(వాడవల్లి శ్రీధర్)
అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని నగరాలలోనూ రాష్ట్రాలలోనూ ముందువరసలో ఉండటం యాదృచ్చికమైనా, కలసివచ్చిన విషయమే. అమరావతి ఆ ప్రదేశాన్ని అప్పట్లో ధాన్యకటక లేదా ధరణికోట అని పిలిచేవారు. ఇది శాతవాహనుల రాజధానిగా కూడా పనిచేసింది. వీరు మొదటి ఆంధ్ర పాలకులు, 2వ శతాబ్దం – 3వ శతాబ్దం మధ్య తమ రాజ్యాన్ని స్థాపించారు. అమరావతిలోనే బుద్ధ భగవానుడు కాలచక్ర వేడుకను ప్రబోధించి నిర్వహించాడు. వీటన్నింటికీ రుజువు వజ్రయాన గ్రంథంలో కూడా అమరావతి ఉనికిలో ఉందనే వాస్తవాన్ని చారిత్రాత్మకంగా స్థాపించింది.
మహానగర నిర్మాణానికి ప్రణాళిక
మహిమాన్వితంగా వెలగబోయే మహానగర నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. గత కాలపు చేదు గుర్తులను మర్చిపోయి ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడువు పెట్టుకుని మరీ కలల సౌధాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింప జేసుకునేందుకు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. చారిత్రక వైభవాన్ని మన తరంలో మళ్లీ చూడగలిగే రోజులు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. కొన్ని వందల ఏళ్ల పాటు నిలిచిపోయే చరితకు మనం సాక్షులుగా మారబోతున్న అద్భుత అవకాశం దగ్గరలో వస్తోంది.
రాజధాని లేని రాష్ట్రంగా అభాసుపాలైన స్థితి నుంచి ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన రాజధానిని నిర్మించుకున్న రాష్ట్రంగా నిలిచేందుకు సకల ప్రయత్నాలు సాగుతున్నాయి. విభజన మిగిల్చిన అపార నష్టాన్ని ఆంధ్రుల ఆత్మాభిమానం, మొక్కవోని పట్టుదల, ధృడ సంకల్పంతో అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. భ్రమరావతి అన్న పరిహాసాలు ప్రతిధన్వించిన చోట.. కళ్లు చెదిరే కట్టడాలు కొలువుదీరనున్నాయి. ఆగిపోయిన దగ్గరే మొదలు పెట్టాల్సి రావడం బాధాకరమైనప్పటికీ.. అసలు తిరిగి ప్రారంభించే అవకాశం లభించడమే మహాద్భుత ఘట్టం, ప్రాముఖ్యత మరువరానిది.
2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర విభజన జరిగిన తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దారు. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య 29 గ్రామాల వరకు విస్తరించి ఉన్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం పర్యావరణపరంగా స్థిరమైనదిగా భావించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 30 వేల ఎకరాల వరకు భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా నాయుడు సేకరించారు. 2015 అక్టోబరు 22న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు అమరావతి కోసం గతంలో మూడు మాస్టర్ ప్లాన్‌లను రూపొందించారు. 7,420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, రాజధాని నగర మాస్టర్ ప్లాన్ (217 చ. కి.మీ), సీడ్ క్యాపిటల్ వివరణాత్మక మాస్టర్ ప్లాన్. (16.9 చ. కి.మీ.)చెన్నై కంటే అమరావతి ఆరు రెట్లు పెద్దది, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది.ఇది గాంధీనగర్, చండీగఢ్, భువనేశ్వర్, నయా రాయ్పూర్ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఐదవ ప్రణాళికాబద్ధమైన రాజధాని అవుతుంది. రాజధాని నగరానికి ఉత్తరాన ఉన్న, సీడ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్‌లో అధికార కేంద్రంగా ఉంటుంది, దాని శాసనసభ, సెక్రటేరియట్, హైకోర్టుతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, దాని రాజకీయ వర్గం, బ్యూరోక్రసీ నివాసాలు ఉన్నాయి. సుదీర్ఘ కోస్తాతీరం, పుష్కలమైన జల, ఖనిజ వనరులు, నిత్య ఆవిష్కరణలు, ఆలోచనలు సాగించే దృఢ సంకల్పం గల మానవ వనరులకు ఈ రాష్ట్రంలో లోటు లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో, రాష్ట్రానికి నడిబొడ్డున, నది ఒడ్డున ఉండేలా కొత్త రాజధానిని ఎంపిక చేశారు. అమరావతి చారిత్రక ప్రాశస్థ్యాన్ని నిలబెట్టేలా, ఆంధ్రుల సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ భవనాల నిర్మాణం జరగాలి. సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్ తదితర ప్రధాన ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్ కట్టడాలుగా నిర్మిచి తీర్చి దిద్దాలన్న ధ్యేయంతో కేవలం ఈ భవనాలను సందర్శించేందుకే ప్రపంచ పర్యాటకులు వచ్చేలా రూపకల్పన చేస్తే భవిష్యత్‌లో ఇది పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. బ్లూ, గ్రీన్, ఆక్వా సిటీగా అమరావతి ప్రభుత్వ భవనాల డిజైన్ ఉండబోతోంది. ప్రపంచంలోని టాప్-5 నగరాలకు దీటుగా ఉండేలా అమరావతిని నిర్మించడానికి తగినట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో వివిధ రాష్ట్రాల రాజధానుల నిర్మాణాల్లో ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారలేకపోయాయి. అమరావతి నిర్మాణం ఆ లోటును తీర్చే నగరంగా రూపొందబోతోంది. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. వీటిలో శాసనసభ, హైకోర్టులను ఐకానిక్ భవనాలుగా నిర్మించనుంది.వీటి నిర్మామానికి రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాజధానిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మిస్తున్నారు.
వీటిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటివి ఉంటాయి. ఈ డిజైన్‌లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సముదాయంలో ప్రారంభంలో ఓ పక్క సీఎం నివాసం, మరో పక్క రాజ్ భవన్ ఉంటాయి. ఆ తర్వాత ఓ పక్క శాసన సభ, మండలిలు ఉంటాయి. మరో పక్క హైకోర్టు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఖాళీ స్థలాన్ని పబ్లిక్ ప్లాజాగా వ్యవహరించనున్నారు. ఇందులోకి ప్రజలను అనుమతిస్తారు. వీటి తర్వాత ప్రాంతాన్ని మైస్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతారు. దీనిలో ఓపెన్ ఎయిర్ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, సమావేశాశ మందిరాలు వంటివన్నీ వస్తాయి. వీటిలోనే ఒక స్మృతి చిహ్నం కూడా ప్రతిపాదించారు. వీటి తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటి తర్వాత వివిధ విభాగ అధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటి తర్వాత నివాస భవనాలు వస్తాయి. ప్రభుత్వ భవనాల సముదాయంలో నిర్మించే భవనాలన్నింటిలో సచివాలయమే ఎత్తుగా ఉంటుంది.
దీనిని 15 అంతస్తుల ఎత్తున నిర్మించాలన్న ఆలోచనగా ఉంది. 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుంది. 15వ అంతస్తులో సీఎం కొలువు తీరుతారు. హెచ్ఓడీల కార్యాలయాల భవనాలు ఏడు అంతస్తుల ఎత్తున ఉంటాయి. ఇక్కడ నిర్మించే భవనాలు వేడిని తట్టుకునేలా డిజైన్ చేశారు. ప్రతి భవనం పైనా సోలార్ ప్యానళ్లు ఉంటాయి. ప్రభుత్వ భవనాల ఇంధన అవసరాల్లో 40 నుంచి 50 శాతం సౌర విద్యుత్ ద్వారా ఇక్కడే తయారుకానుంది. రాజ్ భవన్, సీఎం నివాసం ఉండే బ్లాకు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మితమయ్యే బ్లాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్ఓడీల ఆఫీసులు ఉండే బ్లాకు, మంత్రులు, ఎమ్మెల్యేలుు, ఉన్నతాధికారుల క్వార్టర్లతో మరో బ్లాకు ఉంటుంది. ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన ఉన్న పాలవాగు వరకూ పైన పేర్కొన్న వరుసలోనే ఈ బ్లాకులు రానున్నాయి. గవర్నర్, సీఎం నివాసాలు నదీ ముఖంగా రానున్నాయి.
అమరావతిలో పర్యాటక అభివృద్ది
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధికి జవసత్వాలు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధి, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణకు‘ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు’ను త్వరలో ఏర్పాటు చేయనుంది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు రచించడం, పెట్టుబడులను ఆకట్టుకోవడం, తెలుగు సంస్కృతిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవడం, సంస్కృతి పరిరక్షణపై అందరిలో చైతన్యం తీసుకురావడం, జల క్రీడలు, వివిధ ఉత్సవాలు నిర్వహణ, బౌద్ధ దర్శనీయ స్దలంగా అభివృద్ధిచేయటం వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి.
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)