మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ మటాష్
అధినేత బాబుకు దిమ్మదిరిగే ఫలితం
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ఆంధ్ర ప్రదేశ్‌లో మున్సిపాలిటీలు వైసిపాలిటీలుగా మారిపోయాయి. ఇది వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్య కాదు. వాస్తవం. ఇంతవరకూ చరిత్రలు గెలుపులో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఓటమిలోనూ చరిత్ర నెలకొంది. అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరడం నిజంగా చరిత్రే. చంద్రబాబు ఓటమికి ఇదో చరిత్ర. చంద్రబాబు కుప్పం నుంచి ఇంతవరకూ 6సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. అలాంటి కుప్పంలో ఘోర పరాజయంతో కుప్పం మున్సిపాలిటీ కాస్తా కుప్పం వైసిపాలిటీగా మారిపోయింది. సర్వసాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల కోటలను టచ్ చేయరు.
ఎందుకంటే అదే పరిస్థితి తమకే రావచ్చనే భయమే కారణం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ భయం పోయింది. ప్రతిపక్షనేత నియోజకవర్గమే లక్ష్యంగా పదేపదే రాజకీయ దాడులను ప్రజాస్వామ్యయుతంగా చేసింది. వారి గురి తొలుత పవన్ కల్యాణ్. రెండు నియోజకవర్గాల్లోనూ పికెను వైసీపీ ఓడించింది. ఇప్పుడావంతు టీడీపీకి వచ్చింది. ఇక కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడమే మిగిలింది. ఈ గెలుపు వెనుక కీలక హస్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఆయన మొదటి నుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెబుతూ వస్తున్నారు.
ఆ దిశగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ముందంజ వేశారు. విజయం సాధించారు. ఇక చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తారా? అసలు ఆ చాన్స్ చంద్రబాబు ఇస్తారా? అనేది ఆసక్తికరమే. తాజాగా జరిగిన 12 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్క దర్శిలో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన అన్ని చోట్ల వైసీపీదే ఆధిపత్యంగా నిలిచింది.
దర్శిలో అధికార పార్టీలో అంతర్గత కలహాల కారణంగానే పార్టీ ఓడిందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలను వైసీపీ గెలుపుగా కంటే టీడీపీ ఘోర ఓటమిగా చెప్పుకోవడమే సబబు. ఎందుకంటే గెలవడాన్ని అధికార పార్టీ ఎప్పటి నుంచో అలవాటుగా చేసుకుంది. తమ పధకాలు గెలుపునకు బాటలు వేశాయని ఆ పార్టీ నమ్ముతోంది.