిక్రీ ప్రోగ్రాంకు వెళ్లినట్టు స్వర్గానికి వెళ్లిపోయాడు. మళ్లీ మా జనధర్మ కార్యాలయానికి, వరంగల్లుకు, వాళ్లింటికి రాలేదు. ప్రపంచం ఒక స్వరమణిరత్నాన్ని కోల్పోయి, ఆయన స్వర స్వర్ణవైభవాన్ని దాచుకుంది. ఇంకా ఉంటే ఎంత బాగుండేది.

మాడభూషి శ్రీధర్

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ