భయపెట్టి రాజకీయం చేస్తావా?
ఖబడ్దార్ వదిలిపెట్టేది లేదు
ఒంగోలు మహానాడులో బాబు హెచ్చరిక స్వరం
ఒంగోలు, మే 28: భయపెట్టిన కొద్దీ దూసుకు వెడతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్ భయపెట్టి రాజకీయం చేయాలని చూశారని చెప్పారు. సినిమా వాళ్ళను గుప్పెట్లో పెట్టుకోవాలని చూశారన్నారు. వైయస్ఆర్ వాళ్ళంతా గాలి మనుషులు, గాలి మాటలు అని బాబు విమర్శించారు. మహానాడుకు వచ్చే తెలుగుదేశం కార్యకర్తల కార్లలో గాలి తీసేశారనీ, అలాంటి పోలీసులకు గాలి తీసేస్తానని ఆయన హెచ్చరించారు.
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 8లక్షల కోట్ల రూపాయల రుణం చేసిందని చెప్పారు. ఇది జగన్‌మోహన్ రెడ్డి కడతాడా అని అడిగారు. ఇది కట్టాల్సింది ప్రజలేనని తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మద్య పాన నిషేధం అని చెబుతూ కొత్త బ్రాండ్లను తెచ్చారని చెప్పారు. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ 9 రూపాయలు ఇప్పుడు 21 రూపాయలు. ఈ తేడా 12 రూపాయలు జగన్‌మోహన్ రెడ్డి జేబులోకి వెడుతున్నాయని తెలిపారు. ఒక్క లిక్కర్‌లోనే జగన్‌మోహన్ రెడ్డికి ఆదాయం 5వేల కోట్లని చెప్పారు. ఏమిటీ దారుణమని తెలిపారు. ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ 6 నుంచి 7వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోందన్నారు. ఈ ప్రభుత్వంలో అన్నింటా దోపిడీయేనని చెప్పారు. మీ అవినీతిని మొత్తం కక్కిస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని బాబు హెచ్చరించారు.
భూములను కాపాడుకోవాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ఆన్‌లైన్‌లో మోసాలు చేస్తూ రికార్డులు మార్చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము లక్షా 70వేల కోట్ల రూపాయని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు పనిచేస్తున్నారా అని అడిగారు. జగన్ చేసిన విధ్వంసానికి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలు నాశనమయ్యాయన్నారు. రాష్ట్రం మొత్తం మీ సమస్యల్ని చెప్పండని కోరారు. సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికీ తేవాలని కోరారు. ఎవరైనా కేసులు పెడితే… మీ వెనుక ఉంటుందని భరోసా ఇచ్చారు. తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే… జగన్ ప్రభుత్వం వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. హామీలపై యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. అమ్మ ఒడి కుటుంబంలో అందరికీ కాకుండా ఒక్కరికే ఇచ్చారన్నారు… నాన్న బుడ్డీ మాత్రం ప్రియం చేశాడన్నారు. అందుకే క్విట్ జగన్ – సేవ్ ఏపీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆఖరుకు మీడియాను కూడా ఇక్కట్ల పాలుచేస్తున్నారని తెలిపారు. కరోనా కంటే ఎక్కువ అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని తెలిపారు. ఆయన పాలన వల్ల అన్ని పరిశ్రమలూ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయన్నారు. ప్రజల కోసం నేను ఉద్యమం చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పనితనం ఇదని చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ లూటీలు, రౌడీ మామూళ్ళతో వ్యాపారులు కుదేలయిపోతున్నారని చెప్పారు. రేపో ఎల్లుండో ఏపీ పరిస్థితి కూడా శ్రీలంకలా మారుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కుయుక్తులు పన్నొద్దు… అసత్యాలు చెప్పొద్దని జగన్‌ను హెచ్చరించారు. విభజన కంటే ఎక్కువ నష్టం జగన్‌మోహన్ రెడ్డి వల్లే జరిగిందన్నారు. డ్రైవర్‌ను హత్యచేసిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు… మరి ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏంచేశారని ప్రశంసించారు. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు వైసీపీలో బానిసలుగా సేవ చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అమరావతిపై మాట మార్చడం వల్ల రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గూగుల్ మ్యాప్‌లతో అవినీతి అంతుచూస్తామని చెప్పారు. పోలవరం మా హయాంలో 72శాతం పూర్తయ్యింది.. ఆ కాస్త పని ఈ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ఇరిగేషన్‌పై ఒక్క పైసా ఖర్చు పెటలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వెలుగొండతో పాటు అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామని చెప్పారు. చివరి భూముల వరకూ నీళ్ళిస్తామన్నారు. తమ హయాంలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచలేదనీ, కరెంటు కోతలు లేవనీ తెలిపారు. ఎన్టీఆర్ సాగునీటికి మీటర్లు వద్దన్నారు… జగన్మోహన్‌రెడ్డి మీటర్లు పెడతానంటున్నారనీ, రైతులు దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ తెచ్చాడా అంటూ ప్రశ్నించారు. కేసులకు భయపడి మీరు ఆయనకు వ్యతిరేకంగా పోరాడడం లేదని చెప్పారు. ఇష్టానుసారంగా అవినీతి చేస్తున్నారని చెప్పారు. పోలవరం రివర్స్ ప్రాజెక్టుగా మారిపోయిందని తెలిపారు. భూముల రేట్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో తారుమారయ్యాయన్నారు. మన ఆదాయం తరుగుదల ఆయన ఆదాయం పెరుగుదల… ఇది ప్రస్తుత పరిస్థితి అని చెప్పారు. ఈ పర్యాయం రాజ్యసభ ఎంపీల సీట్లను ఇష్టానుసారం ఇచ్చారన్నారు.
జగన్‌కు చంద్రబాబు వార్నింగ్‌ల వర్షం
Date: