ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన రిపోర్టర్
ఆ డేట్ లైన్ వార్తలపై అధికారుల ఉత్కంఠ
ఈనాడు – నేను: 37
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కష్టాలు తెలుసుకోవాలంటే రూరల్ రిపోర్టర్ల పని విధానాన్ని పరిశీలించాలి. అందులోనూ ఏజెన్సీ ప్రాంతంలోని రిపోర్టర్లు డెస్కుకు వార్తలను ఎలా చేరుస్తారనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఎపిసోడ్ ఉద్దేశం అదే.
నేను పనిచేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏడు మండలాలు ఉండేవి. రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, ఏలేశ్వరం, వై. రామవరం. వీటిలో రంపచోడవరం కాస్త మైదాన ప్రాంతానికి దగ్గరగా ఉండేది. రాజమండ్రి నుంచి గోకవరం మీదుగా వెడితే ఏజెన్సీకి వెళ్ళవచ్చు. 1980 ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళడానికి కూడా భయపడేవారు. ప్రభుత్వోద్యోగులు రక్షణ లేకుండా వెళ్ళడానికి సాహసించేవారు కాదు. నక్సల్స్ ప్రభావం విపరీతంగా ఉండేది. నక్సల్స్ చాలా స్వేచ్ఛగా తిరుగుతూ, గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతుండేవారు. గిరిజనాన్ని మోసగించేవారిని, సభలు పెట్టి బహిరంగంగా శిక్షించేవారు. కొంతమందిని కాపు కాసి చంపడం లేదా కొట్టి చంపడం చేసేవారు.
అడవిని జల్లెడ పట్టేందుకు (కూంబింగ్ ఆపరేషన్) వచ్చిన పోలీసులపై మందుపాతరలు పేల్చి, ప్రాణాలు తీసేవారు. తూర్పుగోదావరి ఏజెన్సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏడుగురు ఐ.ఏ.ఎస్. అధికారుల కిడ్నాప్ ఘటన. ఈ అంశాన్ని కవర్ చేసేందుకు జాతీయ మీడియా ఇక్కడికి తరలి వచ్చింది. ఇది జరిగినప్పుడు నేను ఇంకా ఈనాడులో చేరలేదు. కానీ ఆ వార్తలను ఆసక్తికరంగా చదివేవాణ్ణి. ఈ కిడ్నాప్ ఘటనను లోకానికి వెల్లడించింది వేణుమాధవ్ అనే స్టింగర్. అప్పట్లో మండలాల విలేకరులను ఇలాగే పిలిచేవారు. వారికి కాలమ్ సెంటీమీటర్లు లెక్కకట్టి చెల్లించేవారు. ప్రారంభంలో ఇది కాలమ్ సెంటీమీటరుకు అరవై పైసలుండేది. నెలకు వంద సెంటీమీటర్లు రాస్తే, అరవై రూపాయలు వచ్చేదన్నమాట. వీటికి ఫోటోలు, రాకపోకల ఖర్చు అదనంగా చెల్లించేవారు.
ఏజెన్సీ రిపోర్టింగ్ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి డి. సత్యనారాయణ. అడ్డతీగల మండలానికి ఈనాడు రిపోర్టర్. న్యూస్ టుడే వార్తా ఏజెన్సీ ప్రారంభమైన కొత్తలో ఎం.డి.గా ఉన్న రామానుజం గారు ఇంటర్వ్యూ చేసి సత్యనారాయణను ఎంపిక చేశారు. 1983 నుంచి తాను ఈనాడుకు రిపోర్టర్ గా సేవలు అందించానని నాకు చెప్పారు. దాదాపు 35 సంవత్సరాలపాటు, సత్యనారాయణ ఈనాడుకు పనిచేశారు. అడ్డతీగలలోనే టైప్ ఇనిస్టిట్యూట్ నడిపేవారు. వార్తలను టైపు చేసి పంపేవారు. వాటిని డెస్కుకు చేర్చడానికి రకరకాల విధానాలను అవలంబించేవారు. ప్రత్యేక కథనాలను ఆఫీసుకు పోస్ట్ ద్వారా పంపేవారు. స్పాట్ వార్తలను తెలిసున్నవారు ఎవరైనా రాజమండ్రి వెడుతుంటే, వారి ద్వారా పంపి, బస్సు స్టాండులో ఉన్న డబ్బాలో వేయించేవారు. వార్తా సేకరణకు కొండలు, గుట్టలు ఎక్కి… కిలోమీటర్ల మేర నడిచేవారు. నక్సల్స్ హడావిడి చేస్తే, మరింత కష్టపడాల్సి వచ్చేది. అర్ధరాత్రి పూట నక్సల్స్ ఎవరినైనా హెచ్చరిస్తూ పోస్టర్లు వేస్తే సంచలనంగా మారేది. ఆ వార్తను మొదటి పేజీలో పెట్టే పరిస్థితులు ఉండేవి. మందుపాతర పేలితే… సమీపంలోకి వెళ్లే అవకాశమే ఉండేది కాదు. అలాంటి సందర్భంలో అక్కడికి దగ్గరలో తెలుసున్న వారి నుంచి సమాచారం సేకరించి, ట్రంక్ కాల్ బుక్ చేసి వార్త చెప్పేవారు. ట్రంక్ కాల్ అంటే ఈనాటి మొబైల్ తరానికి తెలియని ప్రక్రియ. ల్యాండ్ ఫోన్లే అప్పట్లో ఆధారం. టెలిఫోన్ కార్యాలయానికి వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసి… లైన్ కలిసే వరకూ అక్కడే వేచి ఉండి, వార్తను చెప్పేవారు. డెస్కులో ఎవరో ఒకరం, ఆ వార్తను రాసుకునే వారం.

ఇలా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంపిన వార్తను ప్రింటులో చూసుకునే సరికి ఆ రిపోర్టరుకు ఒక రకమైన సంతృప్తి. అదే అందర్నీ నడిపించేది. దీనిని కొందరు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అని ఇప్పటికీ అంటారు. కానీ, అదే ఆత్మానందం అనుకునేవారూ, అలాగే పనిచేసేవారూ ఇప్పటికీ ఉన్నారు.
ఇక ఈరోజు మన హీరో అడ్డతీగల సత్యనారాయణ ఎంత గొప్ప పేరు గడించారంటే… (ఈనాడులో కాదు), జిల్లా యంత్రాంగానికి అడ్డతీగల డేట్ లైన్ తో వార్త కనిపించిందంటే దడ. ఆయన ఏ సమస్యను తమకు కొనితెచ్చాడోననే భయం. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ప్రచురితమైన వార్తలను ఐ.టి.డి.ఏ. అధికారి జిల్లా కలెక్టర్ కు ప్రతి రోజు ప్రజా పౌర సంబంధాల అధికారి ద్వారా పంపేవారు. అందులో సమస్యల వార్తలు ఏమున్నాయో తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఆదేశించేవారు. మరుసటి రోజు పత్రికలో ఈనాడు వార్తకు స్పందన రావాల్సిందే. అంత పక్కాగా అధికారులు పనిచేసేవారు. ప్రతి రోజు అడ్డతీగల డేట్ లైన్ తో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్సును పరిశీలించి ఫైల్ చేసేవారు. ఇది అన్ని డేట్ లైన్స్ కూ ఒకటే అయినప్పటికీ… ఏజెన్సీ ప్రాంత పరిస్థితుల దృష్ట్యా మరింత శ్రద్ధ తీసుకునేవారు.
దీనికి మించి, భయంకరమైన క్షణాలూ సత్యనారాయణ వృత్తి జీవితంలో ఉన్నాయి. ఏ సమాచారం కావాల్సి వచ్చినప్పటికీ నక్సల్స్ ఆయనను తమ వద్దకు పిలిపించుకునే వారు. దీనిని అధికారులు కిడ్నాప్ అని భావించేవారు. హడావిడి పడేవారు. సత్యనారాయణ మాత్రం పని పూర్తికాగానే, కీకారణ్యంలో నుంచి జనారణ్యంలోకి నవ్వుకుంటూ వచ్చేవారు. ఇది ఆయనకు మామూలే. ఆ తరవాత ఆయనకు అధికారుల ప్రశ్నలు. ఏమడిగారు… ఎందుకు పిలిచారు… ఏమైనా డిమాండ్లు పెట్టారా అంటూ ప్రశ్నల వర్షం. ఇద్దరి మధ్య నలుగుతూ ఆయన తన వృత్తిని… ప్రవృత్తినీ చాకచక్యంగా పూర్తిచేసేవారు. అందుకే ఆయనను ఈనాడు బెస్ట్ కంట్రిబ్యూటర్ గా గుర్తించింది. సంస్థాగతంగా ప్రచురించే మ్యాగజైన్ సమీక్షలో ఒక పేజీ కేటాయించింది. ఆయన రిపోర్టింగ్ చేసిన విధానాన్ని వివరించింది. ఇప్పుడు ఆయన వయసు 75 . ఈ వివరాలు వచ్చే ఎపిసోడ్ లో…