ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్న ఈటీవీ విన్
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
ఈటీవీ విన్‌లో కొద్దికాలం క్రితం ప్రారంభమైన ‘కథా సుధ’ శీర్షిక ఒక మంచి ప్రయోగం. కొన్ని దశాబ్దుల క్రితం ఉషశ్రీ ఆధ్వర్యంలో ఆకాశవాణిలో ‘కథా మందారం’ శీర్షికన ప్రముఖుల కథలను చదివి వినిపించారు. ఆ తరవాత ‘వందేళ్ల కథకు వందనాలు’ అని కొంతమంది గొప్ప రచయితల కథలను అప్పటి హెచ్ ఎం టీ వీ సిఈవో కె. రామచంద్రమూర్తి.. ‘గొల్లపూడి మారుతీరావు’ ద్వారా ప్రసారం చేశారు. అవి ఒక ఒరవడి.
ఈ ‘కథా సుధ’ ఒక ఒరవడి.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ కథ సుధా కు ఆద్యులు. సుందరం గాడి ప్రేమ కథ, ప్రేమంటే ఇదే కదా, లవ్ యు నానమ్మ, తదితర కథలను ఆయన తీశారు.
షార్ట్ ఫిలిమ్స్ కు కొనసాగింపులా…
యూట్యూబ్ ప్రారంభమైన కొత్తలో షార్ట్ ఫిల్మ్స్ వచ్చేవి. ఎందరో ఔత్సాహిక యువ రచయితలు తమ ఆలోచనలను లఘు చిత్ర రూపంగా తీర్చిదిద్ది, తమలోని దర్శకుడిని, రచయితను బయటకు తీసి, యూ ట్యూబ్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. అటువంటివారిలో సుజీత్, రామ్ భీమన, తరుణ్ భాస్కర్, సుభాష్, ధీరజ్‌రాజ్, రాజ్ తరుణ్, చాందినీ… వంటి వారంతా వెండి తెర స్థాయికి ఎదిగారు. ఇదంతా చరిత్ర.

ప్రస్తుతంలోకి ప్రవేశిస్తే…
‘కథా సుధ’ అనే కొత్త కార్యక్రమం ద్వారా మరింతమంది కొత్త నటులు, రచయితలు, ఇతర సాంకేతిక వర్గం తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలకు ఈ టీవీ ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉంది. పాడుతా తీయగా, ఝుమ్మంది నాదం, స్వరాభిషేకం, తెలుగు వెలుగు, మార్గదర్శి.. వంటి విలక్షణమైన కార్యక్రమాలను కేవలం ఈటీవీ మాత్రమే ప్రసారం చేసింది. తెలుగులో ఎన్నో ఓటీటీలు వచ్చాయి. అవి ప్రసారం చేసే కార్యక్రమాలు పూర్తిగా వినోదాత్మకంగాను, వ్యాపారాత్మకంగాను ఉన్నాయి. కాని “కథా సుథ” వంటి కార్యక్రమం కొత్త కళాకారులను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ కథాసుధ లో వరా ముళ్లపూడి దర్శకత్వం వహించిన ‘మౌనమే నీ భాష’,

దేవరకొండ శ్రీకాంత్ స్వీయ రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వచ్చిన ‘లెక్కలు మాస్టారు’,

‘అమృతవల్లి’,

‘డియర్ డాడీ’,

‘కాలింగ్ బెల్’ కథలు,

అంజి సలాది దర్శకత్వంలో వచ్చిన రాకేష్ మహంకాళి రచన ‘డియర్ నాన్న’..

మొదలైన కథలను ఇందులో ప్రసారం చేశారు. ఈ కథలలో ఎమోషన్ సహా ఒక సందేశం ఉంటోంది. టీవీ తెరకు కట్టిపడేస్తోంది. ఇది చాలా చాలా మెచ్చుకోదగ్గ ప్రయత్నం. ‘పాడుతా తీయగా’లో పాడిన పిల్లలకు ఎలాగైతే ఒక బెస్ట్ సర్టిఫికేటో, అలాగే ఈ ‘కథా సుధ’ లో వచ్చిన కథలు ఆయా రచయితలకు, దర్శకులకు కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ఒక సర్టిఫికేట్ అయి తీరుతుంది.
చిన్న సూచన…
ఎందరో మహానుభావులు రచించిన ఉత్తమ స్థాయి కథలను ఈ తరానికి పరిచయం చేయడానికి అనువుగా అలనాటి కథలను కూడా పెద్దవారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈటీవీ విన్‌లో ప్రసారం చేస్తే, అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాగే కొన్ని నవలలలోని ప్రముఖ సన్నివేశాలను కూడా ప్రసారం చేయవచ్చు. గతంలో దూరదర్శన్‌లో కొన్ని కథలను ప్రసారం చేశారు. ఇప్పుడు ఈటీవీ విన్ వారు మరింత గట్టి ప్రయత్నం చేసి, మరిన్ని మంచి తెలుగు కథలను తెలుగువారికి పరిచయం చేస్తే తెలుగువారంత అదృష్టవంతులు మరొకరుండరు.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)

