శతాబ్ది గాయకుడు ఘంటసాల…
అక్షర సత్యం.
ఈ పేరు సార్థకనామమే.
ఈ శతాబ్ది గాయకుడు.. సహస్రాబ్దుల దాకా నిలబడే గాయకుడు..
సుమారు మూడు దశాబ్దాల పాటు ఎంతో శ్రమించి సేకరించిన సమాచారంతో చల్లా సుబ్బారాయుడు ‘శతాబ్ది గాయకుడు’ పుస్తకాన్ని ప్రచురించారు. శ్రమతో పాటు ఆర్థిక శ్రమ కూడా ఉంది. 948 పేజీల ఈ పుస్తకంలో ఘంటసాల పాడిన సుమారు మూడున్నర వేల పాటల సాహిత్యాలను ఇందులో పొందుపరిచారు. ఘంటసాల పాట విన్న తరవాత తనకు ఏదో తెలియని భావావేశం కలగడం వల్లే తాను ఈ పనికి పూనుకున్నానంటున్నారు సుబ్బారాయుడు. ఘంటసాల ఋణం తీర్చుకోవడానికే ఈ పుస్తక ప్రచురణ ఆలోచన వచ్చి ఉంటుందని నమ్ముతున్న వ్యక్తి సుబ్బారాయుడు. ప్రముఖుల ఆశీర్వచనాలతో పాటు, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగారి ఆశీస్సులు కూడా అందుకున్నారు సుబ్బారాయుడు గారు. రెండు కేజీల బరువు, 1600 రూపాయలు విలువ చేసే అంత పెద్ద పుస్తకాన్ని 1400 రూపాయలకే ఘంటసాల అభిమానులందరికీ అందించాలనేది ఆయన సదుద్దేశ్యం.

ఇందులో కేవలం పాటలకు సంబంధించిన సాహిత్యాలు మాత్రమే కాదు… ఘంటసాల గురించి పెద్దలు పలికిన చద్దిమూట వంటి పలుకులు కూడా ఉన్నాయి. ఘంటసాల అభిమానులైన తెలుగు వారి ఇంట ఉండవలసి పుస్తకం.

‘‘ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాల వారు ఈ చిత్రానికి నాదబ్రహ్మలండీ అని ‘పెళ్లిచేసి చూడు’ చిత్రం సాంకేతిక నిపుణులతో సంగీత దర్శకుడనుటకు బదులు.. శ్రీ ఘంటసాలను నాదబ్రహ్మ అని ఆనాడు నేనన్నాను. నాటికీ నేటికీ ఏనాటికీ కూడ, చిత్ర సంగీతంలో ఘంటసాల సృష్టి విశిష్టత అట్టిది. రసపట్టులెరిగి, భావోచితరాగ సరళినీ, శబ్దోచిత రమ్యతనూ సమకూర్చి బాణీలు కట్టుటలో ఘంటసాల గానకళా పట్టభద్రుడే.
– పింగళి నాగేంద్రరావు
(73 వ పేజీ)
–––––––––––––
ప్రతులకు
చల్లా సుబ్బారాయుడు
ఫ్లాట్ నెంబర్ – 002
10వ బ్లాక్
మై హోమ్ అవతార్
నార్సింగి
హైదరాబాద్ – 500093
ఫోన్; 8500818134, 7842440134
(Review by Vijayanthi Puranapanda)

