(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. భారత జట్టును విజయతీరాలకు నడిపించారు ఆ ఇద్దరూ. లక్ష్యం పెద్దదేమీ కాదు. 200 . కానీ అది చిదంబరం స్టేడియం, చెన్నై. స్పిన్ కు అనుకూలం. పైగా సముద్ర తీర మైదానాలలో భారత జట్టు తడబడుతుంది అనే పేరుంది. అందుకు తగ్గట్టుగానే రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. స్టేడియం అంతా సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం. భారత అభిమానుల గుండెల్లో ఏదో అలజడి. నిలబడి కొడతారా… కుప్పకూలుతారా అనే ప్రశ్నలు మదిని తొలుస్తుండగా విరాట్ కోహ్లీ కె.ఎల్. రాహుల్ కు తోడయ్యారు. పరుగుకు… పరుగును జోడిస్తూ సాగారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆచితూచి ఆడారు. అవకాశం వచ్చినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపారు. కోహ్లీకి లైఫ్ లభించడం మ్యాచ్లో భారత్ కు టర్నింగ్ పాయింట్. చెన్నైలో జరిగిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఆదివారం తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ పిచ్ స్వభావం అర్ధం చేసుకునేలోగా వికెట్లు టపటపా రాలాయి. 199 పరుగులకు ఆ జట్టు పెవిలియన్కు చేరింది. స్టీవెన్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేశారు. వార్నర్ 41 పరుగులు సాధించారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు, బుమ్రా, కులదీప్ యాదవ్ రెండేసి వికెట్లు, సిరాజ్, పాండ్య, అశ్విన్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగుకు దిగిన భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కె.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడుతూ జట్టును గట్టెక్కించారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఖాతా ప్రారంభించకుండానే అవుటయ్యాడు. దీనితో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. విరాట్ కోహ్లీ 85 పరుగులకు జట్టు స్కోరు 167 వద్ద అవుటయ్యాడు. ఈ దశలో కె. ఎల్. రాహుల్ (96 )కు హార్దిక్ పాండ్య జత కలిసాడు. హార్దిక్ పాండ్య ఒక సిక్సర్ తో 11 పరుగులు చేసాడు.