320 ఏళ్ళ గ్రామం
(వైజయంతి పురాణపండ)
రాజానగరం కథను సమాచారమ్ రాఘవరావు వ్రాసిన తీరు మామూలుగా లేదు. ఆర్. కె. నారాయణ్ మాల్గుడి అనే ఊరు గురించి చెప్పినట్లు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘అనుభవాలు జ్ఞాపకాలూ’ వ్రాసినట్లూ రాఘవరావు రాజానగరాన్ని మన కళ ముందుంచాడు. ఎంతమంది చరిత్రలు, ఎంత పరిశోధన… ఎన్నెన్ని జ్ఞాపకాలు… ఈ పుస్తకం చదివాక నేనెందుకు రాజానగరం వాడిని కాలేకపోయానా అని అనిపిస్తుంది ఎవరికైనా… అంటూ రాజా నగరం పుస్తకం గురించి ప్రశంసించారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు.
రాజానగరం మీద పుస్తకం తేవటం రాఘవరావు మీద బాధ్యతను ఇంకా పెంచింది. తన కార్యస్థానమైన రాజమండ్రి మీద పుస్తకం వ్రాయకుండా ఇక తప్పించుకోలేడు రాఘవరావు అంటూ ఉండవల్లి రాఘవరావును కమిట్ చేయించేస్తున్నారు.
ఈ ఒక్కమాట చాలు రాజానగరం @320 పుస్తకం గురించి తెలుసుకోవటానికి. ఒక పుస్తకం చదివి ఊరుకోవటం కాదు, అటువంటి పుస్తకాన్ని ప్రేరణగా తీసుకుని, మనం పుట్టిన ఊరు గురించి రాయటానికి పూనుకోవాలి. అప్పుడే ఆయా ప్రదేశాల చరిత్ర అందరికీ తెలుస్తుంది. మీ ఊరి గురించి రాసేముందు ఈ పుస్తకాన్ని ఓసారి చదివేయండి.
రాజానగరం@320 అనే పుస్తకానికి కింద చిన్న అక్షరాలతో రాఘవీయం అని రాశారు. ఈ పుస్తకాన్ని రాఘవీయం అనే కోణంలో పరిశీలించితేనే మంచిది.
రచయిత: భమిడిపల్లి వీర రాఘవరావు (బి. వి. రాఘవరావు)
[email protected]
ఫోన్: 94901 86718
వెల: 99 రూపాయలు
పేజీలు:192