తెలుగు రచయితల మహా సభలు
ఉషశ్రీ చేసిన సూచనలు
తెలుగు రచయితల మహాసభలు – కొన్ని సూచనలు (కృష్ణా పత్రిక 1962 డిసెంబర్ 29)
అఖిలభారత తెలుగు రచయితల మహాసభలు తొలిసారిగా రాజధాని పౌరులకు గర్వకారణమైతే, అది జరిగిన రెండు మూడు సంవత్సరాలకి ద్వితీయ మహాసభలను రాజమహేంద్రవరంలో జరపడం ఆంధ్రజాతికే గర్వకారణం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో రాజధాని నగరానికి ప్రాధాన్యం లేకపోయినా ఆంధ్ర రాజధానిలో ఆంధ్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రధమ మహాసభలు జరగడం ఒక విశిష్ట సాంప్రదాయానికి సంకేతమైంది. అయితే ఆ మహాసభలు జరిగినప్పుడు దేశం ప్రశాంత వాతావరణంలో ఉన్నది. అందుచేత నిర్వాహకులకు సర్వవిధ సహాయం, సర్వ రంగాల నుండి లభించింది. ఈనాడు మహాసభలు రాజధానిలో జరగడం లేదు. రాజకీయంగా పాలన యంత్రం దృష్ట్యా హైదరాబాద్ ఆంధ్ర రాజధాని అయినా సాహితీపరులకు ఆది నుండి రాజమహేంద్రవరమే రాజధాని. రాజరాజ నరేంద్రుని కొలువులో నన్నయ్య భట్టారకుడు ఆంధ్ర మహాభారతానికి శ్రీకారం చుట్టినదాది రాజమహేంద్రనగరం సాహితీ తపస్సులకు కేంద్రంగానే ఉంటున్నది. ఆధునిక సారస్వత ప్రక్రియలకన్నిటికీ అంకురార్పణ చేసిన వీరేశలింగం పంతులును ప్రభవించిన ఖ్యాతి కూడా దానిదే. నన్నయనాటి నుండి నేటి వరకు ఉత్తమ సాహితీ వ్రతులను ప్రభవిస్తున్న రాజమహేంద్రవరంలో ఈ మహాసభలను జరపడానికి యత్నించడం అభినందనీయం. రెండున్నర పర్వాల భారతం వ్రాసిన నన్నయ నుండి భారత రామాయణ భాగవతాది మహాపురానణేతిహాసాలను ఒక్క చేతి మీద వ్రాసిన ద్వితీయాంధ్ర ఆస్థాన కవి కీ. శే. కృష్ణమూర్తి శాస్త్రి వరకు రాజమహేంద్రవరంలో వర్ధిల్లిన సాహితీ లోకములను తెలుగుజాతి మరువలేదు. వారే కాక వర్తమాన యుగంలో సైతం జానపద కథ కావ్య రచనకు ప్రసిద్ధులైన కవికొండల వెంకటరావు గారు అక్కడివారే. నవ్యాంధ్ర పంచ కావ్య శ్రేణిలో నిలచిన ఆంధ్ర పురాణం వెలువడుతున్నది ఈ రాజమహేంద్రవరం నుంచి.
తెలుగు కథా జగత్తులో కరుణ రసాన్ని జాలువార్చి కథక భవభూతిగా విరాజిల్లుతున్న జమదగ్ని ఈ గోదావరి తీరావాసి అయినాడు. ఈ విధంగా ఎన్నైనా ఉటంకించవచ్చు. నన్నయ నుండి నేటి వరకు బహుముఖ కావ్య సాహితీ పారిజాత నందనంగా పరిమళించుచున్న రాజమహేంద్రవరంలో జరుగనున్న ద్వితీయ మహాసభలను గూర్చి కొద్దిగా వివరాలు, సూచనలు ఇవ్వడం అవసరమని అభిప్రాయపడుతున్నాను. శాంతి సూత్రాన్ని, అహింసా దండాన్ని ధరించిన భారతదేశంపై చైనా కబంధహస్తాలు జాపిన విషమస్థితిలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. వీటికి పూర్వ మహాసభలకు వలె ప్రభుత్వం నుండి విరాళాలు లభించడం సాధ్యం కాకపోవచ్చు. అయినా దేశంలోని సాహిత్య ప్రియులు, అభిమానులు విరివిగా విరాళాలు ఇచ్చి కానీ, ప్రతినిధులుగా చేరి కానీ సభలను జయప్రదం చేయవచ్చు. సాహిత్య సభలు జయప్రదం కావడానికి విరాళాల కంటే వ్యక్తుల సౌమనస్యాలే ముఖ్యం. దేశం విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు సన్మానాలు కావాలని ఏ రచయిత కోరడు. ముఖ్యంగా రచయితలందరూ ఒకే వేదిక మీద సమావేశమై ఏక కంఠంతో దేశం ఎదుర్కొంటున్న విపద్దశలో తమ కర్తవ్య నిర్వహణకు ప్రతిజ్ఞ తీసుకోవాలి. రక్తదానం ధనవిరాళం చేయడం రచయిత కర్తవ్యం కాదని నేనను కానీ, అంతకంటే మహత్తరమైన బాధ్యత వీరిపై ఉన్నది. స్వాతంత్రం సిద్ధించింది మొదలు ఏ బాధ్యత లేకుండా హాయిగా నిద్రపోతున్న జాతిని మేలుకొలపడం నేడు రచయిత కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణకు ఒక కార్యక్రమాన్ని రాజమహేంద్రవర వేదిక నిర్దేశించడం అవసరం.
౼ ఉషశ్రీ