ప్రకటించిన సి.బి.ఐ. మాజీ జె.డి.
విజయవాడ, డిసెంబర్ 22 : చేసిన ఉద్యోగ హోదానే ఇంటి పేరుగా చేసుకున్న ఘనత పొందిన వి.వి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నారు. పార్టీ పేరు జై భారత్. సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించిన ఆయన ఇప్పుడు తన దారిని ఎంచుకున్నారు. ఇంతవరకూ ఆ పార్టీలో చేరుతున్నారు… ఈ పార్టీలో చేరుతున్నారు అంటూ అనేక వదంతులు రావడం… వాటిని ఆయన ఖండించడం జరుగుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికలలో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసిన ఆయన తాజాగా సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. విజయవాడలోని రమేష్ హాస్పిటల్ రోడ్డులో ఉన్న ఎగ్జిక్యూటివ్ క్లబ్బులో జె.డి. లక్ష్మీనారాయణ ఈ విషయాన్ని ప్రకటించారు.
1965 ఏప్రిల్ 3 న కడప జిల్లాలో జన్మించిన జె.డి. 1990 నుంచి 2018 వరకూ ఐ.పి.ఎస్. విధులను నిర్వర్తించారు. జనసేన పార్టీలో చేరి 2019 లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. సర్వీస్ తొలి రోజుల్లో నాందేడ్ ఎస్.పి.గా పనిచేశారు.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్లో విధులు నిర్వర్తించారు. 2006 జూన్ లో హైదరాబాద్ లో డి.ఐ.జి.గా నియమితులయ్యారు. అదే సమయంలో సత్యం కుంభకోణాన్ని ఆయన విజయవంతంగా ఛేదించారు. తరవాత ప్రస్తుత ఎపి సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును విచారించారు. ఈ కేసుతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
వరంగల్ ఎన్.ఐ.టి.లో మెకానికల్ ఇంజినీరింగులో బాచిలర్స్ డిగ్రీ చేశారు. మద్రాస్ ఐ.ఐ.టి.లో ఎం.టెక్ చేశారు.
2006 లో ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. మహారాష్ట్ర మైనారిటీ కమిషన్ ఆయనకు మహాత్మా గాంధీ శాంతి బహుమతి ప్రదానం చేసింది. 2017 లో ఇండియన్ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు.
2018 లో సర్వీసునుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అదే ఏడాది జనసేన పార్టీలో చేరారు. వివిధ కారణాలతో 2020 లోనే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటించారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువతరంలో స్ఫూర్తి నింపడం లక్ష్యాలుగా ఆయన జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనే సంస్థను నెలకొల్పారు. ఎరువులు వినియోగించకుండా జీవ రసాయనాలను ఉపయోగిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. చెప్పే ముందు ఆచరించి చూపడం లక్ష్మీనారాయణ మనస్తత్వం. స్వచ్చందంగా మద్యపానాన్ని బహిష్కరించిన మహబూబ్ నగర్లో చిన్నమందాడి, శ్రీకాకుళం జిల్లాలో సహలాలపుట్టుగా, విజయనగరం జిల్లాలో సీతారాంపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు.