ప్రాజెక్టులు, రవాణా వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలి
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయండి
- పార్టీలకు అతీతంగా అవసరమైన సమాచారం అందజేస్తాం
- ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జులై 13: తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు మహాత్మాజ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో ఉందని, అయితే ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని… ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPSని కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు.
మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని సీఎం తెలిపారు. ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు.

అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను సీఎం ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావల్సి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. డ్యామ్‌తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని సీఆర్ పాటిల్‌ను కోరామని, ఈ విషయంపైనా ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సీఎం సూచించారు.
నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 300 టీఎంసీల వాటా ఉందని, వాటిని ఛత్తీస్‌గఢ్ వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు. గోదావరి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు నీరు తీసుకెళ్లే గోదావరి-కావేరి అనుసంధానం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్‌గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని… ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని సీఎం అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి
తెలిపారు. ఈ విషయంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చర్చించామన్నారు. వారు సూత్రప్రాయంగా
అంగీకరించారని, ఎన్‌వోసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం అన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఎలైన్‌మెంట్లు కొలిక్కివచ్చాయని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామని సీఎం తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్), ఎయిర్ కార్గోలు ఏర్పాటుచేయాలని కోరుతున్నామని.. ఈవిషయంపైనా ఎంపీలు దృష్టిసారించాలని సీఎం కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియమించామని సీఎం చెప్పారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నాఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగే సమాచారం వేగంగా వారికి అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సీఎం సూచించారు.
సమావేశంలో ఎంపీలు అడిగిన ప్రతి సమాచారం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా తాము కేంద్ర ప్రభుత్వంతో సహకార ధోరణితోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేసి పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్ మిల్లు పునరుద్ధరణపై ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులను ప్రశ్నించారు. 7-8 నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటుచేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం లేదని, స్టోరేజీ సమస్య ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ విషయాలు తెలియజేస్తే సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని.. ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, ఈటల రాజేందర్, కడియం కావ్య, రామసహాయం రఘురామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామల కిరణ్ కిమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

