అన్నమయ్య అన్నది-30
(రోచిష్మాన్, 9444012279)
“సకల భూత దయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహ సంభవమైన ఫలము”
అన్ని ప్రాణులపైనా దయ విస్తారంగా (చాఁలఁగ) కలగడం బహిరంగంగా (ప్రకటించి) దేహంవల్ల సాధ్యమయ్యే (సంభవమైన) సిద్ధి (ఫలము) అంటూ అన్నమయ్య గొప్ప సంకీర్తనను సంధిస్తున్నారు.
దేహంవల్ల బహిరంగంగా సాధ్యం అయ్యే సిద్ధి (accomplishment) ఏమిటి? అన్ని ప్రాణులపైనా విస్తారంగా దయ కలగడమే! భూత దయ అన్నది విస్తారంగా ఉండి ఉంటే ఇవాళ మన ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని భయంకరమైన సమస్యలు, ఆపదలు, దారుణాలు ఉత్పన్నమై వ్యాపించి ఉండేవి కావు. భూత దయ లేకపోవడంవల్ల ప్రపంచ మానవాళి భయంకరమైన పరిణామాలకు బలైపోతూ ఉండడం శతాబ్దులుగా మాత్రమే కాదు సహస్రాబ్దులుగానూ ఉన్నదే.
“ధర్మో జీవ దయాతుల్యో న క్వాపి జగతీతలే / తస్మాత్సర్వ ప్రయత్నేన కార్యా జీవదయానృభిః” అని ఒక పూర్వ సంస్కృత శ్లోకం చెబుతోంది. అంటే ధర్మాల్లో జీవ దయకు సమానమైనది మఱొకటి ఈ జగత్తులో లేదు. కనుక ప్రయత్నించి జీవ దయకు సంబంధించిన పనులతో ప్రవర్తించాలి అని అర్థం.
మనిషిని మనిషి దయ లేకుండా రకరకాలుగా హింసించడం అన్నది కూడా యుగయుగాలుగా వస్తూ ఉన్నదే. దయ లేకపోవడం అన్నది మానవాళికి జరుగుతున్న హాని. మానని పుండై దయ లేనితనం మానవ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తూనే ఉన్నది.
“తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలు కర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము “
కలిగే (తలకొన్న) ఫలితంపై వాంఛ అన్నది సోకకుండా చిత్తాన్ని సిద్ధపఱుచుకోవడం (అలవరించుట) పని లేదా కర్తవ్యం చేసే వ్యక్తికి సిద్ధి (ఫలము); చేసేవాటన్నిటిలోనూ (పలు కర్మములలోన) బ్రహ్మార్పణ బుద్ధి కలగడం హరికృపవల్ల కలిగిన సిద్ధి అంటూ అన్నమయ్య తొలి చరణంలో పలికారు.
“కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన / మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోऽస్త్వకర్మణి” అని భగవద్గీత(అధ్యాయం 2 శ్లోకం 47)లో ప్రవచించబడ్డది. పని చెయ్యడం లేదా కర్తవ్యంలో మాత్రమే (కర్మణి, ఏవ ) స్థానం (అధికారః) ఉంటుంది నీకు (తే), ఫలితంలో ఉండదు (మా ఫలేషు) ఎప్పటికీ (కదాచన); ఆ పని ఫలితమే (కర్మ ఫల) లక్ష్యంగా (హేతుః) ఉండద్దు ( మా, భూః); నీకు (తే) పని లేదా కర్తవ్యం చెయ్యకపోవడంతో (అకర్మణి) సంబంధం (సంగః) ఉండకూడదు (మా అస్తు) అని ఆ శ్లోకానికీ అర్థం. పని చెయ్యడంలో మాత్రమే మనిషికి స్థానం ఉంటుంది ఫలితంలో ఆ స్థానం ఎప్పటికీ ఉండదు; చేసే పనికి వచ్చే ఫలితమే లక్ష్యంగా ఉండ కూడదు; ఆ క్రమంలో పని చెయ్యకుండానూ మనిషి ఉండకూడదు అన్న ఈ ఉద్బోధ అవగతం అయితే మనిషికి ఆవేదన, ఆందోళన, ఆశాభంగం, అలజడి ఉండవు; ప్రపంచానికి మనిషివల్ల కీడు జరగదు. ప్రశాంతంగా బతకడానికి మానవాళికి భగవద్గీత చూపిన మార్గాల్లో ఇది కూడా ఒకటి.
భగవద్గీత (అధ్యాయం 3] శ్లోకం 19)లో మఱో ఉద్బోధ ఇలా మనకై ఉంది. “తస్మాదసక్త స్సతతం కార్యం కర్మం సమాచర / అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః” అంటే కర్తవ్యం చెయ్యాలి కనుక నువ్వు ఎల్లప్పుడూ ఫలితంపై అపేక్ష లేనివాడివై చెయ్యాల్సిన కర్తవ్యాన్ని బాగా చెయ్యి. ఫలితంపై అపేక్షను వదిలేసి కర్తవ్యాన్ని చేసే పురుషుడు మోక్షాన్ని (పరంను) పొందుతాడు అని అర్థం. అన్నమయ్య బ్రహ్మార్పణ బుద్ధి అని దీన్నే చెబుతున్నారు.
చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు (Lao – tzu) తన టావ్ – ట – చింగ్ (Tao -Te-Ching) 10వ కవితలో “ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యి….అది అత్యున్నతమైన గుణం” అనీ, 24వ కవితలో “నీ పని చెయ్యి ఆపై వదిలెయ్యి” అనీ, 37వ కవితలో “వాంఛ లేనప్పుడు అన్నీ ప్రశాంతతలో ఉంటాయి” అనీ తెలియజెప్పాడు.
“ఎప్పుడుఁ దిరివేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్య దు:ఖమ్ముల సమముగా
నొప్పుట విజ్ఞాన మొదవిన ఫలము “
ఎప్పుడూ శ్రీ వేంకటేశుడిని (సేవకుడవడమే) పూజించే వాడవడమే మనిషి అయినందుకు సిద్ధి అనీ, ఉన్న సుఖ దుఃఖాలను సమంగా ప్రకాశింపచెయ్యడం విజ్ఞానంవల్ల కలిగే (ఒదవిన) సిద్ధి అనీ సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
విజ్ఞానం అంటే ఎఱుక (knowledge) అని అర్థం. అంటే ఏది ఏదో తెలిస్తే సుఖ దుఃఖాలు సమంగానే తెలియ వస్తాయి. ఆ సత్యాన్నే చెబుతున్నారు అన్నమయ్య.
దేనికి ఏది సిద్ధి అవుతుందో, మనిషైన వాడికి ఏది సిద్ధి (accomplishment) అవుతుందో తెలియజేస్తూ ఆపై విజ్ఞానం ఇవ్వగల సిద్ధి ఇదే అని విశదపఱుస్తూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

