భార‌త గాన ర‌త్నం ల‌తా మంగేష్క‌ర్‌

Date:

సురాగ, సరాగ మాలిక లత
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
ఆసేతు హిమాచలం లత పాటల పల్లకిలో విహరిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తోంది. మల్లెల ఘుమ ఘుమల్లేని వేసవి, చినుకు పడని వానాకాలం, లత గళం లేని సినిమా అసహజం అని సంగీత దర్శకులు భావించారు. ‘భూమికి ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు. ఒకే లతామంగేష్కర్’ అని గీత రచయిత జావేద్ అక్తర్ మాటలు ఆక్షర సత్యాలు. స్వరాలన్నీ ఝరిలా ప్రవహించి పండు వెన్నెల్లో రాగ సుగంధ పరిమళాలతో స్పర్శించి రస హృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడిస్తే ఆ సురాగ, సరాగ మాలిక లత లతామంగేష్కర్. స్వరాల సయ్యాట పాట. పాటకు లత గానం ఓ ప్రాణం. దశాబ్దాల ఆమె సుదీర్ఘ సంగీత యాత్రలో రవళించిన గీతికలు ఎన్నో, ఎన్నెన్నోతొలి పొద్దులో భూపాలం. మలి సందెలో దీపక రాగం. ఆమె గీతం మనసు తాకే మధుర తుషారం. ఆ గానం పాటకు పన్నీటి స్నానం ఆ స్వరం.. ఓ సమ్మోహన గళం…. ఆమె పాట మంచు అద్దిన కశ్మీరీ అత్తరు పరిమళం. దళసరి గళాల హిందీ నేపథ్యగాన ప్రపంచంలో సొగసైన పాటల శృతిమాధురిలా వచ్చిన లత సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ‘ఆయెగా ఆనేవాలా’ పాట లతామంగేష్కర్ కెరీర్‌నే కాదు.. హిందీ నేపథ్యగాన దశనూ, దిశనూ మార్చివేసింది. ఒక నవశకానికి నాంది పలికింది.


ఇండోర్‌లో జ‌న‌నం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సంగీత విద్వాంసుడు, నటుడు దీనానాథ్ మంగేష్కర్, షేవంతిల ఇంట పల్లవించిన చిరుగమకం లత. చిన్నారి లత శ్రావ్యంగా పాడుతుంటే ముగ్ధుడైన తండ్రి.. ఆమెకు హిందుస్థానీ సంగీతం నేర్పారు. నాన్న ఇచ్చే నాటక కళా ప్రదర్శనల స్ఫూర్తితో ఐదో ఏటనే లతా మంగేష్కర్ కళావేదికలపై వేషాలతో మురిపించింది. గురువు అమాన్ అలీఖాన్ సాహెబ్ దగ్గర ఉర్దూ హిందుస్థానీ ఘరానాల తరానాలు, సంగీత సంగతులు నేర్చింది. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హఠాత్తుగా కన్నుమూశారు. కుటుంబ పోషణ భారం లత భుజస్కంధాలపై పడింది. ముగ్గురు చెల్లెళ్లు.. ఆశ, ఉష, మీనా, తమ్ముడు హృదయనాథ్.. కన్నతల్లి షేవంతిలకు అండగా నిలిచింది. మాస్టర్ వినాయక్.. లతకు సినిమాల్లో వేషాలిచ్చి ఆదుకున్నారు. అలా ‘పెహ్లా మంగళ గౌర్’, ‘బడేమా’ లాంటి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలు పెట్టారు., నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యం పెరగడం ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి.


తొలి అవ‌కాశ‌మిచ్చిన గులాం హైద‌ర్
సంగీత దర్శకుడు గులాం హైదర్ పరిచయంతో లతలో ఆశలు చిగురించాయి. తన సినిమా మజ్బూర్లో ‘దిల్ మేరా తోడా’ పాటతో ఆయన అవకాశమిచ్చారు. ఆ పాట రాజ్ కపూర్, నర్గీస్ నటిస్తున్న బర్సాత్ స్వరకర్త శంకర్-జైకిషన్ మనసు తాకింది. బర్సాత్‌లో ఆయన లతామంగేష్కర్‌కు నవ పారిజాతాల్లాంటి 9 పాటలిచ్చారు. శ్రోతలకు పాట కావాలి. స్వరాల సయ్యాట కావాలి. వెండితెరమీద రంగుల హరివిల్లు విరియాలి. అందుకే సినీ ప్రపంచం పాటనే నమ్ముకుంది. కథానాయకులకు ఎందరు గాయకులు పాటలు పాడినా.. కథా నాయికలకు లతమ్మ లేనిదే గొంతు పెగలదు. వయసులో ఉన్న కుర్ర హీరోయిన్లకు లతామంగేష్కర్ వేలాది పాటలిచ్చారు. ఆమె తరతరాల హీరోయిన్లకు తీయని గళమిచ్చారు. దర్శకులు లత ఒక్క పాటైనా పాడాలని ఇంటికి బారులుతీరారు.


సంగీత ప్ర‌పంచంలో ల‌త పాట‌ల వ‌ర్షం
లత పాటల వర్షానికి సంగీత ప్రపంచంలో క్రమంగా హర్షామోదాలు లభించాయి. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవి చూశాయి. ఆ తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, చిత్రాల్లోని గీతాలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. లతామంగేష్కర్ దాదాపు 170 మంది సంగీత దర్శకుల వద్ద 36 దేశ, విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. కిశోర్ కుమార్‌తో కలసి ‘గాతా రహా మేరా దిల్’ పాటలు చెవుల్లో అమృతాన్ని పోసినట్టు ఉంటాయి. కోకిల లతా మంగేష్కర్ అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 1942 నుంచి ఇప్పటివరకూ ఆమె సాగించిన 8 దశాబ్దాల పాటల ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతమై లతమ్మకు స్వరాభిషేకం చేశాయి. మన దేశ అత్యున్నత పౌరపురస్కారం పాటు మరికొన్ని అవార్డులు ఆమె గాత్ర మాధుర్యానికి పరవశించి పలకరించాయి.


తొలి పాట‌కు అంద‌ని పారితోషికం
1969 లో పద్మభూషణ్ అందుకున్న లతా మంగేష్కర్ .1989లో సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 1999లో పద్మవిభూషణ్ అందుకున్నారు. కొందరికి ఆమె ‘దీదీ’. ఇంకొందరికి ‘లతాజీ’. మరికొందరికి మధుర గాన లాహిరిలో ఓలలాడించే అభిమాన గాయని భారతీయ సినీ సంగీతానికి మకుటంలేని మహారాణి. 20 భాషలలో పాడారు. ఇన్ని పాటలను పాడి, అసలు సిసలు కోయిల అనిపించుకున్న లతాజీ.. తనకు ఎంతో పేరు తెచ్చిన తొలి పాటకు ఇప్పటికీ పారితోషికం అందుకోలేదట. అంతే కాదు.. ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆయేగా అనేవాలా ఆయేగా..’ పాటకు రికార్డుల్లో ఆమె పేరు లేనే లేదు. ఉన్నదల్లా, ఆ పాటకు నటించిన ‘కామిని’ పేరు మాత్రమే!. 1942లో మరాఠీ చిత్రం ‘కిటీ హసాల్’ కోసం లతా పాడిన మొట్టమొదటి పాట ఎడిటింగ్‌లో తీసేశారు. ఎన్ని పాటలో.. ఎన్ని భాషలో..లతాజీ తన కెరీర్‌లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాడారని అంచనా. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాడారు.
తెలుగులో నిదుర‌పోరా త‌మ్ముడా!
తెలుగులో ఆమె గాత్రంలో నుంచి జాలువారిన పాటల్లో ‘సంతానం’లోని ‘నిదురపోరా తమ్ముడా…’ ఎవ్వరూ మర్చిపోలేనిది. !.స్వరకర్తగా.. నిర్మాతగా..లతాజీ జీవితంలో ఇంకా చెప్పుకోదగ్గ కోణాలూ, విశేషాలూ అనేకం ఉన్నాయి. మనందరికీ ఆమె సుప్రసిద్ధ గాయనిగానే పరిచయం. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక, తన పేరుతోనే ‘రామ్రామ్ పహ్వానే’ అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ‘ఆనంద్ ఘన్’ అనే పేరు పెట్టుకొని మరో నాలుగు మరాఠీ చిత్రాలకూ సంగీత దర్శకురాలిగా పనిచేశారు. ఇదొక్కటే కాదు, నిర్మాతగానూ ఆమె చలన చిత్రాలను తీశారన్న విషయం కొద్దిమందికే తెలుసు. 1953లో ఆమె ‘వాదాల్’ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. తరువాత, 1955లో ‘ఝంఝర్’, ‘కంచన్’, 1990లో ‘లేకిన్’ సినిమానూ నిర్మించారు.పురస్కారాల పంట లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపన అయినా.. లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...