గత ఎన్నికలలో కోల్పోయిన చాన్స్ ఈసారి దక్కుతుందా!!
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ద్రౌపది ముర్ము పేరు గుర్తుందా? ఒడిషాకు చెందిన గిరిజన నాయకురాలు. ప్రతిభాశీలి. జార్ఖండ్ గవర్నర్‌గా పూర్తికాలం పనిచేశారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఐదేళ్ళూ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి ఆమె మాత్రమే. ఇప్పుడు ఆవిడ గురించి ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? అవసరం ఉంది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముర్ము పేరు మరోసారి వార్తలలోకి వచ్చింది. గత ఎన్నికల్లోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. బీజేపీ నాయకురాలిగా ఒడిషాలో ఆమె పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు. అత్యున్నత స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు, మంత్రివర్గాల ఏర్పాటు సమయంలోనూ అణగారిన వర్గాలకు ఇటీవలి కాలంలో ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పేరు చివరి క్షణం వరకూ వెలుగులోకి రాలేదు. వాస్తవానికి ఆయన పేరు దేశంలో 90శాతం మందికి తెలీదు. బీజేపీ దళితుణ్ణి రాష్ట్రపతిని చేయాలని నిర్ణయించుకున్న మరుక్షణం ఆయనకు పదవీ యోగం పట్టింది.
దురదృష్టవశాత్తూ ప్రముఖుల ఎంపికలోనూ రాజకీయాలు చొరబడడం ఎక్కువైంది. పార్టీలు తమ మనుగడకు, గెలుపు అవకాశాలకూ అణగారిన వర్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్కడితో అది ఆఖరు. ఎంతమందికి పదవి ద్వారా సంక్రమించే అధికారం చలాయించే అవకాశం ఉంటుంది. తమపై ఉన్నవారు చెప్పేలా చేయడం తప్ప గత్యంతరం లేదు. అది పార్టీ నిర్ణయం అంటూ పార్టీ మీద తోసేస్తారు. అణగారిన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల పేరిట తాయిలాలు ఇస్తారు. ఎంతమంది ముఖ్యమంత్రులు తమ క్యాబినెట్ సహచరులకు స్వాతంత్య్రాన్ని ఇస్తున్నారు? ఈ ఒక్క పాయింట్ చాలు రాజకీయాల్లో వెనకబడిన వర్గాలను ఎలా స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోడానికి.
ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల అంశానికి వస్తే… బీజేపీ తరఫున పోటీకి ముర్ముకు విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం పైన అనుకున్న ఫార్ములానే. వాస్తవానికి పార్టీలో సీనియర్ మోస్ట్ అయిన లాల్ కృష్ణ అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. సీనియర్లను విస్మరిస్తున్నారనే అపప్రథను మూటగట్టుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దాన్ని పోగొట్టుకోవడానికి ఇదొక అవకాశమనే వారూ లేకపోలేదు.
తద్వారా ప్రజలలో పార్టీకి మరింత ఇమేజ్‌ను పెంచే వీలు ఉందంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగానే కాదు… పార్టీలో ఏ స్థానానికి ఎంపికవ్వాలన్నా సంఘ్ పరివార్ అనుమతి తప్పని సరి. బీజేపీలో సొంతంగా చేయడానికి సాధారణంగా వీలుకాదు. రాష్ట్రపతిలాంటి ఎన్నిక సందర్భాలలో వేరొకరికి అవకాశమే ఉండదు. రాష్ట్రపతి పదవిని ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆశిస్తారు. కానీ బహిరంగంగా చెప్పలేరు.
వీళ్ళే కాకుండా కొంతమంది ఇతర పార్టీల వారు కూడా ఆ పదవిపై ఆశపెట్టుకున్నారు. శరద్ పవార్, గులాం నబీ ఆజాద్ లాంటి నేతలూ ఇందుకు అతీతం కాదు. రాష్ట్రపతి పదవికి ఎంపికంటే ఆషామాషీ కాదు. పొలిటికల్ ఫార్ములాకు ఇది అతీతం. చూస్తూ చూస్తూ వేరే పార్టీ నేతలకు ఈ పదవిని కట్టబెట్టరు. ఎవర్ని ఎంపిక చేస్తే తమ పార్టీకి లాభమనే ఆలోచిస్తారు. కిందటిసారి దళితుణ్ణి రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు కాబట్టి… ఈసారి గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముకు అవకాశం దక్కవచ్చనేది ఢిల్లీ పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తున్న విశ్లేషణ.
ముర్ము… ఒడిషాకు చెందిన గిరిజన తెగకు చెందిన బీజేపీ నేత. ఆమెకు అవకాశం వస్తే… రాష్ట్రపతి అయిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు లభిస్తుంది. ఈ పదవికోసం బీజేపీలో ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారు. అందర్నీ దాటుకుని ఆమె రాగలదా? ఆర్ఎస్ఎస్ చల్లని వీక్షణాలు ఆమెపై ప్రసరిస్తాయా? మరో రెండువారాలు ఎదురు చూడాల్సిందే. అనేక సందర్బాలలో ఈ పని చేసింది తామేనని చెప్పుకునే బీజేపీ ముర్మును ఎంపికచేసి, ఆ ఘనతను కూడా దక్కించుకుంటుందా?