సహస్రాబ్ధి సమారోహంలో సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఏపీ సీఎం వైయస్ జగన్ సోమవారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే… చిన్నజీయర్ స్వామిగారి ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల వారి వెయ్యి సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం శుభపరిణామం.
ఒక వ్యక్తి కొన్ని సిద్దాంతాల కోసం నిలబడడం, సమాజంలో అసమానతను రూపుమాపాలని వెయ్యి సంవత్సరాల క్రితం 1017లోనే ఒక థృఢమైన నమ్మకంతో తనకు ఒక స్వామి ఉపదేశించిన మంత్రాన్ని ( ఆ మంత్రం అందరికీ తెలియజేస్తే పాపం తగులుతుందేమోనని చెప్పి అంటూ ఉన్న సమాజంలో) ప్రతీ ఒక్కరికీ కూడా ఆ మంత్రం తెలియాలి, తెలియజెప్పాలని, ఆ క్రమంలో తనకు పాపం తగిలినా పర్వాలేదని ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప భావంతో ఒక సందేశాన్ని ప్రచారం చేసిన గొప్ప మనిషి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు,
ఆయన్ను మనం స్మరించుకుంటున్నాం. శ్రీ రామానుజాచార్యుల వారు ఆ రోజు విలువల కోసం ఏదైతే నిలబడ్డారో ఈ రోజుకూ కూడా ఆ విలువలు ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. ఇది మనం గుర్తించుకోవాలి.
సమాజాన్ని మార్చాలి, అందరూ సమానులే అనే గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం చిన్నజీయర్ స్వామి వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ఈ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇది ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
ఇక్కడ అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కూడా చక్కగా శ్లోకాలు చెబుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చిన్నజీయర్ స్వామి వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి ఈ స్ధాయిలో వచ్చేందుకు తోడ్పాటు అందించిన రామేశ్వరరావు అన్నకు కూడా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు సీఎం వైయస్ జగన్.
సంప్రదాయ పంచ కట్టులో ఆయన ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేశారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు. చిన జియర్ స్వామి జగన్‌కు దగ్గరుండి ఆశ్రమాన్ని చూపించారు.