ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించగలరా?

0
63

ఆయన నన్ను అడ్డుకునేంత శక్తిమంతుడు కాదు
రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
కూటమి సమావేశానికి కారణం ఉంది..
ప్రధానిగా మోడీ రికార్డు
న్యూ ఢిల్లీ, జూన్ 09:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా అనేక రకాల అబద్ధాలతో అసత్యపు వార్తలతో విమర్శిస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా లేనిపోని మాటలు అంటున్నారు. తొక్కుకుంటూ వచ్చాను, పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని చెప్పారు.


చాలామంది సీఎంలను చూశాను…
తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, వాళ్ల ఇళ్ల ముందే ఘెరావ్ చేశాననీ వివరించారు. ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ వరకు వచ్చానన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం కార్యకర్తల ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీకి వచ్చానని చెప్పారు కిషన్ రెడ్డి. తనను అడ్డుకునే ధైర్యం, శక్తి రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. అకారణంగా, అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన వీధిరౌడీలా ఉందన్నారు. బట్టకాల్చి మొహం మీద వేస్తున్నారని, వీటిని తెలంగాణ సమాజం గమనించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారెంటీలను అమలుచేయకుండా, ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించే revanth ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు తానే సీఎంనని చెప్పుకుంటూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అభద్రత, అహంకారంతో నిరాశ నిస్పృహలతో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


సంస్కారహీనంగా వ్యవహార శైలి…
రేవంత్ రెడ్డి, లేదా రాహుల్ గాంధి దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో తాము అధికారంలో లేమని గమనించాలన్నారు. 12 ఏళ్లుగా దేశ ప్రజల ఆశీస్సులతో మోదీ పరిపాలిస్తున్నారన్నారు. తానూ తెలంగాణ ప్రజలకు జవాబుదారును కానీ, రేవంత్ రెడ్డికి కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకోసం తానెలా పనిచేస్తున్నానో అందరికీ తెలుసన్నారు. తనకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని ఎద్దేవా చేశారు.
తానూ ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో చెప్పాలని ఆయన సీఎంకు సవాలు చేశారు. ఇందుకోసం సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నది జర్నలిస్టులకు చెప్పమని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని వెల్లడించారు. సీఎం తన దగ్గరున్న సాక్ష్యాలను జర్నలిస్టులకు ఇవ్వాలని సూచించారు.
పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కానన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నాననే సోయి మరిచిపోయి తెలంగాణ రాజకీయాల్లో ఏరకంగా అవినీతి, అక్రమాలకు, దోపిడీకి పాల్పడుతున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం చర్యలకు తెలంగాణ బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారని, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీ దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణాలో నెలకొందని, అప్పులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా అమ్మేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీచ రాజకీయాలు చేయడం తనకు రాదనీ చెప్పారు. రేవంత్ మాదిరిగా చిల్లర రాజకీయాలు చేతకాదన్నారు. ప్యాంటుల్లో తొండలు వదిలే అలవాటు, కళ్లు పీకి గోళీలు ఆడే అలవాటు తనకు లేదన్నారు. తాను రేవంత్ లాగా మాటకారిని కాకపోవచ్చు కానీ మాటమీద నిలబడే వ్యక్తినని స్పష్టం చేశారు. అధికారం కోసం పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని సుస్పష్టం చేశారు.


మీ హామీలపై చర్చకు సిద్ధమా?
గత రెండున్నర సంవత్సరాలుగా.. ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధమా? అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు ప్రభుత్వాల వ్యవహారశైలి ఒక్కటే, దోచుకోవడం, ప్రజలను వంచించడమని పేర్కొన్నారు.
తెలంగాణాలో ఏ రంగంలో మార్పు వచ్చింది…?
రెండేళ్లలో తెలంగాణ అంతా బాగైపోయిందన్నట్లుగా రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకంలో, అవినీతిలో, అక్రమాల్లో, అబద్ధపు ప్రచారంలో.. ఇద్దరిదీ ఒకేరకమైన పాలన. రెండు పార్టీలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బలిపెడుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సీఎం ఇలా వ్యక్తిగతంగా.. మాట్లాడుతున్న తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మోడీకి శుభాకాంక్షలు…
నరేంద్రమోదీ ప్రధానిగా అత్యధిక సమయం పరిపాలించిన వ్యక్తిగా చరిత్ర తిరగరాయబోతున్నారని చెప్పారు. 4,398 రోజులు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. ఇవాళ పోటీ రాజకీయాల్లో మోదీ 4,399 రోజులు రేపటికి ఎలక్టెడ్ ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్నారని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పనిచేస్తుందని మనవి చేస్తున్నట్లు చెప్పారు.


ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మీద, తన మీద, పార్టీ నాయకుల మీద రేవంత్ విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.
మెట్రో ఫేజ్ 2 విషయంలో.. L&T విలీనం కోసం కూడా కేంద్ర ప్రభుత్వమే రుణం ఇప్పించిందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా దీనికి ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆఖరి గింజ వరకు కూడా రాష్ట్రప్రభుత్వం తరపున కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ కొంటున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో ఒక్క కేజీ దొడ్డు బియ్యం వాడకున్నా, కేంద్రం 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు ముందుకొచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు కూడా వాళ్ల దగ్గరే అవసరమైనంత వరి పండించుకుంటున్నాయని చెప్పారు. గోడౌన్లు ఖాళీ లేకున్నా.. కేంద్రం వారి కొనుగోలు చేస్తోందని చెప్పారు. కేంద్రప్రభుత్వంతో కలిసి కుదుర్చుకున్న టార్గెట్లను చేరుకోవడంలో వైఫల్యం ఎవరిదని నిలదీశారు. అమాయకులైన పేద రైతులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రేవంత్ గాలిమాటలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబడేందుకు అవసరమైన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందనీ, కేంద్రాలు, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిసి ఈ దిశగా పనిచేయాలని సూచించారు. అన్ని రకాల వ్యవస్థలు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది కేంద్రం ఆలోచనని తెలిపారు.
ఎన్డీయే కూటమి సమావేశం ఏర్పాటుకు కారణం ఉందన్నారు. దేశంలో అత్యధిక సమయం ఎలక్టెడ్ పీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా.. ప్రధానిని అభినందిస్తూ.. భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అక్కడి అధికారులను పిలిపించి పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుందని చెప్పారు.

మామునూరు విమానాశ్రయం విషయంలో.. భూసేకరణలో కాస్త ఆలస్యమవుతోందని, సమస్యలను అధిగమించి త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని కిషన్ రెడ్డి ప్రకటించారు. పేద ప్రజల పొట్టగొట్టడం, వారికి ఇబ్బందిపెట్టడమే ఆయన ఆలోచన అయితే.. దాన్ని హిట్లర్ లాగా తను తాను పోల్చుకోవడాన్ని రేవంత్ రెడ్డి విచక్షణకే వదిలేస్తున్నానని కిషన్ రెడ్డి చురక వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here