చేజారిన ఆధిపత్యం, వారసత్వం

0
275

(Naveen Peddada, Rajahmundry)

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోట పులివెందుల బద్దలైంది. జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇది కేవలం ఒక స్థానిక గెలుపు కాదు, వైఎస్ కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా ఎదురులేని ఆధిపత్యం ఉన్న గడ్డపై తగిలిన గట్టి దెబ్బ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైన ప్రజా వ్యతిరేకత ఇంకా ఎంత బలంగా పాతుకుపోయిందో ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి.

పులివెందులలో టీడీపీ అభ్యర్థిని లతా రెడ్డి ఏకంగా 6,035 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆమెకు 6,716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కేవలం 683 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రెండు చోట్లా 77% నుంచి 86% వరకు భారీ పోలింగ్ నమోదైంది. మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా ఉన్నారో చెప్పడానికి ఈ పోలింగ్ శాతమే నిదర్శనం.

1978లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి తొలిసారి గెలిచిన నాటి నుంచి ఆ కుటుంబానికి పులివెందులలో ఓటమి లేదు. వారు నిలబెట్టిన వారే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైఎస్సార్, వై.ఎస్. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి 60 వేల నుంచి 90 వేల ఓట్ల భారీ మెజారిటీలతో గెలిచారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచినా, జగన్ పులివెందులలో 61 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ అభ్యర్థి ఓడిపోవడం అంటే వైఎస్ కుటుంబానికి రాజకీయ ముగింపు కాదు. కానీ, వారి వారసత్వం ఇకపై తిరుగులేనిది కాదని తేలిపోయింది.

వై.ఎస్. రాజారెడ్డి వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి పునాదులు వేశారు. ప్రజల సమస్యలు తీరుస్తూ, విద్యాలయాలు కట్టిస్తూ, వారికి అండగా నిలిచారు. వైఎస్సార్, జగన్ ఆ వారసత్వాన్ని కొనసాగించారు. అయితే, జగన్ తన పాలనలో ఆ పాత బంధాన్ని బలహీనపరిచారు. అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలే పాలనకు ప్రామాణికం అయ్యాయి. కానీ, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు వెనకబడ్డాయి. సంక్షేమాన్ని కూడా ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొన్ని చోట్ల ప్రతిపక్ష మద్దతుదారులను ఇబ్బంది పెట్టడం ప్రజల్లో భయాన్ని, ఆగ్రహాన్ని పెంచాయి. తన బాబాయి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు, సోదరి షర్మిల వ్యతిరేక ప్రచారం కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయి.

ప్రజలతో ఉన్న పాత సంబంధాన్ని జగన్ ఒక లావాదేవీగా మార్చారు. ఆ లావాదేవీలో బలవంతపు ధోరణి కనిపించడంతో, ప్రజలు తిరగబడ్డారు.

“బొంబులసీమ”గా పేరుపడ్డ చోట, ఎన్నికలు హింసాత్మక ఆధిపత్యానికి బదులు, ప్రజాస్వామ్య పోరాటానికి వేదికగా మారాయి. గత 30 ఏళ్లలో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఈసారి టీడీపీ దీన్ని “ప్రజాస్వామ్య పునరుద్ధరణ”గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇది ఫ్యాక్షనిజం అంతం కాకపోయినా, పోరాటం బాంబుల నుంచి బ్యాలెట్ బాక్సులకు మారిందని చెప్పవచ్చు.

ఈ ఫలితం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపింది. జగన్ అజేయుడనే భ్రమను పటాపంచలు చేసింది. “పులివెందుల పరాజయం” వల్ల జగన్ కు 40 శాతం ఓటర్లు ఇంకా మిగిలి లేరని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధమౌతుంది. జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ విషయం మరింత లోతుగా అర్ధం చేసుకుంటారు. మరోవైపు, టీడీపీకి ఈ విజయం భారీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు దూకుడు వ్యూహం ఫలించింది. కూటమి బలం సూక్ష్మస్థాయిలో కూడా పనిచేస్తుందని రుజువైంది.

175 లో ఒక్కటి కూడా వొదిలేది లేదు (వై నాట్ 175) అని అభిమానుల్లో కార్యకర్తల్లో మితిమీరిన నమ్మకం నింపిన జగన్ కూర్చున్న వున్న పులివెందుల కూడా కరిగి పోవడం కేవలం స్వయంకృతమే! చంద్రబాబుని జైలుకి పంపి ప్రభుత్వాన్నే ఆయనకు ఇచ్చేసారు. చంద్రబాబు బాబు కోట కుప్పం మునిసిపాలిటీలో వేళ్ళూ కాళ్ళూ పెట్టి

సొంత స్థానమైన పులివెందుల మీదే పట్టుతప్పిపోయారు.

(వ్యాస రచయిత ప్రముఖ పాత్రికేయుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here