మిరాకిల్‌ మిరాయ్‌

0
384

(డా. పురాణపండ వైజయంతి)

సినిమా అంటే నటన..
సినిమా అంటే గ్రాఫిక్స్‌..
సినిమా అంటే అభూత కల్పన..
అందులో దెబ్బలు తగిలినా, రక్తం కారినా, ఏడ్చినా, నవ్వినా, విలన్‌తో ఫైట్స్‌ చేసినా…
అంతా పూర్తిగా అవాస్తవమే..
అన్నీ తెలిసినా..
థియేటర్‌లో సినిమా చూస్తుంటే మనకు తెలియకుండా ఒక భావోద్వేగానికి లోనవుతాం.
ఒకసారి కంట నీరు చిందిస్తాం.
ఒకసారి పెదవుల మీద చిరునవ్వులు చిందిస్తాం.


ఒకసారి ప్రతి నాయకుడిని నిందిస్తాం.
అది సినిమా గొప్పతనం.
అది దర్శకుడి ప్రతిభ
అది ఎడిటింగ్‌ చేసేవారి నైపుణ్యం.
అది నటీనటుల నటన.
ఇంత నేపథ్యం మిరాయ్‌ గురించి.
మిరాయ్‌ ఒక కల్పిత గాథ.


అయినా ఆ కథలో తన్మయత్వం చెంది, ఆ ప్రదేశాలలో మనమే ఉన్నట్లు భావించుకునేలా కట్టిపడేశాడు దర్శకుడు.
దర్శకుడిని సినిమా అనే షిప్‌కి కెప్టెన్‌ అంటారు.
నటీనటులు తమ ప్రతిభతో సినిమా ఆడిందని చొక్కాలు చించేసుకోకూడదు. ఒక దర్శకుడైనవాడు ఒక నటుడిని శిల్పంలా మలుస్తాడు. అలనాటి నటి వాణిశ్రీ, ‘నేను ఇండస్ట్రీ చెక్కిన శిల్పాన్ని’ అని నిజాయితీగా చెప్పారు.
ఇక మిరాయ్‌ విషయానికొస్తే…
తారల అందాల ఆరబోతలు, ఐటెమ్‌ సాంగ్స్, హీరోయిజం ప్రదర్శించేలా స్టంట్స్, హీరోని పొగుడుతూ పాటలు… లాంటి మూస నుండి బయటకు వచ్చి మంచి సినిమాలు అందిస్తున్నారు ఇటీవలి దర్శకులు. ఎటువంటి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్, వందమంది జూనియర్‌ ఆర్టిస్టులతో డ్యాన్సులు చేయడాలు, హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌లు… వీటన్నిటికీ దూరంగా మంచి సినిమా అందించారు దర్శకుడు ఘట్టమనేని కార్తిక్‌.


మంచు మనోజ్, తేజ సజ్జల చేత పోటాపోటీగా నటింపచేశారు. సినిమాలో చాలాసార్లు నిలబడి రెండు చేతులు జోడించి తప్పట్లు కొట్టాలనిపించేలా హృద్యంగా నడిచాయి సన్నివేశాలు. సినిమా చివరలో రాముడిని చూపించినప్పుడు కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు ఆనందంతో బయటకు రాకుండా ఉండవు.

సంపాతిని చూస్తుంటే రామాయణ కాలంలోకి వెళ్లిపోతాం. ఇంతటి మంచి పాత్ర చిత్రణలతో ఈ దర్శకుడు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. దర్శకుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా ఎడిటింగ్‌ చేసిన శ్రీకరప్రసాద్‌కి హ్యాట్సాఫ్‌.
ఒకే ఒక్క లోపం..


హీరోయిన్‌గా వేసిన అమ్మాయి ముఖంలో ఎటువంటి భావం కనపడలేదు. అదేవిధంగా డబ్బింగ్‌ కూడా ఒకే మాడ్యులేషన్‌లో వెళ్లింది. ఇవేవీ సినిమా మన మనసుకు చేరడానికి ఆటంకాలు కావు. కాని ఈ చిన్న లోపం లేకపోతే బావుండేదని అనిపించింది.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here