సామాజికవేత్తగా అచంచలమైన కృషి
మహిళలందరికీ ఆదర్శం ముర్ము
రాష్ట్రపతికి పౌరసన్మాన సభలో ఏపీ సీఎం
విజయవాడ, డిసెంబర్ 4: ఆంధ్ర ప్రదేశ్‌కు తొలిసారి రాష్ట్రపతి హోదాలో విచ్చేసిన ద్రౌపది ముర్ముపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సామాజికవేత్తగా అచంచలమైన కృషి చేసిన ముర్ము ఉదాత్త జీవితం దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తన గ్రామంలోనే డిగ్రీ పూర్తిచేసుకున్న తొలి మహిళ ద్రౌపది ముర్ము అని పేర్కొన్నారు. ముర్ముకు ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. ఆదివారం ఉదయం ఆమె గన్నవరం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆమెకు స్వాగతం పలికారు. పోరంకిలో జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
ఇవాళ గొప్ప రోజు….
ఇవాళ చాలా గొప్ప రోజు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టం అన్నది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికీ కూడా గర్వకారణం. రాష్ట్రపతిగా తొలిసారిగా మన రాష్ట్రానికి వచ్చిన శ్రీమతి ముర్ముగారిని గౌరవించడం మనందరి బాధ్యతగా భావించి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.
ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా శ్రీమతి ద్రౌపతి ముర్ము ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయం.
దేశంలో ప్రతి మహిళకూ ఆదర్శనీయులు….
రాజ్యాంగపరంగా నిర్ధేశించిన అర్హతలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అన్నదానికి ద్రౌపతి ముర్ము ఒక గొప్ప ఉదాహరణగా దేశచరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతారు.
మేడమ్ జీవితంలో మీరు పడ్డ కష్టాలను చిరునవ్వుతోనే స్వీకరించి, సంకల్పంతో మీరు ముందుకు సాగిన తీరు ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఆదర్శనీయంగా నిలుస్తుంది. ఒడిషాలో అత్యంత వెనుకబడి మయూరుభంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన మీరు ప్రాధమిక విద్యను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన మీరు భువనేశ్వర్ వెళ్లి అక్కడే బీఏ పూర్తి చేశారు. మీ గ్రామానికి సంబంధించినంతవరకు కాలేజీ వరకు వెళ్లి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ మీరు కావడం అప్పట్లో ఓ విశేషం.
జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం
తర్వాత ఇరిగేషన్, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అక్కడ నుంచి కౌన్సిలర్‌గానూ, తొలిసారిగా 2000 సంవత్సరంలో రాయరంగపూర్ అసెంబ్లీ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 2009 వరకు కూడా అదే పదవిలో కొనసాగుతూ.. ఒడిషా ప్రభుత్వంలో వాణిజ్య సహాయమంత్రిగాను, స్వతంత్య హోదాలో మత్స్య, పశుసంవర్ధకశాఖమంత్రిగానూ పనిచేశారు. ప్రజా సేవలోనే మీ చిత్తశుద్ధి, మీ కార్యదీక్షకు, మీ నిజాయితీకి మిమ్నల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లి… 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులు కావడం… ఆ తర్వాత ఇప్పుడు మన దేశ రాష్ట్రపతిగా మన రాష్ట్రానికి తొలిసారిగా రావడం మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం.
మహిళా సాధికారతకు మీరు ప్రతిబింబం…
నిష్కళంకమైన మీ రాజకీయ జీవితం, మీరు ఎదిగిన తీరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శనీయం. మహిళా సాధికారతకు మీరు ఒక ప్రతిబింబం. ప్రతి మహిళా కూడా మీలానే స్వయంసాధికారత సాధించాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాలని కాంక్షిస్తూ.. ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది. మీలాంటి వ్యక్తుల నుంచి వారు మరింత చైతన్యం పొందుతారని, ఈ ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు వారి జీవితాల్లో మరిన్ని మార్పులు తీసుకువస్తాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను.
రాష్ట్రపతి పదవికి మీరు వన్నె తీసుకువస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ దేశ ఖ్యాతిని మరింత పెంచడంలో మీరు తప్పక దోహద పడతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.