Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ముంపు ప్రాంతాల్లో తెలంగాణ సీఎం పరిశీల‌న‌

ముంపు ప్రాంతాల్లో తెలంగాణ సీఎం పరిశీల‌న‌

ముంపు శాశ్వత పరిష్కారానికి రూ.1,000 కోట్లు
భ‌ద్రాచ‌లంలో ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్
భ‌ద్రాచ‌లం, జూలై 17:
భద్రాచలం ప్రాంతంలో వరద బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలతో సహా, భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులకు కలిపి మొత్తంగా భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం చేపట్టే అన్నిరకాల పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయన్నారు. భ‌ద్రాచ‌లంలో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఏమ‌న్నారంటే..


వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లను, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు. భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.

వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తాం. ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలని కలెక్టరును సీఎం ఆదేశించారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి. బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలనీ అందుకు వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నామ‌నీ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.


నిరంత‌ర బ్లీచింగ్‌కు ఆదేశం
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయించాల‌ని ఆయ‌న హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావును ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తామ‌న్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులను భద్రాచలం రప్పించాలని సూచించారు. రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామ‌ని చెప్పారు. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తాన‌ని సీఎం హామీ ఇచ్చారు.

సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇంకా వర్షాల ముప్పు పోలేదు. ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగుతాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయనీ, ఫ‌లితంగా వరద ముంపు పెరుగుతోంద‌ని తెలిపారు.

నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి ఈ వరదలు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. కడెం ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదనీ, ఈసారి 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడిందనీ, దేవుని ద‌యే దీనికి కార‌ణ‌మ‌నీ కేసీఆర్ అన్నారు. వాగులు వంకలు పొంగుతున్నయి, చెరువులు, కుంటలు నిండాయి. వానలు తగ్గినయని ప్రజలు అలక్ష్యం వహించవద్దని సూచించారు.

దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు త‌న‌ దృష్టికి వచ్చాయనీ, మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తామ‌నీ తెలిపారు. బాధితులు ఎత్తైన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులొచ్చాయని చెప్పారు. భద్రాచలం, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.

పంటలు నీట మునిగాయనీ, సమీక్షించి తగు సహాయం అందిస్తామ‌ని రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే పున‌రావాసాల నుంచి బాధితుల‌ను ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామ‌న్నారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తామ‌న్నారు. ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్‌ హెచ్చ‌రించారు.


ఏరియ‌ల్ స‌ర్వే
భద్రాచలం పర్యటన అనంతరం, భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు. నదికి ఇరువైపులా నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, సీఎం ఏటూరునాగారం చేరుకున్నారు.


భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.

భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ