రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించండి
రుణ నిధుల మంజూరులో జాప్యం వద్దు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, జూన్ 16: మెట్రో ఫేజ్–2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్–2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు ₹38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు ఇచ్చింది.
ఫేజ్–1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్–2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందని సీఎం ఈ లేఖలో వివరించారు. మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్‌లో నడిచేందుకు వీలుగా ఫేజ్–1ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఫేజ్–1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ. 13,538.53 కోట్లు కలిపి మొత్తం ₹15,000 కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్ చేసిందని గుర్తుచేశారు.
ఐఆర్‌ఎఫ్‌సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్‌కు అంగీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ₹84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించింది. ఈక్విటీ ₹1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసింది.
ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక, 2026 జూన్ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్–2ను కేంద్రం–రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం ఈ లేఖలో వివరించారు.
ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్–2ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కిషన్‌రెడ్డిని కోరారు. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో తాను అధికారులతో కలిసి ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

