గవర్నర్ వెర్సస్ సీఎం!
తెలంగాణలో వరద రాజకీయం
రాష్ట్రపతి వీడ్కోలు విందును కాదని కొత్తగూడేనికి తమిళిసై
వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గాన భద్రాచలానికి కేసీఆర్
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
రాజకీయాలు అంటే ఎలా ఉండాలి? పారదర్శకంగా ఉండాలి… అనుమానం లేదు. కాళ్ళకు అడ్డం పడేలా ఉండకూడదు. ఇందులోనూ సందేహం లేదు. మరి తెలంగాణలో జరుగుతున్నది ఏమిటి? వరదలతో ఊపిరాడకుండా ఉన్న ప్రాంతాల్లో రాజకీయాలేమిటి? ఈ ప్రశ్న ఉదయించకపోదు ఎవరికైనా… రాష్ట్రాల్లో గవర్నర్లు ముఖ్యమంత్రులకు అడ్డం పడ్డం కొత్తేమీ కాదు. కానీ దానికీ సమయం సందర్భం ఉండాలి కదా! ఎందుకిలాంటి చర్యలు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించాలనుకోవడం కూడా తప్పే. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ ఉన్న వారెవరూ ఆ ఛాయలకు వెళ్ళకూడదు. ఏరియల్ సర్వే అయితే పరవాలేదు. హెలికాప్టర్లో చూస్తారు… వెళ్ళిపోతారు. దీనివల్ల ఎటువంటి ఆటంకమూ ఎవరికీ కలుగదు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇలాంటి అసాధారణ పర్యటనలు లేవనడంలో సందేహం లేదు. రామ్‌లాల్ కూడా ఎన్టీఆర్‌ను దించేయడానికి సహకరించారు తప్ప… ఇలా సహాయ చర్యలకు అడ్డం పడలేదు. కుముద్ బెన్ జోషి సైతం పరిపాలనపరమైన అడ్డంకులు సృష్టించారు గానీ ఇంకేమీ చేయలేదు. దేశం మొత్తం మీద ఇలాంటి చర్యలు తక్కువ. ఒకపక్క అధికారులు చెబుతూనే ఉన్నారు… పెద్దవారు పర్యటనలకు వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ రాజ్‌భవన్ దాటి, వరద తీవ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం దేనికి సంకేతం. అలాగని గవర్నర్ చేసింది తప్పని అనలేం. ఆవిడ ఆతృత ఆవిడకు ఉంటుంది. నా రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే నేను రాజ్‌భవన్‌లో ఉండడం సమంజసం కాదని అనుకుని ఉండవచ్చు. తప్పు లేదు. కానీ ఎంచుకున్న సమయం సరికాదని అనిపించకమానదు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే చేయాలని భావించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాక, తన కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో భద్రాచలం చేరారు. అదే సమయంలో గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. వరద బాధితులను కలుసుకున్నారు. మాట్లాడారు. తనకు తోచిన సహాయాన్ని అందించారు.
ఇదంతా బాగానే ఉంది. ఈ పర్యటన వరదలు తగ్గిన తరవాత చేయవచ్చు కదా. సీఎంకూ ఇది వర్తిస్తుంది. సహాయ చర్యలను ఇది ముమ్మాటికీ ఆటంకపరచడమే. ఏరియల్ సర్వే వరకూ ఓకే. అది సాధ్యం కాదని అన్నప్పుడు సీఎం ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉండాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో సహాయ చర్యలే చూడాలా.. వీవీఐపీల సేవలో తరించాలా అనేది తేల్చుకోలేక అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతుంది. సీఎం వస్తే వరద బాధిత ప్రాంతాలకు తృణమో పణమో సాయం ప్రకటించవచ్చు. గవర్నర్‌కు ఇలాంటి అవకాశం లేదు. ఆమె కేంద్ర ప్రతినిధిగా చూడడం మినహా…ఇంకేమీ చేయలేరు. ఆమె చేతిలో నిధులు ఏమీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం మినహా ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇదేదో గవర్నర్ వ్యవస్థను తక్కువ చేసి చూపడానికి చెప్పడం లేదు. ఒక గవర్నర్‌గా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం నిర్వహిస్తున్న వీడ్కోలు విందు సమావేశాన్ని సైతం కాదని గవర్నర్ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్ళడం వెనుక రాజకీయం లేదనగలమా! గవర్నర్ వ్యవస్థను ఇలాంటి చర్యలు తప్పు పట్టేలా చేస్తాయి. కాదంటారా! గవర్నర్ వంటి పదవులను దుర్వినియోగం చేయడం తగదని ఎన్టీరామారావు ఆనాడే మొత్తుకున్నారు. అంతా సవ్యంగా ఉంటే గవర్నర్‌ను తప్పు పట్టాల్సిన అవసరమే రాదు. పదవిలో కూర్చోబెట్టారని కేంద్రం చెప్పినట్లల్లా చేయడం హుందాతనం కిందకు రాదు. ఆ విషయాన్ని కేంద్రానికి గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి చెప్పగలగాలి. అలా చేస్తే పదవికే వన్నె తెచ్చినట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో గవర్నర్ వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో చూశాం. అంతకుముందు గోవాలో… అంతకంటే ముందు కర్ణాటకలో కూడా చూశాం. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికీ గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు.
తెలంగాణలో కొంతకాలంగా గవర్నర్‌తో సీఎంకు పడటం లేదు. దీనికి కారణమెవరో చెప్పనక్కరలేదు. ఆ పడకపోవడానికి తాజా పర్యటనలు శిఖరాయమానం. తెలంగాణ వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే… ఆ వరద జలాల్లో రాజకీయం జలకాలాడుతోంది.
వరద జలాలపై రాజకీయ జలకాటం
Date: