శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

Date:

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ

(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
ఎవరికైనా వ్యక్తిగతంగా లేదా సమాజపరంగా సమస్య వస్తే ఏంచేస్తారు? సంబంధిత అధికారుల శరణు కోరతారు. వారినుంచి స్పందన లేకపోతే…? పై అధికారుల దృష్టికి తీసుకువెడతారు. అక్కడా కాకపోతే… ఇంకాస్త ఒత్తిడి పెంచడం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తారు. ట్వీట్ చేస్తారు. పేస్ బుక్ లో తమ మొర వినిపిస్తారు. అదీ ఫలితం ఇవ్వకపోతే మంత్రుల దృష్టికి వెడతారు. వారి ఆదేశాలనూ హైరార్చి పేరిట అధికారులు బేఖాతరు చేస్తే… సమాజానికి ఎవరు దిక్కు? ఈ మౌలికమైన ప్రశ్న ఎదురు కాకుండానే సాధారణంగా (చిన్న చిన్న) పనులు జరిగిపోతాయి. అదీ స్థానిక రాజకీయ నాయకులకు ప్రయోజనకరమైతే మరింత వేగంగా సాగుతాయి.


ప్రతి పనికీ నిధులతో ముడి….
వారు చెయ్యాలి అనుకోకపోయినా… ఇంకేదైనా కారణమైన ప్రజాప్రతినిధులు… అధికారులు చెప్పే ఒకే ఒక్క మాట నిధులు లేవు. మీరు అవసరమైన సొమ్ము చెల్లిస్తే మీ పని చేసిపెడతామంటారు. ఇప్పటి ట్రెండ్ ఇది. అధికారంలోకి వచ్చిన పార్టీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులను పక్కదారి పట్టిస్తుంది. అన్ని విభాగాలకు కేటాయింపులైతే చూపిస్తారు. కానీ వాటిని హామీల అమలుకు అనధికారికంగా వినియోగిస్తారు. పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు విడుదలయ్యే నిధులకూ ఇదే గతి. గట్టిగా అడిగితే, చట్టంలో లొసుగుల్ని వాడుకుంటారు. ఎక్కే మెట్టు… దిగే మెట్టూ ఎందుకని మనం ఖర్చు పెట్టి, పనులు చేసుకుంటే కనీసం సౌకర్యాలైనా ఉంటాయనే భావంతో కొన్ని కాలనీలు రాజీ పడుతున్నాయి. అక్కడితో వారి సమస్య నివారణ అవుతుంది. ఇక్కడే అసలు మేజిక్ మొదలవుతుంది. కాలనీలపరంగా ప్రజలూ లేదా బిల్డర్లు చేసుకున్న పనులకు స్థానిక సంస్థలు టెండర్లు వేసుకుంటాయి. ఆ తరవాత ఏం జరుగుతుందో చెప్పకండా ఉండడం నా ఒంటికి మంచిది.


హైరార్చిని అనుసరించలేదో….
మంచి చేస్తున్నామనే ముసుగులో సాగే అభివృద్ధి కార్యక్రమాలకు మనతోనే ఖర్చు చేయిస్తున్నారనే విషయం మనకు అర్ధం కానంతవరకూ ఇదే కొనసాగుతుంది. ఏ పార్టీ ప్రభుత్వమైనా దీనికి అతీతం కాదు. పీత కష్టాలు పీతవి అనే సామెత ఇక్కడ చక్కగా అతికినట్టు సరిపోతుంది. ఇక్కడ మనం మరొక విషయం ప్రస్తావించుకోవాలి. ఏదైనా సమస్య మీద హైరార్చిని అనుసరించి వెడితే…. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళదు కాక వెళ్ళదు. ఒకవేళ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, కింది అధికారులకు కోపం. మమ్మల్ని కాదని వెడతావా, నీ పని ఎలా అవుతుందో చూస్తామంటారు. ఈ పరిస్థితిని గమనించి, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాధీశునికి మహాజరు సమర్పిస్తే…. నువ్వు సిస్టం ఫాలో అయ్యావుగా మేము కూడా అదే పద్ధతిని అనుసరిస్తామని నవ్వుతూ బెదిరింపు ధోరణి కనపరుస్తారు.


పర్యవసానం ఎలా ఉంటుందనడానికి సాక్ష్యం
పర్యవసానం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా… మన పనులు కావు. అది తాగునీటి సమస్యైనా…. మురుగు నీటి పారుదలైనా, వీధి దీపాలైనా, రోడ్ల సౌకర్యమైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఇందులో ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శిల్ప కాలనీ వైపు చూడండి చాలు. తీరిపోతుంది. 2019 లో ఇక్కడ భవంతుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 25 ఏళ్ల తరవాత ఇక్కడ పురోగతి ప్రారంభమైంది. వ్యక్తిగత స్థలాలను బహుళ అంతస్తుల భవనాలకు యజమానులు ఇచ్చారు. అంతకు ముందు ఇక్కడ వెంచర్ వేసిన వారు అందుకు అనుగుణంగా డ్రైనేజీ ఏర్పాటు చేశారు. రోడ్లు వేశారు. బహుళ అంతస్థుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణం కావడంతో పాత మౌలిక సౌకర్యాలు అక్కరకు రాకుండా పోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పార్కులో ఉన్న ఎస్.టి.పి. నిండిపోయి, మురుగుకూపంగా మారింది. అప్పటికి ఉన్న కాలనీవాసులు ఆందోళన చేసి, అధికారులు, రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచారు. అప్పటి కమిషనర్ శ్రీమతి సుజాత, మునిసిపల్ చైర్మన్ శ్రీ పాండురంగారెడ్డి చొరవ తీసుకున్నారు. బిల్డర్లతో మాట్లాడి కొత్త డ్రైనేజీ లైన్ వేయడంతో సమస్య పరిష్కారమైంది.


ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంటర్నల్ డ్రైనేజీ కోసం కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఒక వీధిలోని వారు సొంత డబ్బులు ఖర్చు చేసి మెయిన్ డ్రైనేజీకి కలుపుకున్నారు. ఒక బిల్డర్ మాటతప్పిన కారణంగా వారిపై రెండు లక్షల రూపాయల అదనపు భారం పడింది. ఆ మొత్తాన్ని రాబట్టడానికి ఇప్పటికీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.


మంచినీటిపై పీటముడి…
మరొక ముఖ్యమైన సమస్య మంచినీరు. ఈ సమస్య తీరడానికి చేయని ప్రయత్నం లేదు. ట్వీట్స్ కు స్పందించి రంగంలోకి దిగిన హెచ్.ఎం.డబ్ల్యు,ఎస్.ఎస్.బి. అధికారులు, ఇంత కాలనీకి తాము పైప్ లైన్లు వెయ్యలేమని చేతులు ఎత్తేశారు. సంబంధిత మంత్రి సీతక్క గారి నుంచి సిఫార్సు లేఖను సమర్పించిన, ఉన్నతాధికారుల మనసు మెత్తబడలేదు. పైప్ లైన్లు వేయాలంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
హై కోర్టుకు విన్నవించినా…
మంచినీరు జీవనాధారం కాబట్టి, తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తికి కాలనీ వాసులలేఖ రాశారు. ఈ చర్యతో కాలనీ నీటి సమస్యకు మరింత పీట ముడి పడింది. మమ్మల్ని అడిగి మీరు, హై కోర్టు తలుపు తడతారా అని అధికారులు ఆగ్రహించారు. తరవాత ఎం.పి. రఘునందనరావు గారిని కూడా కలిసి సమస్య విన్నవించారు. ఆయన కూడా ఎం.డి.తో మాట్లాడానని మరికొంత సమయం పడుతుందనీ తెలిపారు. మంచినీటి లైన్లు వేసుకుంటే తప్ప రోడ్లు వేసుకోలేని స్థితి. రోడ్లు వేసుకోకపోతే, నడవడానికి కూడా వీలులేని దుస్థితి. ఇది కాలనీ వాసుల దుర్గతి.

మేము చేసిన భగీరథ విఫల యత్నం
శిల్ప కాలనీకి నీటిని అందించాలని మేము మా వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి రాజేశ్వరి గారి ద్వారా బోర్డుకు లేఖ రాశాము. మరుసటి రోజునే… నీటి సరఫరా చేసేందుకు వీలుగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి స్థలం చూపించమని బోర్డు నుంచి లేఖ అందింది. మా కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందని మేము జవాబు ఇచ్చిన రెండో రోజున అప్పటి ఆపరేషన్స్ అండ్ మైంటెనెన్సు జి.ఎం. శ్రీ నారాయణ, ఇతర అధికారులు కాలనీని పరిశీలించారు. ఆ తరువాత ముందడుగు లేకపోవడంతో మునిసిపల్ చైర్మన్, కమిషనర్లను కలిసాం.

మంచి నీటి సరఫరా తమ పరిధిలో లేదని వారు స్పష్టం చేశారు. దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సీఎం గారికి, సంగారెడ్డి కలెక్టరు గారికీ, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎం.డి. గారికీ లేఖలు రాశాము. అప్పుడు దాదాపు ఐదు కోట్ల మేర ఎస్టిమేషన్ వేసి, ఆ మొత్తాన్ని మేమే భరించాలని అడిగారు. అంత సొమ్ము మేము చెల్లించలేమని, కనెక్షన్ చార్జీలను ముందే చెల్లిస్తామని చెప్పాము. దానికి కూడా అధికారులు అంగీకరించలేదు. ఎం.డి. గారిని కూడా కలిశాము.

పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా మంత్రి సీతక్క గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లగా, ఆమె టేక్ నేససరి యాక్షన్ అని రాసి ఇచ్చారు. అయినా అధికారుల దగ్గర నుంచి అదే మాట. మేము పూర్తి మొత్తం చెల్లించాలని. వర్షాకాలంలో సైతం రాష్ట్ర రాజధానిలో నీళ్ల ట్యాంకర్లను కొనుగోలు చేసే కాలనీ మా ఒక్కటే అయి ఉంటుంది. మా కాలనీకి రెండు వైపులా రెండు గేటెడ్ కమ్యూనిటీలు గ్రౌండ్ వాటర్ ను పీల్చేస్తున్నాయి. ఆ ప్రభావం వల్ల మా బోర్లు ఎండిపోతున్నాయి. ఈ సత్యాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.


ఇదే అంశాన్ని హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎం.డి. శ్రీ అశోక్ రెడ్డి వద్ద ప్రస్తావించినప్పుడు… నీటి సరఫరాకు కొంత సమయం పడుతుందని బదులు ఇచ్చారు. సమస్యను అర్ధం చేసుకోగలనని చెప్పారు. తన పరిధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.


బోర్డు పరిధి ఎంతంటే….
హెచ్.ఎం.ఎస్.ఎస్.డబ్ల్యు.బి. పరిధి 1450 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పది వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసి మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఏడు వేల కిలోమీటర్ల మేర సెవెరజ్ లైన్లు ఉన్నాయి. మొత్తం ఆరు లక్షల మాన్ హోల్స్ ఉన్నాయి. వీటిలో చాలా మేరకు కాలం చెల్లినవే. జంట నగరాలకు దాదాపు 160 కిలోమీటర్ల దూరం నుంచి మంచి నీటిని బోర్డు తీసుకు వస్తోంది. సరఫరా చేసే వాటిలో 70 శాతం నీటిని ప్రభుత్వ విధానం ప్రకారం ఉచితంగా అందిస్తోంది.
సమస్య పచ్చిగా ఉంటేనే…
సమస్య పచ్చిగా ఉంటేనే… రాజకీయ నాయకులకు పబ్బం గడుస్తుంది. ఓట్ల వర్షం కురుస్తుంది. సామాన్య ఓటరుకు చిన్న చిన్న తాయిలాలు అప్పుడప్పుడు ఇస్తే చాలు. మహదానంద పడిపోతారు. ఇది రాజకీయనాయకులు ఎరిగిన సత్యం. వారి మాటలకు పడి ఉండడం మన నైజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...