మన పక్కనే గుర్తించలేని బల్లేలుంటాయి
ఈనాడు – నేను: 41
(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఈనాడులో ఉద్యోగుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. కొందరి నైజాలు కొన్ని సందర్భాలలో బయటపడతాయి. కొందరివి బయటపడవు. ముఖ్యంగా సహోద్యోగులు అంటే మన పక్కనే ఉండేవారితో చాలా జాగ్రత్తగా మెలగాలి. ముందు నుంచి నాకు భేషజం లేదు బోళాతనం తప్ప. ఆ సమయంలో మనసుకు అనిపించింది నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆలా మాట్లాడ్డం వల్ల ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే ఆలోచనే వచ్చేది కాదు. కొంతమంది మాపట్ల సానుకూలంగా ఉంటారు. కొందరు యూనిట్ మేనేజర్ కు ఫిర్యాదు చేస్తారు. వీటిని వారు ప్రోత్సహిస్తారు కూడా. అలా నా గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఏమవుతుందనే ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు. పని చేసుకోవడం… బాధ కలిగితే ఎవరిని ఉద్దేశించి అయినా ఎంతమాటైనా అనేయడం… అంతే… అలా అనడానికి కారణాలూ ఉన్నాయి. అనేటప్పుడు ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందనే అంశం నా ఊహలో కూడా ఉండేది కాదు.
అప్రయత్నంగా నేను చేసే వ్యాఖ్యలు నాకు ఎలా చేటు చేశాయి అనేది కూడా నాకు తెలిసేది కాదు. చాలా కాలానికి అది ఎవరో చెబితే తెలిసేది. అలాంటిదే ఒక సంఘటన రాజమండ్రిలో ఉండగా జరిగింది. అది 1994 సంవత్సరం జులై నెల. ఆఫీసులో ఉండగా నా భార్య వైజయంతికి బాగోలేదని ఫోన్ వచ్చింది. పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చాను. కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ రాఘవ మూర్తి గారి దగ్గరకు తీసుకెళ్ళాను. ఆయన పరీక్షించి డాక్టర్ నూనె వెంకట్రావు గారి దగ్గరకు పంపారు. అక్కడ సెలైన్ పెట్టారు. వెంటనే సర్జరీ చేయాలన్నారు.

ఈ విషయం తెలిసి తాను విజయవాడ వెళ్ళిపోయి, అక్కడ డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారితో సర్జరీ చేయించుకుంటానని చెప్పింది. ఇక్కడే డాక్టర్ వెంకట్రావు గారు తన మాటలతో భయపెట్టారు. ఇది అపెండిసైటిస్ నొప్పి. వెంటనే సర్జరీ చెయ్యాలి. ఒకవేళ మీరు విజయవాడ వెడతానంటే తనకు ఆ మేరకు లెటర్ రాసి ఇవ్వాలని అడిగారు. మధ్యలో ఏమైనా అయితే తనకు సంబంధం లేదన్నారు. ఒకపక్క మా అబ్బాయి రెండేళ్ల వయసు. మరోపక్క… డాక్టర్ భయపెట్టే మాటలు.
దిక్కు తోచని స్థితిలో సర్జరీకి వైజయంతి సరేనంది. సర్జరీ మధ్యలో డాక్టర్ నన్ను లోపలి పిలిచారు. నాకు భయం. నేను వెళ్ళలేదు. మా నాన్నగారు రమణమూర్తి గారు వెళ్లారు. పేగులు చూడండి… అతుక్కుని ఉన్నాయి. తెల్లటి మచ్చలు ఉన్నాయి. ఇది అపెండిసైటిస్ కాదు. ఈమెకి ఇంటస్టినల్ ట్యూబెర్క్యూలోసిస్ ఉంది. పేగులు లోపల పెట్టేసి కుట్టేస్తాను అని చెప్పి, సర్జరీ ముగించారు. అక్కడి నుంచి వైజయంతిని రూంలోకి మార్చడానికి నానా పాట్లు పడాల్సి వచ్చింది. కారణం ఆ ఆస్పత్రిలో స్ట్రెచర్ కూడా లేకపోవడం. మొత్తం ఆరుగురు సాయం పట్టాల్సి వచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో ఉన్న తరవాత బతుకు జీవుడా అంటూ ఇంటికి చేరాం. ఆయన రాసిన టి.బి. మందులు వాడటం ప్రారంభించాం. ఏడాది వాడాలి అన్నారు.
ఇదిలా ఉంటే, చూడడానికి వచ్చిన బంధువులు తిట్టిపోశారు. ఇదేమి ఆస్పత్రి… ఇదేమి డాక్టరు అంటూ..
ఇదొక అంశమైతే… ఈనాడులో దీనికి సంబంధించి మరో కోణం. ఎవరో ఒక నా సహోద్యోగి మేనేజరుకు ఫిర్యాదు చేసాడట…. నేను ఈనాడు పేరు ఉపయోగించుకుని అక్కడ ఉచితంగా సర్జరీ, వైద్యం చేయించానని. ఇది నాకు వెంటనే తెలియలేదు. కొన్ని నెలల తరవాత మేనేజర్ నన్ను తన గదిలోకి పిలిచారు. ఆయన దగ్గర ఉన్న బాయ్ విజయకుమార్. నేను లోపలి వెళ్ళగానే.. బయట నుంచి లాక్ పెట్టేశాడు. నాకు అర్ధం కాలేదు.. అలా ఎందుకు చేశాడో. కుశల ప్రశ్నలు అయ్యాక… మేనేజర్ నన్నొక ప్రశ్న వేశారు.
మీరు మీ భార్యకు వైద్యం చేయించిన ఆస్పత్రిలోనే ఒక నక్సలైట్ నాయకుడు కూడా ఉన్నారట కదా?
నాకు తెలియదండీ…. నా సమాధానం
మీకు తెలుసు.. తెలిసి కూడా చెప్పలేదు. అందుకే మీ వైఫ్ కి అక్కడ ఉచితంగా వైద్యం చేశారు.. ఇది మేనేజర్ అభియోగం.
నేను ఆశ్చర్యపోయాను. భార్య ఆరోగ్యం బాగోలేక నేను ఆందోళన చెందుతుంటే… ఆ ఆస్పత్రిలో ఎవరున్నారో తెలుసుకునే ఆసక్తి నాకు ఎందుకుంటుంది… ఇది నేను వేసిన ఎదురు ప్రశ్న.
“నిజమే… కానీ నా దగ్గర అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి” అంటూ మరోసారి నన్ను బెదిరింపు ధోరణిలో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఆ మేనేజర్.

నేను బెదిరిపోలేదు. జరిగింది అంతా చెబుతూండగా ఆస్పత్రి పేరు మరోసారి చెప్పాను. మరోసారి ఆస్పత్రి పేరు చెప్పండి… అన్నపూర్ణ ఆస్పత్రి.
మేనేజర్ ఏమనుకున్నారో ఏమో… ఒక్కసారి ఉండండి.. అంటూ ఇంటర్ కం లో ఎవరికో ఫోన్ చేశారు. రెండు నిముషాలు మాట్లాడారు. ఒక పది నిముషాల తరవాత నా రూముకు రండి అని చెప్పి పెట్టేశారు.
మీరు మీ భార్యను చేర్పించింది చైతన్య ఆస్పత్రి కాదా? అనుమానంతో కూడిన మొహం పెట్టి అడిగారు మళ్ళీ… కాదు. కావాలంటే ఆ ఆస్పత్రి రెసెప్షనిస్టును పిలిపిస్తాను. డాక్టర్ నెంబర్ ఇస్తాను. మాట్లాడండి. డబ్బులు కట్టినట్టు ఉన్న బిల్లులు కూడా చూపిస్తాను అన్నాను.
ఓకే.. ఓకే.. మీరు ఆవేశపడకండి. ఏదో మిస్ కమ్యూనికేషన్. ఎక్కడో పొరపాటు జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోండని సలహా ఇచ్చి నన్ను పంపేశారు ఆ మేనేజర్.
మేనేజర్ రూమ్ నుంచి బయటకు వచ్చాను కానీ… మనసు మనసులో లేదు. ఎప్పుడూ ఇలాంటి నింద లేదు. వార్తలు మిస్సవ్వడం… తప్పులు చెయ్యడం తప్ప… సంస్థకు చెడ్డపేరు తెచ్చే పని ఎప్పుడూ చేయలేదు. వాస్తవానికి నేను ఈనాడులో పని చేస్తున్నాననే విషయం చాలా కొద్దిమందికే చెప్పేవాడిని.. ఈనాడు పధ్ధతి తెలిసున్నవాడిని కాబట్టి.
కింద ఫ్లోర్ లో ఉన్న మా డెస్కుకు వచ్చి కూర్చున్నాను గానీ… అవమానం దహించివేస్తోంది. ఎందుకు నన్ను ఇలా ప్రశ్నించారు. నిజంగా నేను తప్పు చేశానా అని మథనపడ్డాను. ఈలోగా నాకు మేనేజర్ చేసిన ఫోన్ గుర్తుకొచ్చింది. పది నిముషాల్లో తన రూముకు రమ్మని ఎవరికో ఫోన్ చేశారు ఆయన. ఎవరు ఆయన దగ్గరకు వెడతారా అని ఆసక్తిగా కాదు కోపంగా గమనించసాగాను. ఒకళ్ళు కాదు ఇద్దరు వెళ్లారు మేనేజర్ దగ్గరకి. కచ్చితంగా ఈ ఇద్దరిలోనే ఒకరు చెప్పి ఉంటారు. అదెవరో నాకు తెలియకుండా ఇద్దర్ని పైకి రమ్మని ఉంటారని భావించాను.
మరుసటి రోజు మరొకసారి మేనేజర్ నుంచి పిలుపు… ఇది ఊహించే నేను మరుసటి రోజు ఆస్పత్రి బిల్స్, ప్రిస్క్రిప్షన్ ఆఫీసుకి పట్టుకెళ్ళాను. వాటితోనే రూముకు వెళ్ళాను. కానీ, అక్కడి సీన్ వేరేలా ఉంది. నవ్వుతూ పిలిచారు. కాఫీ తెప్పించారు.
ఈలోగా మేనేజర్ మొదలు పెట్టారు. మనం ఎక్కడున్నా… ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా… మనం ఈనాడు సంస్థని మరిచిపోకూడదు. ప్రతి అంశంలోనూ… ప్రతి క్షణంలోనూ ఈనాడుకు ఏమి చెయ్యగలమనే ఆలోచించాలి అంటూ కొద్దిసేపు ఆగారు. ఒక ప్రముఖ నక్సలైట్ నాయకుడు నిన్న నేను చెప్పిన ఆస్పత్రిలో చికిత్సకు చేరాడు. అక్కడే ఆయన వారం రోజులు ఉన్నారు. మీరు కూడా ఆ పక్క ఆస్పత్రిలోనే ఉన్నారు. అంతకాలం ఉన్నా ఇది మీరు గమనించలేదు. నాకు తెలిసున్నవారు ఈ విషయాన్ని చెప్పారు. మీరు కూడా అదే ఆస్పత్రిలో ఉన్నారని… అందుకే మీ దగ్గర బిల్లు వసూలు చెయ్యలేదని కూడా చెప్పారు అన్నారు మేనేజర్…
ఈ క్షణం కోసమే చూస్తున్న నేను వెంటనే డబ్బులు కట్టిన బిల్లులు, ప్రిస్క్రిప్షన్ ఆయన టేబుల్ మీదకు విసిరాను. చూడండి. మీరు చెప్పిన ఆస్పత్రి … ఇదీ ఒకటేనేమో అంటూ కొద్దిగా గట్టిగానే చెప్పాను. వెంటనే ఆయన… “అది చెప్పడానికేగా ఇంత ఉపోద్ఘాతమునూ” అంటూ “మీరేమీ తప్పు చెయ్యలేదు. మిమ్మల్ని ప్రశ్నించినందుకు బాధపడుతున్నాను” అంటూ ముగించారు. అలాగే…ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడున్నా… ఏ పరిస్థితిలో ఉన్నా సంస్థ గురించి ఆలోచించడం కూడా విధి అని గుర్తుపెట్టుకోండని ముక్తాయించారు.
ఇలా ఉంటుంది… ఈనాడు కత్తికి రెండు వైపులా పదును. తప్పయితే ఒకలా… లేకుంటే మరోలా సలహా లేదా శిక్ష తప్పవు. నా మీద ఆరోపణ చేసిన ఉద్యోగి ఎవరో నాకు తెలిసినప్పటికీ, ఇప్పటికీ నేను అతన్ని ఆ విషయం అడగలేదు. అతను చెప్పను కూడా లేదు. ఈనాడులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ పక్కలో ఇలాంటి బల్లెం ఉంటూనే ఉంటుంది. వీటికి స్థాయి భేదాలు ఉండవు.

కొద్దిమాసాల తరవాత, మందుల కోర్స్ పూర్తైన మరుసటి రోజు నుంచి వైజయంతి మళ్ళీ కడుపునొప్పి మొదలైంది. మందుల కారణంగా విపరీతంగా బరువు పెరిగింది. ఇదంతా చూసి మా వదిన గారు డాక్టర్ గాయత్రీ దేవి, చెన్నైలో ఉన్న డాక్టర్ కె.వి. తిరువేంగడం గారి దగ్గర చూపించారు. ఆయన కేసు అంతా విని… పొట్ట మీద చెయ్యి వేశారు. దిస్ ఈజ్ నాట్ టిబి స్టమక్ అన్నారు. టిబి ఉన్న స్టమక్ అయితే… పాల ప్యాకెట్ ను ముట్టుకున్న ఫీల్ కలుగుతుందని చెప్పారు. బేరియం మీల్ టెస్ట్ చేయించి… ఎటువంటి రుగ్మత లేదని… కేవలం అమీబియాసిస్ కారణంగానే నొప్పి వస్తోందని తేల్చారు. డైజిన్ సిరప్, యూనిఎంజైమ్ టాబ్లెట్స్ రాసి పంపారు.
రాజమండ్రి వచ్చిన తరవాత డాక్టర్ వెంకట్రావు గారి దగ్గరకు వెళ్లి, ప్రశ్నించాను. అనవసరమైన సర్జరీ చేశారని, ఆరోగ్యం పాడు చేశారని ఆవేశపడి మరో నాలుగు మాటలు అని వచ్చేశాను. ఆ డాక్టరుపై ఐ.ఎం.ఏ.కి కంప్లైంట్ చేయాలనీ కూడా ప్రయత్నించినప్పటికీ… ఆయన డిశ్చార్జ్ నోట్ ఇవ్వకపోవడం వల్ల సాధ్యం కాలేదు.
వచ్చే ఎపిసోడ్ లో మరొక ఆసక్తికరమైన అంశం రాస్తాను.