బంధానికి – అనుబంధానికి అర్థం ఈ ‘జ్ఞాపకాలు’

0
74

(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
మనసుకు హత్తుకునే కథలు కరవైపోయిన ఈ రోజుల్లో ఈటీవీ విన్ కథాసుధ ఆ లోటును తీరుస్తోంది. తాజా ఎపిసోడ్ జ్ఞాపకాలు దీనికి ఉదాహరణ. ఆలిండియా రేడియోలో నాటికలను ఇవి స్పురణకు తెస్తున్నాయి.

అరగంటలో ముగిసే ఈటీవీ విన్ కథాసుధ భాగాలు చాలామటుకు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజా ఎపిసోడ్ పల్లెటూరు నేపథ్యంలో నిర్మించారు. జ్ఞాపకాలకు అర్ధం చెప్పారు. ఇక్కడ కథ ఎలా సాగిందనేది ప్రధానం కాదు. కారణం ఆ కథలో మనం లీనమైపోతాం. రావులపాలెం అరటి మార్కెట్ గోదావరి సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది.

గ్రామంలో ఉన్న తన ఇంట్లోని పాత వస్తువులను పట్నంలో ఉన్న సొంత ఇంటికి ఒక యువకుడు తరలించే అంశంతో ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అన్ని సామాన్లు వాహనంలో ఎక్కించాక, ఒక పోపుల పెట్టె పట్టుకుని తన మేనత్తతో ఆ యువకుడు సాగించిన సంభాషణ ఆత్మీయతకు అద్దం పట్టింది. మీ అమ్మ గుర్తుగా ఈ పోపుల పెట్టె నాకు ఇచ్చెయ్యరా అన్నప్పుడు ఆ యువకుడు చెప్పిన డైలాగ్ మనసును కదిలిస్తుంది.

ఎపిసోడ్ ప్రారంభంలో డ్రోన్ తో చిత్రీకరించిన గ్రామ దృశ్యాలు కనువిందు చేశాయి. ముగ్ధ మనోహర దృశ్యాలపట్ల డైరెక్టరు సతీష్ వేగేశ్నకు ఉన్న అనురక్తి వెల్లడైంది. కథలో దృశ్యాల చిత్రీకరణ ఒక ఎత్తైతే… గ్రామసీమల అందాలను ఒడిసిపట్టుకోగలగడం మరొక ఎత్తు. కథనంలో మొత్తం అన్ని ఫ్రేమ్స్ ఆకట్టుకున్నాయి.

చిన్నతనం నుంచి చూస్తున్న సామాను, వస్తువుల పట్ల ఎలాంటి అనురాగం ఏర్పడుతుందో… వాటిని ఎలా అక్కున చేర్చుకోవాలని తపన కలుగుతుందో ‘జ్ఞాపకాలు’ చక్కగా వివరించింది. కుమారుడికి సైకిల్ నేర్పడం … తదుపరి తండ్రికి కుమారుడు మోపెడ్ కొనిచ్చి దగ్గరుండి డ్రైవ్ చేయించడం తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పింది. అన్ని సామాన్లను ఎక్కించిన తరవాత, ఇంకొక్కటి మిగిలిపోయిందంటూ సైకిలును చూపిస్తారు. అది శిధిలావస్థలో ఉంటుంది. దానిని బాగు చేయించడానికి వెళ్ళినప్పుడు, ఇద్దరి మధ్య జరిగే సంభాషణ పాత వస్తువులు వద్దని వదిలించుకునే వారికి కనువిప్పు కాగలవు.

తండ్రిగా ప్రభు తన పాత్రకు న్యాయం చేకూర్చారు. ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు ఆ కళ్ళలో ఆనందం చూసితీరాల్సిందే. మొత్తం మీద చూసుకుంటే, అటు మానవ సంబంధాలకూ.. ఇటు ‘జ్ఞాపకాల’కూ ఈ కథ అర్ధం చెప్పింది. సంగీతం ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది. పాట అనవసరం అనిపించింది. కథలో పట్టు, నటుల నటన ఈ లోపాలను పక్కన పెట్టేలా చేసింది.

చక్కని కథలను అందిస్తున్న ఈటీవీ విన్ బృందానికి, ప్రధానంగా డైరెక్టర్ సతీష్ వేగేశ్నకు అభినందలు చెప్పితీరాల్సింది. ఈ తరం చూసి నేర్చుకోవాల్సిన సెంటిమెంట్ ఇందులో ఎంతో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here