Wednesday, December 6, 2023
Homeతెలంగాణ వార్త‌లుతెలంగాణ‌కు సంక్షేమంలో సాటి రాలేరెవ‌రు

తెలంగాణ‌కు సంక్షేమంలో సాటి రాలేరెవ‌రు

పాల‌మూరు ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్‌
స‌మీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయం ప్రారంభం

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, డిసెంబ‌ర్ 4: తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలలో సాటి గాని పోటీగాని ఎవరు లేరని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స్ప‌ష్టంచేశారు. ఏడేళ్ళ‌ క్రితం రాష్ట్ర బ‌డ్జెట్‌ కేవలం 60 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడ‌ది రెండున్నర లక్షల కోట్లకు పెరిగింది. 2 లక్షల 10వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. ఏడెండ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి కరెంట్ బాధలను అనుభవించిన తెలంగాణ ఈ రోజు దేశానికే తలమానికంగా తయారైందని తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రంలేదని, దేశంలో సగటు కూడ సమీపంలో లేని విధంగా, ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వ పడుతున్న అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు అని, అలాంటి ఆలోచనలు కూడ ఎవరికి రావు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు . దీనంతటికి కారణం మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకితభావంతో పని చేసినటువంటి ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల కృషి వల్లనేనని సిఎం అన్నారు . ఇంతటి గొప్ప అద్భుత ఆవిష్కరణలలో కృషి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు .
మహబూబ్ నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరేట్ ను ప్రారంభించారు. కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు కు సీఎం అభినందనలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నిర్మాణంలో బాగస్వాములైన ఇంజనీరింగ్ అధికారులను సిబ్బందిని సీఎం సన్మానించారు. అనంతరం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు కలెక్టరేట్ సిబ్బంది హాజరైన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో మహబూబునగర్ కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు టి.ఆర్.ఎస్ శ్రేణులు దారి పొడవునా పూలతో ఘనంగా స్వాగతం పలికాయి. కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్ , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , మల్లారెడ్డి , ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, మన్నె శ్రీనివాస్ రెడ్డి , పోతుగంటి రాములు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి , కూచుకుల్ల దామోదర్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , సురభి వాణి దేవి , గోరటి వెంకన్న , కాటేపల్లి జనార్దన్ రెడ్డి , ఎమ్మెల్యేలు సి లక్ష్మారెడ్డి , అంజయ్య యాదవ్ , గువ్వల బాలరాజు , మర్రి జనార్దన్ రెడ్డి , జి. జైపాల్ యాదవ్ , ఆల వెంకటేశ్వర్ రెడ్డి , బీరం హర్షవర్ధన్ రెడ్డి , బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , వి. అబ్రహం , పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి , చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బాల్క సుమన్, దానం నాగెందర్, మాగంటి గోపినాద్, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కారోపరేషన్ల చైర్మన్లు వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గుప్త, సీఎం సెక్రెటరీ స్మీతాసబర్వాల్, కలెక్టర్ వెంకటరావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బీసీ కమీషన్ మాజీ సభ్యుడు ఆంజనేయ గౌడ్, ఆర్.ఎండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుధ్ధాల సుధాకర్ తేజ తదీతరులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే..


నాడు పాలమూరు జిల్లా ఎండిపోయింది..నేడు ధాన్యరాశులతో నిండిపోతున్నది … తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లాలో పర్యటించినప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు గురించి మాట్లాడుతూ
‘‘ఆ రోజుల్లో ఫ్రొఫెసర్ జయశంకర్ గారు నేను మిత్రుడు లక్ష్మా రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ వెళ్ళి వస్తావుంటే నవాపేట మండలంలో చిన్న పాటి అడవి ఉంటది . అమ్మవారి గుడి దగ్గర. నేను జయశంకర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ లక్ష్మారెడ్డి గారితో అన్నాము. ఏమండి లక్ష్మారెడ్డి గారు డాక్టర్ గారు మీ జిల్లాలో చెట్లు కూడ బక్కగా అయిపోయని ’’ ఇదేం అన్యాయం అనిజెప్పి మాట్టాడుకుంటూ వచ్చాం’’ అనే సంధర్భాన్ని సిఎం కేసిఆర్ గుర్తు చేసుకున్నారు. తొలినాళ్ళ‌లో మాజీ ఎమ్మెల్యే, మాజీ సమితి ప్రెసిండెంట్, ఉత్తమ మైన ప్రజా నాయకుడు కీ.శే.ఎడ్మ కృష్ణారెడ్డి వారి కొడుకు ఎడమ సత్యం అప్పుడు జెడ్పిటిసి ఎన్నికల్లో పోటి జేస్తే నన్ను రమ్మని పిలస్తే, నేను వరంగల్ నుండి చాలా దూరం లో ఉన్నాను కాబట్టి హెలికాప్టర్ లో వచ్చిన. వచ్చే క్రమంలో మొత్తం నల్లగొండ, దేవరకొండ ,మునుగోడు కల్వకుర్తి మీదగా వచ్చినం, కిందకు చూస్తే ఎక్కడ చూసిన ఎండిపోయన ఎడారి ప్రాంతంలా కనబడిన నేలను చూసి కండ్లల్లో నీళ్ళు పెట్టుకుని బాధపడ్డం.


పాద‌యాత్ర అనుభ‌వాల‌తో ఒళ్ళు జ‌ల‌ద‌రింపు
నేను అలంపూర్ జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేస్తే ఆరోజు కూడ అనేక అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలదరించే పరిస్థితి. నడిగడ్డ లో ప్రజల పరిస్థితి చూసి మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు నేను అందరం కండ్లనీళ్ళు పెట్టుకున్నాము మేము ఏడవడమే కాదు ఆ రోజు ఊరంతా ఏడ్చారు . అప్పటి వేదనలు, రోద‌నలు గుండే అవిశిపోయే బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల గద్వాల శాసనసభ్యుడు క్రిష్ణమోహన్ రెడ్డి గారి తండ్రిగారు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎక్కడి వరకు దారి పొడవున ఎటుచూసిన పంట కోతలు కోసేటువంటి హర్వేష్టర్లు, ధాన్యం కల్లాలలో ధాన్యం రాశులు అమ్ముతున్నటువంటి రైతులను చూసి చాలా ఆనందపడుతూ పోయినం. ఏ తెలంగాణ కావాలని కోరుతున్నాము దేని కోసం అయితే పోరాటం చేసినమో అది ఆ బాట పట్టింది. ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించాలని ముందుకు పోతున్నం అని సిఎం కేసిఆర్ గతంలో తెలంగాణ పరిస్థితులను, ప్రస్థుత పరిస్థితులను పోల్చుతూ సాధిస్తున్న ప్రగతిని తెలియజెప్పారు.


చేసే మంచిప‌నులే మ‌న ఆస్తి
మనం చేసే మంచి పనులే మనకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే ఆస్థులుగా మిగిలిపోతాయి
అనేక విషయాలు చాల మందికి తెలియదు, ఎవ్వలం కూడా మనం వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదు, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకతను అటెండర్ పని చేయవచ్చు, ఒకాయన ఎమ్మార్వో కావోచ్చు,. ఆర్డివో కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావోచ్చు ఒకాయన చీఫ్ సెక్రటరీ కావచ్చు , మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావోచ్చు ఇవి శాశ్వతం కాదు ఎవరంకూడ అధికారంలో పొద్దాక ఉండం ఒక స్టేజ్ తర్వాత 30 ఏండ్ల తర్వాత మీరు కూడ రిటైర్డ్ కావాల్సిందే కాని మనం ఉన్నప్పుడు ఏం చేసినం అన్నదే అంతిమంగా మనకు అద్భుతమైనటువంటి వేల, లక్షల కోట్ల ఆస్తికి సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది . మేము ఉన్నప్పుడు ఇది చేసినం మా వల్ల ఇది కాగలిగింది అన్నదే పెద్ద పెట్టుబడి. జీవితానికి చివరికి మిగిలి ఉండేది గొప్ప సంతృప్తినిచ్చేది ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రమేనని సిఎం అన్నారు.
మహనీయుడు పివీ చూపిన మార్గం..మన గురుకులాలకు ఆదర్శం
అనేకమంది మహనీయులు అనేక రకాల కృషి చేసారు. బాటలు వేసినారు అనేక మార్గాలు మనం కూడ పట్టినం. పీవీ నరసింహారావు గారు తెలంగాణ గడ్డలో పుట్టి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్లారు, వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజులలో రెసిడెన్షియల్ పాఠశాలలే అద్భుతమైనటువంటి ప్రగతికి దోహదం చేస్తాయని అని జెప్పి నల్గొండ జిల్లా లో ‘సర్వేయల్’ అనే దగ్గర రెసిడెన్షియల్ పాఠశాల వారు స్వయంగా చోరవ తీసుకుని వారుపెట్టించారు. ఈరోజు మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా రాష్ట్ర డిజిపి స్థాయికి ఎదిగారంటే అది ‘సర్వేయల్’ స్కూల్ యొక్క పుణ్యం. ఒక మంచి బాట, ఒక మార్గం పివి గారి గురుకుల విద్య రెసిడెన్షియల్ స్కూల్ ఆదర్శంగా తీసుకుని మనం కూడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఒక వెయ్యి గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నాం, ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరికీ ఉపయోగపడే విధంగా స్థాపించుకున్నాం . గిరిజన, దళిత, మైనార్టీ సోదరులకు కావోచ్చు బిసి సోదరులకు కావచ్చు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా మరి కొన్ని బిసి సోదరుల రెసిడెన్షియల్ స్కూల్స్ విసృత పరచాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో ఈ మధ్య కొన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటుచేసుకున్నామని. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో పెంచాల్సిన అవసరం ఉందని రాబోయే సంవత్సరాలలో ఆ సంఖ్యను 3-4 రెట్లు పెంచుకుందామని సిఎం కేసిఆర్ అన్నారు.


‘కంటి వెలుగు’ పథకం రూపకల్పన వెనుక
అట్లాగే కొన్ని విషయాలు దయచేసి మనందరం గమనించాల్సి ఉందని సిఎం కేసిఆర్ అభిప్రాయ పడ్డారు. ‘కంటి వెలుగు’ పథకం రూపకల్పనకు దారితీసిన విషయాన్ని సిఎం కేసీఆర్ తెలియజేస్తూ ‘గజ్వేల్‌లోని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేద్దామంటే..ఊరివాళ్లకు మంచి విశ్వాసం కల్పించాలనే మంచి ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. ఆ చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువతలేరని స్కూల్‌లో టీచర్లు, ఇండ్లల్లో తల్లిదండ్రులు కొడుతున్నరు. దీనిపై చాలా బాధపడి ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. వాస్తవానికి చెప్పకూడనిది ఏంటంటే కంటి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందరికీ సరోజిని దవాఖాన ఒక్కటే. అంతకు మించి ఏమీ లేదు. అలాంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఆ తర్వాత చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చాం . అంతేకాని చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం తెచ్చింది కాదు కంటి వెలుగు అని సిఎం అభిప్రాయపడ్డారు. మళ్లీ రెండోదశ కార్యక్రమం కూడ చేపట్టబోతున్నామని జిల్లా కలెక్టర్లు, అధికారులు విజయవంతం చేయాలని సిఎం కోరారు.
మానవీయ కోణంలో ఆలోచనతోనే ‘‘ కేసీఆర్‌ కిట్‌ ’’
తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకు వచ్చిందే ‘కేసీఆర్‌ కిట్‌ అనే కార్యక్రమం అని సిఎం అన్నారు. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం ఉద్ధేశ్యం కాదు అని అన్నారు . టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయమని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలు గర్భం దాల్చిన తర్వాత కూడా ఉపాధి కోసం పని చేస్తునే ఉంటారు. పని చేస్తే ఆ గర్భిణులకు, జన్మించే శిశువు కు మంచిది కాదు. ఎందుకు పని చేస్తున్నరనే విషయంపై అధ్యయనం చేశాం. ధనవంతులు వాళ్ల బిడ్డలకు ఏమో ఇంట్లోని వాళ్లు శ్రీమంతాలు వగైరా పండగలు చేస్తారు. ‘ఈమె నీళ్లుపోసుకున్నదయ్య ఇప్పుడు కూసుండబెట్టి తిండిపెట్టాలే’.. ఇది పేదింట్లో వచ్చే మాట.. నేను కూడా పల్లెటూరులో పుట్టాను కాబట్టి.. నా చెవులతో విన్నకాబట్టి. ఎందుకంటే పేదరికం, దరిద్య్రం వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నది అని. కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే ఒకటి ఇనిస్టిట్యూషన్‌ డెలివరీలు ప్రోత్సహించాలి. మరొకటి మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతదో దాన్ని మనం ఇవ్వాలనేదే కేసీఆర్‌ కిట్‌ ఉద్దేశం అని సిఎం అన్నారు. అందుకోసం తీసుకున్న చర్యలలో భాగంగా ప్రభుత్వ అధికారి స్మితాసబర్వాల్‌తో పాటు మహిళా ఐఏఎస్‌ అధికారులను పలు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించామని . గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వాళ్లకు సంభవించే వేజ్‌ లాస్‌ను సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే భరించేలా కార్యక్రమాన్ని చేపట్టి, ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు పెరిగేలా అమ్మ ఒడి వాహనాలను తీసుకువచ్చాం. గర్భం దాల్చినప్పటి నుంచే సేవలు అందించడంతో పాటు మళ్లీ ప్రసవం అయిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ అందించి తల్లీ బిడ్డను ఇంటి వద్ద దింపి రావడం వంటి సేవలను అందించడం భారతదేశంలో తెలంగాణలోనే ఇది సాధ్యమవుతున్నది’ సిఎం అన్నారు.


సంఘటితంగా ప‌నిచేస్తే అద్భుత ఫలితాలు
‘ఏరకమైన కార్యక్రమం తీసుకున్నా మానవీయ దృక్పథంతో.. ప్రజలకు మేలు జరుగాలని. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేధోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అని సిఎం అన్నారు. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు.ఎప్పటికప్పుడు మేధో మధనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి సంఘటితం అయి పని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఏడేళ్ల కిందట మన బడ్జెట్‌ ఎందో తెలియదు, ఎకనామిక్‌ ట్రెండ్‌ ఏంటో తెలియదు. మనకు శాపాలు పెట్టిన వారున్నారు.. దీవెనలు పెట్టిన వారున్నారు. ఇప్పుడు మనముందున్నది అందరి సమష్టి కృషి ఫలితం అని సిఎం కేసిఆర్ అన్నారు.
పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుందని. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రజలను కాపాడాటానికి, ప్రజల పురోగమనానికి మనం ఉపయోగపడుతూ ముందుకు సాగాలని ఈ ఎనిమిదేండ్ల ప్రస్థానంలో అందించిన సహకారం మీరు ఇకముందు కూడ అదేవిధంగా అందించాలని, మనం కలిసి ముందుకు పోదాం మేము సిద్దంగా ఉన్నాం అని తెలియజేసిన ఛీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాగానికి మరొకసారి నూతన పరిపాలనభవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్న ” అని సిఎం కేసిఆర్ గారి తన ప్రసంగాన్ని ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ