(రంగనాయకమ్మ)
రోజూ తెల్లవారేటప్పటికి వచ్చిపడే ఏ పత్రిక తీసినా, ఎవరి జన్మదినానికో శుభాకాంక్షలు తెగ ఆడంబరంగా కనపడతాయి. స్వంత జన్మదినాలూ, ఆ ఫంక్షన్లూ, పాటించని వాళ్ళు కూడా పత్రికల్లో జన్మదినాల్ని చూసి సంతోషపడతారో, ‘మనకి కూడా ఇలా జరిగితే బాగుండును’ అను కుంటారో! నిజానికి జన్మదినం అనేది, ఏంచెపుతుంది? ‘ఈ మానవుడి జీవించేకాలంలో ఒక సంవత్సరం ముగిసి పోయింది సుమా!’ అని చెపుతుంది. జీవించే కాలానికి ‘ఆయుష్షు’ అనే కొలతలేవీ వుండక పోయినా, సహజంగా బ్రతికే కాలం ఎంతో కొంత వుంటుంది. మరణం అనేది 100 సంవత్సరాల తర్వాతైనా తప్పేది కాదు. ఆ లోగా జరిగే జన్మ దినాలు ప్రతీ సారీ చెపుతాయి, ‘నీ జీవిత కాలంలో ఒక ఏడాది గడిచి పోయిందిలే. మరణం వేపు పోతున్నావు. అది తెలుసుకో!’ అని. పైగా, ఒకరికి ఒక సంవత్సరం గడిస్తే, అతన్ని అభినందించే మిగతా అందరికీ కూడా ఆ సంవత్సరం రోజులు గడిచినట్టే. వాళ్ళు కూడా మరణానికి దగ్గిరవుతున్నట్టే.

నిజానికి జన్మదినం, వయసుని చెప్పే ఒక లెక్క మాత్రమే. ఆ దినం ఫంక్షన్ల, ముచ్చట్ల దినం అయితే, దాన్ని ఏడాదికి ఒక సారేనా, ప్రతి రోజూ ‘పుట్టాను, పుట్టాను, పుట్టేశాను’ అంటూ జరుపుకోవాలి.

జన్మదినం, నిన్నటి దినం లాంటిదే! రేపటి దినం లాంటిదే!
(ఈరోజు రంగనాయకమ్మ 86 వ జన్మదినం)

