నెహ్రూ పై బాబు వ్యాఖ్యానం: చరిత్ర VS రాజకీయాలు

0
172

(నవీన్ పెద్దాడ)
ఆధునిక భారత రాజకీయాల్లో గతం ఒక శక్తివంతమైన ఆయుధం. వర్తమాన భావజాల యుద్ధాలకు దీన్ని వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు ఒక “ఆయుధం” ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇది కేవలం చారిత్రక విమర్శ కాదు. భారతదేశ వ్యవస్థాపక సిద్ధాంతాలపై జరుగుతున్న విస్తృత రాజకీయ పోరాటంలో ఒక భాగం. చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను, రాజకీయ ప్రయోజనాలను పరిశీలీలిండమే ఈ విశ్లేషణ ఉద్దేశం.

నెహ్రూ ఒక “భూస్వామి” అని, ఆయన సోషలిస్టు విధానాల వల్లే దేశం వెనకబడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. నెహ్రూ సంపన్న కుటుంబంలో పుట్టింది నిజమే. కానీ, దాన్నిబట్టి ఆయన విధానాలను తప్పుబట్టడం సరికాదు. 1920ల నుంచే రైతుల సమస్యలు నెహ్రూను ప్రభావితం చేశాయి. సోవియట్ యూనియన్ పర్యటన, ఫాసిజంపై వ్యతిరేకత ఆయన సోషలిస్టు భావజాలాన్ని బలోపేతం చేశాయి. నెహ్రూ వ్యక్తిగత నేపథ్యాన్ని అడ్డం పెట్టుకుని, ఆయన విధానాలను బలహీనపరిచే ప్రయత్నం ఇది.

1947 తర్వాత భారతదేశ ప్రగతిని సింగపూర్‌తో పోల్చడం చంద్రబాబు వ్యూహంలో భాగం. కానీ, ఇది చారిత్రకంగా అసంబద్ధం. సింగపూర్ ఒక చిన్న నగర-రాజ్యం. భారతదేశం ఒక ఉపఖండం. 1947లో దేశ విభజన, శరణార్థుల సంక్షోభం, 500 పైగా సంస్థానాల విలీనం వంటి పెనుసవాళ్లను భారత్ ఎదుర్కొంది. పరిమాణం, జనాభా, రాజకీయ వ్యవస్థ, సవాళ్ల పరంగా రెండింటికీ పోలికే లేదు. సింగపూర్ మోడల్‌ను చూపించి, నెహ్రూ ప్రభుత్వ-రంగ విధానాలను తప్పుబడుతూ, తన నయా-ఉదారవాద ఆర్థిక ఎజెండాను ప్రచారం చేసుకోవడం చంద్రబాబు ఉద్దేశం.

1991 సంస్కరణల వరకు దేశం స్తంభించిపోయిందని చంద్రబాబు అన్నారు. ఈ కాలంలో వృద్ధిరేటు నెమ్మదిగా ఉన్న మాట వాస్తవమే. కానీ, “స్తబ్దత” అనడం సరికాదు. ఇదే కాలంలో భారీ పరిశ్రమలు, ఐఐటీలు, భాక్రానంగల్ వంటి ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. ఈ పునాదుల మీదే 1991 తర్వాతి ఆర్థిక ప్రగతి సాధ్యమైంది.

చంద్రబాబు విమర్శలు 1947 నాటి భయానక పరిస్థితులను పూర్తిగా పక్కనపెట్టేశాయి. దేశ విభజన మారణహోమం, కోట్లాది శరణార్థులు, కశ్మీర్ వంటి సంస్థానాల విలీన సమస్యలు దేశ మనుగడకే సవాలు విసిరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అక్షరాస్యత కేవలం 12%, సగటు ఆయుర్దాయం 32 ఏళ్లు. ప్రైవేటు రంగం భారీ పరిశ్రమలు పెట్టే స్థితిలో లేదు. అందుకే ప్రభుత్వం రంగంలోకి దిగడం అనివార్యమైంది.

చంద్రబాబు విమర్శలు యాదృచ్ఛికం కాదు. వాటి వెనుక స్పష్టమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి.• బీజేపీతో సఖ్యత: నెహ్రూ వారసత్వంపై బీజేపీ ఎప్పటినుంచో విమర్శలు చేస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు, ఆ కూటమి వాదనను బలపరుస్తున్నారు.

సొంత బ్రాండ్: తనను తాను మార్కెట్ అనుకూల, సంస్కరణవాద “CEO ముఖ్యమంత్రి”గా నిలబెట్టుకుంటున్నారు. నెహ్రూ ప్రభుత్వ-కేంద్రీకృత విధానాలను విమర్శించడం ద్వారా తన బ్రాండ్‌ను బలోపేతం చేసుకుంటున్నారు.

ప్రతిపక్షంపై దాడి: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలను దెబ్బతీయడం ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షాన్ని బలహీనపరిచే వ్యూహం ఇది.

నెహ్రూ ఆర్థిక నమూనాలో లోపాలు వుంటే చర్చ జరగాలి. అయితే, చంద్రబాబు విమర్శ చారిత్రక విశ్లేషణలా లేదు. అది సమకాలీన రాజకీయ అవసరాల కోసం గతాన్ని వాడుకోవడం మాత్రమే.

1947 నాటి సవాళ్లను, చారిత్రక సందర్భాన్ని విస్మరించి చేసే ఏ విమర్శ అయినా అసంపూర్ణమే. ఈ వ్యాఖ్యలు 20వ శతాబ్దపు ఆర్థిక వాస్తవాల కన్నా, నేటి రాజకీయ సమీకరణాల గురించే ఎక్కువ చెబుతున్నాయి.


(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here