ఆశల వెలుగుల దీపావళి
(డా. వైజయంతి పురాణపండ)
దీపావళి అమావాస్య వస్తోందంటే చంద్రుడు ముసుగు తన్ని ఎవ్వరికీ కనపడకుండా, చెవులకు శబ్దాలు కూడ వినిపించకుండా హాయిగా నిద్రపోతాడు. ఎవ్వరు నిద్ర లేపినా కిక్కురుమనడు. ఈ రోజు నన్ను ఎవ్వరూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేరు అనుకుని, చక్కని చుక్కలతో కాసేపు ముచ్చటలాడి, మబ్బుల దుప్పట్లో కాదు కాదు మేఘాల రగ్గులో గుర్రుపెట్టి పడుకుంటాడు. తాటాకు చప్పుళ్లకు బెదిరే కుందేలు అలసట తీరేలా చంద్రుడి ఒడిలో హాయిగా నిద్రపోతుంది.
పండుగ పూట ప్రజలంతా చీకట్లో ఉంటారన్న ఇంగితం కూడా లేకుండా చందమామ అలిగినవాడిలా నిద్రపోవడం దీపాలకు నచ్చలేదు. పోవయ్యా చందమామయ్యా! నువ్వు లేకపోతే మాకు కాంతులే ఉండవనుకుంటున్నావా. నీ అమృత కిరణాలు లేకపోతేనేం, నా దీపశిఖల మయూఖాలు మరింత వెలుగుతో ప్రకాశిస్తాయి’ అంటున్నాయి. చందమామకు ఇవేమీ పట్టనట్లుగా హాయిగా కుందేలు మీద చేయి వేసుకుని నిద్రిస్తున్నాడు.
నరకుడు సంబరంగా ఉన్నాడు. ఆహా మానవులంతా నా మాటలు వినకుండా నన్ను ఎదిరించారు. నన్ను వాళ్ల దేవుడిగా చూసుకుంటే… రాత్రి పగలు తేడా లేకుండా అగ్నిదేవుడి ఇంటింటా ఉండేలా నేనే శాసించేవాడిని కదా అనుకుంటున్నాడు.

అంతలోనే మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, తారాజువ్వలు, తాటాకు టపాకాయలు, సీమ టపాకాయలు, అగ్గిపెట్టెలు… అన్నీ సమావేశమయ్యాయి. అందరి ముఖాలూ దీనంగా ఉన్నాయి. అన్నీ తుస్సుమనే శబ్దాల్లాగానే డీలాపడిపోయాయి. ఒకరితో ఒకరు మాట్లాడటానికి సాహసించలేకపోతున్నారు. అందరూ గంభీరంగా కూర్చున్నారు. ఆకాశంలో ఎగిరే తారాజువ్వ తన కంఠం సవరించుకుని, ‘‘మిత్రులారా! దీపావళి పండుగ రాగానే ప్రతివారు, బాణాసంచాకి ఇంతింత డబ్బులు తగలేయడం ఎందుకు? అంటూ మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పండుగ అంటేనే ఇంటిల్లిపాదీ ఆనందంగా హాయిగా గడపడానికి అవకాశం కల్పించే రోజు అని అర్థం చేసుకోవాలి కదా. పండుగ పరమార్థమే ఇది. అంతేకాని చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పిండి వంటలు, కొత్త బట్టలు, బాణాసంచా అంటూ శక్తికి మించి ఖర్చు చేయమనడం కాదు’ అంది.
తారాజువ్వకు కొనసాగింపుగా చిచ్చుబుడ్డి నవ్వుల పువ్వులను ఆకాశమంత ఎత్తుకు ఎగరేస్తూ, మనం ప్రకృతికి అందం తీసుకువస్తాం కదా. మనం వెదజల్లే ఈ రంగురంగుల కాంతులను ప్రకృతి కూడా సృష్టించలేదు కదా. మరి మన ల్ని దూరం పెట్టమంటారు ఎందుకో’ అంది.
ఆ మాటలకు అడ్డుపడుతూ మతాబు, ‘అయ్యో! దోమలు, క్రిమికీటకాలను పోగొట్టడానికి నన్ను ఉపయోగిస్తారు కదా. అటువంటిది నా పొగ తగలగానే పిల్లలకు దగ్గు, ఉబ్బసం వచ్చేస్తాయంటూ ఎందుకో దుష్ప్రచారం చేస్తారు. అన్నీ తగు పాళ్లలో వేస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు కదా… అంటుంటే, భూచక్రం గిర్రున తిరుగుతూ… ‘చక్రాకారంలో ఉండే భూమి పేరుతో నన్ను భూచక్రం అని పిలుస్తారు. నేను తిరుగుతున్నప్పుడు అది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. భూమి ఆకారం ఇది అని ఈ పండుగలో పిల్లలకు తెలియచెప్పడానికే కదా నన్ను సృష్టించారు’ అంటూ తిరగడం ఆపింది.

గాలిలో సున్న ఆకారంలో సర్రుమంటూ తిరుగుతున్న విష్ణుచక్రం, ‘‘విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రంలా నేను తిరుగుతానని అందరికీ తెలియచేయడానికే ఇలా నాకు విష్ణుచక్రం అని పేరుపెట్టారు. మరి టపాసులు కాల్చుకోకపోతే, పిల్లలకు నా గురించి ఎలా తెలుస్తుంది’ అంటూ తిరగడం ఆగింది.
ఒక్కో టపాసు వచ్చి, మిరుమిట్లు గొలుపుతూ మాట్లాడసాగాయి.
అంతలో కంటనీరు పెట్టుకుని వంకాయ బాంబు, లక్ష్మీ బాంబు వచ్చాయి. అందరినీ ఉద్దేశించి ‘‘ఈ గొడవంతా మా వల్లే వచ్చింది. మమ్మల్ని డబుల్ సౌండ్, త్రిబుల్ సౌండు అంటూ మనిషి చెవి వినలేనంత పెద్ద పెద్ద శబ్దాలతో పేలుస్తున్నారు. పేల్చేవారి మాటేమో కాని, మాకు నిప్పు పెట్టగానే, మా గుండెలు అదిరిపోతున్నాయి. ఇక ముసలివాళ్లు, పసిపిల్లల మాట చెప్పాలా. పాపం జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ శబ్దం వినపడని ప్రాంతాలలో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’’ అన్నాయి.

గొంతు సవరించుకుంటూ అక్కడకు వచ్చిన దీపపు ప్రమిద, ‘‘దీపావళి పండుగ జరుపుకునేవారందరికీ నాదొక చిన్న విన్నపం. దీపావళి అంటేనే దీపాల వరుస అని అందరికీ తెలుసు. దీపాలు వెలిగించుకుని, ఇతరులకు హాని కలిగించని బాణసంచా కాల్చుకుని, మిఠాయిలు తిని పండుగను తియ్యగా ఆస్వాదించండి. చంద్రుడి లేని లోటుకు ఎవ్వరూ బాధపడకుండా, మీ ముఖాలను చిరునవ్వుల కాంతులతో నింపండి’’ అంటూ మిరుమిట్లు గొలుపుతూ, అందరికీ సాంత్వన కలిగించింది.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)


చాలా చక్కగా ఉంది మీ వ్యాసం. మంచి సమీక్ష దీపావళి పై చేసారు.