ప్రకటించిన రాజ్యసభ సెక్రటరీ జనరల్
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 09 : భారత ఉపరాష్ట్రపతిగా ఎన్.డి.ఏ. అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. 452 ఓట్ల తేడాతో ఆయన ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ విషయాన్ని రాధాకృష్ణన్ ఎన్నికైనట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీ ప్రకటించారు. గడిచిన రాజ్యసమావేశాల మధ్యలో జులై 21 న అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అవసరమైంది.

తొలివోటు మోడీ
మంగళవారం నిర్వహించిన పోలింగులో తొలివోటు ప్రధాని నరేంద్ర మోడీ వేశారు. మొత్తం 781 మందికి 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. బి.ఆర్.ఎస్. బి.జెడి. శిరోమణి అకాలీదళ్ ఎంపీలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. రెండు కూటములు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని నిర్వహించాయి.

రెండు సార్లు ఎంపీగా….
రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు. ఎంతో కాలంగా రాజకీయాలలో ఉన్నారు. తమిళనాడు బిజెపి అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు పార్లమెంటుకు బి.జె.పి. తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగు దేశం, జనసేన, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, జె.డి.(యూ), ఐఏడీఎంకే, ఎన్.సి.పి, శివ సేన, తదితర పార్టీలు బలపరిచాయి.

దేశ మొదటి ఉప రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలందించారు. జాకిర్ హుస్సేన్, వివి గిరి, గోపాల స్వరూప్ పాఠక్, బి.డి. జెట్టి, ఎం. హిదయతుల్లా, ఆర్. వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్, కృష్ణకాంత్, భైరాన్సింగ్ షెకావత్, మహమ్మద్ హమీద్ అన్సారీ, ఎం. వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కడ్ ఇప్పటివరకూ ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు.

శుభాకాంక్షలు చెప్పిన సుదర్శన్ రెడ్డి
రాధాకృష్ణన్ కు సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై తనకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు. ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించిందన్నారు. తనను అభ్యర్ధిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

