ఆదర్శ జర్నలిస్టు కె.ఎల్.రెడ్డి

Date:

(ఎంవీఆర్ శాస్త్రి)
ఎందరో జర్నలిస్టులను తయారుచేసిన సీనియర్ జర్నలిస్టు కె.ఎల్.రెడ్డి ఈ తెల్లవారుఝూమున వరంగల్ లో ప్రశాంతంగా కన్నుమూసినట్టు మిత్రులు మాడభూషి శ్రీధర్ తెలిపారు. ఆయన వయసు 92.
ముక్కు సూటితనానికి మారు పేరు కె.ఎల్. రెడ్డి. 1978 ఫిబ్రవరి లో నేను ఈనాడులో చేరిన వెంటనే రామోజీరావు గారు అప్పజెప్పిన మొదటి పని న్యూస్ బ్యూరో లో అప్పటి బ్యూరో చీఫ్ ఎస్.ఎన్. శాస్త్రి గారికి సహాయంచేయమని. అవి అసెంబ్లీ ఎన్నికల రోజులు. శాస్త్రి గారి ఇంగ్లీషు రిపోర్టులను నేను తెలుగులోకి మార్చి ఎదురుగా ఉండే డెస్క్ కు పంపుతుండేవాడిని. డెస్క్ ఇన్ చార్జి కె.ఎల్.రెడ్డి .నాలుగురోజుల తరవాత కేంటీన్లో పరిచయం చేసుకుని “నీకు భాష ఉంది. కాని రాయ రాదు. నా దగ్గర ట్రెయినింగు తీసుకో . నేర్పిస్తా ” అన్నాడు. ట్రెయినింగు అయితే తీసుకోలేదు కాని డెస్క్ లో పనిచేసిన కాలంలో అతడిని చూసి చాలా నేర్చుకున్నాను.
తరవాత నేను ఆంధ్రభూమి ఎడిటర్ అయి చాలా ఏళ్లు గడిచాక కె.ఎల్.రెడ్డి కలిశాడు. “నాకు రాయరాదు అని 1978 లోనే గుర్తించిన వాడు” అని మా స్టాఫ్ కు పరిచయం చేశాను. “అప్పుడే కాదు . ఇప్పటికీ నీకు రాయరాదు” అని మొహమాటం లేకుండా ప్రకటించాడు కె.ఎల్.రెడ్డి . “గత సంవత్సరం” ఏమిటి “నిరుడు” అనలేవా అని నలభై ఏళ్ల కింద రెడ్డి గారు అన్న మాట ఇప్పటికీ గుర్తుంది.
అప్పట్లో రామోజీరావు గారు రోజూ ఉదయానే పేపరు మొత్తం చదివి , తప్పులు మార్క్ చేసి ఘాటుగా కామెంట్లు రాసి అందరికీ సర్క్యులేట్ చేయించేవారు. ప్రతి మంగళవారం ఎడిటోరియల్ హెడ్స్ తో మీటింగు పెట్టి లోటుపాట్లు నిశితంగా చర్చిస్తుండేవారు. ఎప్పుడు చివాట్లు పడతాయోనని న్యూస్ ఎడిటర్ సంతపురి రఘువీరరావు , చీఫ్ సబ్ వేమూరి సుబ్రహ్మణ్యం అంతటి ఉద్దండులు కూడా భయపడుతుండేవారు. అలాంటి చండశాసనుడైన చైర్మన్ ను పట్టుకుని “మీరసలు పేపర్ చదువుతారాండి” అని ఒక రోజు మీటింగులో అడిగినవాడు కె.ఎల్.రెడ్డి. ఆమాటకు ఫకాల్న నవ్వాడు చైర్మన్.
కె.ఎల్.రెడ్డి ఎవరినీ లెక్క చెయ్యడు. నచ్చకపోతే ఎవరిమాటా వినడు . మొహాన్నే దులిపేస్తాడు. రోజుకు 14 గంటలు గొడ్డులా పనిచేస్తూ ఎప్పుడు చూసినా ఆఫీసులోనే పని చేసేవాడు. సోమాజిగూడ ఆఫీసులోనే లైబ్రరీ మీది సింగిల్ రూములో ఉండేవాడు. ఆజన్మ బ్రహ్మచారి. నిప్పులాంటి మనిషి. నిజాయతీ పరుడు. అల్ప సంతోషి. మాడభూషి శ్రీధర్ వంటి ఎందరో జర్నలిస్టులను తీర్చి దిద్దిన గురువు. మంచి మనిషి. స్నేహశీలి. కడదాకా నాకు మంచి మిత్రుడు. ఈనాడు తరవాత ఎన్నో కొత్త పత్రికలలో పని చేశాడు. ప్రతి పత్రికనూ మొత్తం తానే రాసి ఒంటి చేత్తో నెట్టుకొచ్చేవాడు. అలా ఎన్ని పత్రికలను నిర్వహించాడో అతడికే లెక్క లేదు.
తెలంగాణా ఊసే ఎవరికీ, ఏ నాయకుడికీ పట్టని కాలాన 1980లలోనే “తెలంగాణ” పత్రిక పెట్టి అన్యాయాలపై ధ్వజమెత్తి తెలంగాణ క్షేమం కోసం తపించి, నిస్వార్థంగా పోరాడిన వాడు కె.ఎల్.రెడ్డి. అప్పట్లో ఫతేమైదాన్ ప్రాంగణంలో చిన్నగదిలో ఉండి అక్కడినుంచే పత్రిక నడిపేవాడు.
2016 లో ఒక రోజు ఆంధ్రభూమి ఆఫీసులో కె.ఎల్.రెడ్డి నన్ను కలిశాడు. “నెలకు 15 వేలు ఉంటే హాయిగా గడిచిపోతుంది. రోజూ వచ్చి రాసి పెడతాను.” అన్నాడు. అప్పటికే 80 దాటాడు. గూని వచ్చింది. ఇంకా రాయటం నీ వల్ల కాదు. అది పరిష్కారం కూడా కాదు. నీ గురించి పత్రికలో ప్రత్యేక వ్యాసం వేద్దాం. దాన్ని చూపించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయానికి ప్రయత్నం చేద్దాం- అన్నాను.
సీనియర్ జర్నలిస్టు , రెడ్డి గారికి ఆప్తుడు గోవిందరాజు చక్రధర్ చక్కని వ్యాసం రాశారు. దానిని మా డైలీ ఫీచర్స్ సప్లిమెంటు “భూమిక” మొదటిపేజీలో ప్రముఖంగా వేశాము. ఎవరూ పనిగట్టుకుని పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా అందరికంటే ముందు ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు పొద్దున్నే ఆ వ్యాసం చూసి నేరుగా తానే కె.ఎల్.రెడ్డికి ఫోన్ చేసి పిలిచారు.
ముఖ్యమంత్రి అంతటివాడు తనను పిలిచి నీకు పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను అంటే “దాని వల్ల నాకు నెలకు 12 వేలు మిత్తి వస్తుందా”అని అడిగాడు కె.ఎల్.రెడ్డి . ముఖ్యమంత్రి నవ్వి ఎవరో ఆఫీసరును పిలిచి ఈయనకు ఎంత ఇస్తే నెలకు 12 వేలు మిత్తి వస్తుంది? “అని అడిగారట. “15 లక్షలు ” అని ఆన్సర్ వచ్చింది. సరే 15 లక్షలు ఇస్తున్నాను పొమ్మని చెప్పి అక్కడికక్కడే 15 లక్షల చెక్కును కె.ఎల్.రెడ్డి చేతికిచ్చారట ముఖ్యమంత్రి. ఈసంగతి చెప్పి, పదే పదే గుర్తు చేసుకుని ఆ మానవుడు ఎంత సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను. ఆనాడు ముఖ్యమంత్రి చూపిన ఆ సౌజన్యం వల్ల కె.ఎల్.రెడ్డికి వృద్ధాప్యంలో రాసుకుని బతకాల్సిన అగత్యం తప్పింది. అవసాన దశ సుఖంగా జరిగి పోయింది.
జర్నలిస్టులు, ఎర్నలిస్టులు ఎంత మంది ఉన్నా కె.ఎల్. రెడ్డి ఒక్కడు చాలు పాత్రికేయ వృత్తి గర్వంగా చూపించుకోవటానికి. ఎక్కడ ఉన్నా ప్రతి దసరాకూ ఫోన్ చేసి పట్టుబట్టి తన దగ్గరికి పిలిపించుకునే కె.ఎల్.రెడ్డి కన్నుమూయటం నాలాగే చాలా మంది జర్నలిస్టులకు తీరని వెలితి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

MVR Sastry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...