నూఱవద్దు, తాగవద్దు…

0
85

అన్నమయ్య అన్నది-18
(రోచిష్మాన్, 9444012279
)

“నూఱవద్దు తాగవద్దు నోరు చేఁదు గావద్దు
చేరువ నొక చోట సంజీవి వున్నదిదివో”

నూఱవద్దు, తాగవద్దు నోరు చేదు కావద్దు దగ్గఱగా ఒకచోట సంజీవి ఉంది ఇదిగో అని మొదలుపెట్టారు తన పదాన్ని అన్నమయ్య మనకు పనికివచ్చే పథంగా.

దేన్ని నూఱవద్దు? దేన్ని తాగవద్దు? ఏ ఆకునూ, ఏ మూలికనూ నూఱక్కఱ్లేదు; దాన్ని తాగక్కఱ్లేదు; ఆపై నోరు చేదు కావక్కఱ్లేదు. దగ్గఱ్లోనే ఉంది ఒకచోట సంజీవి ఇదిగో అని చూపిస్తున్నారు అన్నమయ్య.

ఆ సంజీవి ఏమిటి? అది శ్రీవేంకటేశ్వరుడు లేదా పరమాత్మ. “కొనరో కొనరో మీరు కూఱిమి మందు / ఉనికి మనికి కెల్ల నొక్కటే మందు” అనీ, “అన్నిటికినిది పరమౌషధము / వెన్నుని‌ నామమే విమలౌషధము” అనీ సంకీర్తనలు రాసి అన్నమయ్య వేంకటేశ్వరుణ్ణి మందు అనీ, పరమౌషధము అనీ, విమలౌషధము అనీ తెలియజేశాక ఇక్కడ సంజీవి అని తేల్చి చెబుతున్నారు.

పరమాత్మకు మించిన ఔషధం లేదు. పరమాత్మే సంజీవి. ఆదిశంకరాచార్య ఆత్మబోధ (శ్లోకాలు 36, 37) లో “నిత్యశుద్ధ విముక్తైక మఖండా నందమద్వయం / సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మావేవ తత్” అనీ, “ఏవం నిరంతరం కృత్వా బ్రహ్మై వాస్మీతి వాసనా / హరత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనమ్” అనీ చెప్పారు. అంటే నిత్యము, శుద్ధము, బంధ విముక్తము, ఏకైకము, అఖండము, ఆనందము, అద్వయము, సత్యము, అనంతమైన జ్ఞానము ఏదో అదే నిశ్చయంగా నేనైన పరబ్రహ్మ అనీ, ఇలా నిరంతరమూ నేనే బ్రహ్మను అన్న భావనా‌ సంస్కారం రోగాన్ని ఔషధం ఎలా‌ పోగొడుతుందో అలా‌ అవిద్యవల్ల వచ్చిన అవలక్షణాల్ని హరిస్తుంది అని అర్థం. ఈ స్థితికి అతీతంగా పరమాత్మ సంజీవి అయి మన దుస్థితిని తీసేసి మనకు సుస్థితిని ఇస్తుంది.

“సకల జీవోన్మేష సంజీవని యనంగ బ్రకట‌ నిద్రా ముద్రఁ బాయఁజేసి” అని విక్రమార్కచరిత్రములో కవి జక్కన (15వ శతాబ్ది) రాశారు. ఉన్మేషము అంటే మెలకువ, కాంతి, వికసించడం అని అర్థాలు. ఉన్మేషం కలిగిస్తాడు కాబట్టి‌ పరమాత్మను సంజీవి అని తెలియజెప్పారు‌ అన్నమయ్య. నిద్ర నుంచి మెలకువలోకి రావాలంటే సంజీవి.. అదే పరమాత్మ అన్న సంజీవి మనకు కావాలి. సంజీవి అంటే ఆహారం అన్న అర్థం కూడా ఉంది. పరమాత్మ మనకు ఆహారం కూడా! ఇది నిజం. అర్థం చేసుకుంటే ఆ నిజం అవగతమవుతుంది‌.

“పొలమెల్లాఁ దిరిగాడి పొడిఁబడనెవద్దు
తలఁకక గడ్డపాఱఁ దవ్వవద్దు
వలవని వాఁగుల వంకల వెదకవద్దు
చెలఁగి వొకచోట సంజీవి వున్నదిదివో”

పొలమంతా తిరిగి‌ ఎండిపోవద్దు, శ్రమిస్తూ గడ్డపాఱతో తవ్వవద్దు, అనవసరంగా వాగుల్లోనూ, వంకల్లోనూ వెతకవద్దు, ప్రకాశిస్తూ ఒకచోట సంజీవి ఉన్నది ఇదిగో అని తెలియజేస్తున్నారు అన్నమయ్య.

ప్రకాశిస్తూ (చెలఁగి) ఒకచోట సంజీవి ఉందని చెబుతున్నారు అన్నమయ్య. పరమాత్మ ఒక ప్రకాశం. “ప్రకాశాది వన్నైవం పరః” అని‌ ఒక బ్రహ్మసూత్రం (అధ్యాయం 2 పాదం 3 సూత్రం 46) చెబుతోంది. అంటే ప్రకాశం ఇత్యాదుల వంటిది బ్రహ్మం; అది మఱొకటి కాదు‌ అని ఆ బ్రహ్మసూత్రానికి అర్థం.

“మొక్కలానఁ జెఱువులో మునిఁగి చూడవద్దు
నిక్కిన పుట్టలమీఁద నెమకవద్దు
వెక్కసానఁ జేతిపైఁడి వెలవెట్టి కొనవద్దు
చిక్కులెల్లాఁ బాపెటి సంజీవి వున్నదిదివో”

మొండితనంతో చెఱువులో మునిగి చూడవద్దు, పైకి లేచిన పుట్టలపైన వెతకవద్దు, ఆగలేక బంగారాన్ని వెలగా ఇచ్చి కొనవద్దు, చిక్కులన్నిటినీ తీసేసే సంజీవి ఉన్నది ఇదిగో అని చెబుతూ కొనసాగుతున్నారు అన్నమయ్య…

“వేద వేద్యులు వెదికేటి మందు / ఆదినంత్యము లేని మందు” అంటూ ఇంకొక సంకీర్తనలో పలు రకాలైన మందుగా అభివర్ణిస్తూ అన్నమయ్య “శ్రీతిరుపతి వేంకటాద్రి మీఁది మందు అదివో మా గురుఁడిచ్చె నా మందు” అని చెప్పినదాన్ని కూడా ఇక్కడ చింతనలోకి‌ చేర్చుకుందాం.

“దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
సోవల బిలములోనఁ జొరవద్దు
కావించి గ్రహణాది కాలము వెదకవద్దు
శ్రీవేంకటనాథుఁడై సంజీవి వున్నదిదివో”

ఓడలెక్కి దీవుల్ని తిరగవద్దు, ఏ నల్లటి గుహలోనూ చొరబడవద్దు, ఊహించుకుని గ్రహణాది కాలాల్లో వెతకవద్దు శ్రీవేంకటనాథుడై సంజీవి ఉన్నది ఇదిగో అంటూ చెప్పాల్సినదాన్ని తెగేసి చెప్పి ముగించారు అన్నమయ్య.

పరమాత్మ అన్న సంజీవి మనకు అవసరం అత్యవసరం. అందుకోసమని మనం కిందా మీదా పడక్కఱ్లేదు. ఏదో, ఏదో చెయ్యక్కఱ్లేదు. ఆదిశంకరాచార్య శ్రీదేవ్యపరాథక్షమాపణ స్తోత్రంలో “న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో / న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః / న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం / పరం జానే మాత స్త్వదనుసరణం క్లేశ హరణం” అని స్పష్టం చేశారు. అంటే మంత్రం, యంత్రం, ప్రార్థన, ధ్యానం, నిన్ను స్తుతించడం నాకు తెలియవు, ముద్రలు, విన్నపించడం‌, నాకు తెలియవు కానీ మాతా, నాకు తెలుసు నిన్ను అనుసరించడం క్లేశ హరణం అని ఆ మాటలకు అర్థం.‌

“‌ప్రాణ‌ స్తథానుగమాత్” అని బ్రహ్మసూత్రం (అధ్యాయం 1 పాదం 1 సూత్రం 28) చెబుతోంది. అంటే బ్రహ్మం (పరమాత్మ) అనుసరించడం అన్న విధానంవల్ల అని అర్థం. మఱో బ్రహ్మసూత్రం (అధ్యాయం 1 పాదం 1 సూత్రం 29) “న వక్తురాత్మోపదేశాదితి చేత్ ఆధ్యాత్మ సంబంధ భూమాహ్యస్మిన్” అనీ‌ చెప్పింది. అంటే చేప్పేవాడు (వక్త) నేర్పడం వల్ల అని అయినట్టయితే కాదు. దానికి (బ్రహ్మానికి) అధ్యాత్మిక సంబంధం చాల ఎక్కువ అని అర్థం.‌ ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడి ఎక్కువయితే సంజీవి అవుతుంది పరమాత్మ.

పరమాత్మ‌ సంజీవి అని తెలుసుకోవాల్సినదాన్నితెలియజేస్తూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here